కోడెలకు ఫిరాయింపు ఎమ్మెల్యేల దెబ్బ

April 10, 2018 at 7:33 pm

ఇప్ప‌టికే ప్ర‌త్యేక హోదా విష‌యంతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న టీడీపీకి మ‌రో షాక్ త‌గిలింది. పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేల‌పై ఎందుకు చ‌ర్య‌లు తీసుకోవ‌డం లేద‌నంటూ హైకోర్టు స్పీక‌ర్ కోడెల శివ‌ప్ర‌సాద్‌కు నోటీసులు జారీ చేయ‌డం రాజ‌కీయ‌వ‌ర్గాల్లో క‌ల‌క‌లం రేపుతోంది. గ‌త ఎన్నిక‌ల త‌ర్వాత అధికారంలోకి వ‌చ్చిన ఇద్ద‌రు చంద్రులు.. అంటే తెలంగాణ‌లో టీఆర్ఎస్ అధినేత సీఎం కేసీఆర్‌, ఏపీలో టీడీపీ అధినేత సీఎం చంద్ర‌బాబు విప‌క్షాల‌ను టార్గెట్ చేస్తూ ఆప‌రేష‌న్ ఆక‌ర్ష్ చేప‌ట్టారు. ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు ఆపరేషన్ ఆకర్ష్ ద్వారా వైసీపీ టికెట్లపై విజయం సాధించిన ఎమ్మెల్యేల్లో 23 మందిని తన పార్టీలోకి లాగేశారు. వీరిలో నలుగురు ఎమ్మెల్యేలను తన కేబినెట్ లో చేర్చుకోవ‌డంపై అటు విప‌క్షాల నుంచి, ఇటు సొంత పార్టీ నేత‌ల నుంచి కూడా విమ‌ర్శ‌లు వ‌చ్చాయి.

 

రెండేళ్లుగా తాత్సారం..

 ఈ నేపథ్యంలో చేసిన వైసీపీ… తన టికెట్లపై విజయం సాధించి ఆ తర్వాత ఎమ్మెల్యే పదవులకు రాజీనామాలు చేయకుండానే టీడీపీ తీర్థం పుచ్చుకున్న వారి శాసనసభ్యత్వాలను రద్దు చేయాలని స్పీకర్ కోడెల శివప్రసాద్ కు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. ఇది జరిగి దాదాపుగా రెండున్నరేళ్లు అవుతోంది. ఆ తర్వాత కూడా తన ఫిర్యాదును పరిశీలించాలని కోరుతూ పలుమార్లు వైసీపీ శాసనసభాపక్షం స్పీకర్ కు గుర్తు చేసింది. అయితే స్పీకర్ కోడెల ఇప్పటిదాకా చర్యలు చేపట్టిన దాఖలానే కనిపించలేదన్న వాదన కూడా లేకపోలేదు. 

 

ఈ క్రమంలోనే స్పీకర్ తమ ఫిర్యాదు పట్ల దృష్టి సారించడం లేదని ఆరోపిస్తూ వైసీపీ నేత‌, గుంటూరు జిల్లా మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి హైకోర్టును ఆశ్రయించారు. పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టాన్ని ప‌ట్టించుకోకుండా పార్టీ మారిన ఎమ్మెల్యేల‌పై చర్యలు తీసుకోవడంలో స్పీకర్ ఎందుకు తాత్సారం చేస్తున్నారో తమకు అర్థం కావడం లేదని ఆయన తన పిటిషన్ లో హైకోర్టుకు విన్నవించారు.

 

మూడు వారాల్లో కౌంట‌ర్ దాఖాలు..

 ఈ పిటిషన్ ను విచారణకు స్వీకరించిన హైకోర్టు ధర్మాసనం నేడు దానిపై విచారణ చేపట్టింది. ఈ సందర్బంగా హైకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. పార్టీ ఫిరాయింపులకు పాల్పడిన ఎమ్మెల్యేలపై ఎందుకు చర్యలు చేపట్టడం లేదన్న విషయంపై సమాధానమిస్తూ కౌంటర్ దాఖలు చేయాలని స్పీకర్ కోడెలకు నోటీసులు జారీ చేసింది. మూడు వారాల్లోగా కౌంటర్ దాఖలు చేయాల్సిందేనని ఆదేశించింది. మొత్తంగా ఈ వ్యవహారం స్పీకర్ కోడెలకు కాస్త ఇబ్బందికరమేనని చెప్పక తప్పదు. 

 

రాజ్యసభలో పార్టీ మారిన ఎంపీలపై అనర్హత వేటు వేస్తూ రాజ్యసభ చైర్మన్ స్థానంలో ఉన్న భారత ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు ఇటీవలే సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఈ వ్యవహారంలో స్పీకర్ కోడెల ఎలా స్పందిస్తారోనన్న విషయంపై స‌ర్వ‌త్రా ఆసక్తి రేపుతోంది. ఇదిలా ఉండ‌గా తెలంగాణ‌లో కూడా టీడీపీ, కాంగ్రెస్ పార్టీల నుంచి అధికార టీఆర్ఎస్లో చేరిన ఎమ్మెల్యేల‌పై కూడా ఇప్పుడు చ‌ర్చ జ‌రుగుతోంది.

 

కోడెలకు ఫిరాయింపు ఎమ్మెల్యేల దెబ్బ
0 votes, 0.00 avg. rating (0% score)

commentsRelated Posts


Share
Share