కొండా సురేఖ పోటీ చేసేది అక్కడి నుంచే

October 1, 2018 at 11:56 am

ఉమ్మ‌డి వ‌రంగ‌ల్ జిల్లాలో రాజ‌కీయాలు ర‌స‌వ‌త్త‌రంగా మారుతున్నాయి. వ‌రంగ‌ల్ తూర్పు తాజా మాజీ ఎమ్మెల్యే కొండా సురేఖ దంప‌తులు టీఆర్ఎస్‌ను వీడి కాంగ్రెస్ పార్టీలో చేరిన త‌ర్వాత ప‌రిణామాలు వేగంగా జ‌రుగుతున్నాయి. వ‌చ్చే ఎన్నిక‌ల్లో కొండా సురేఖ ఎక్క‌డి నుంచి బ‌రిలోకి దిగుతున్నారో తెలిసిపోయింది. ఆమె మ‌న‌సులోని మాట బ‌య‌ట‌పెట్టారు. వ‌చ్చే ఎన్నిక‌ల్లో తాను ప‌ర‌కాల నియోజ‌క‌వ‌ర్గం నుంచి పోటీ చేస్తాన‌ని ఆమె స్ప‌ష్టం చేశారు. ప్ర‌జ‌ల కోరిక మేర‌కే ఈ నిర్ణ‌యం తీసుకుంటున్న‌ట్లు ఆమె చెప్పుకొచ్చారు. అయితే.. ఇదే స‌మ‌యంలో భూపాల‌ప‌ల్లి, వ‌రంగ‌ల్ తూర్పు నుంచి పోటీ చేయాల‌ని ఆయా నియోజ‌క‌వ‌ర్గాల ప్ర‌జ‌లు కూడా కోరుతున్నార‌ని ఆమె అన్నారు. ఇప్పుడీ వ్యాఖ్య‌లు అటు కాంగ్రెస్‌లో, ఇటు అధికార టీఆర్ఎస్‌లో స‌రికొత్త చ‌ర్చ‌కు దారితీస్తున్నాయి.

dc-Cover-ha8f4ommvtfnf9ivvvlshr6ht2-20180909011006.Medi

కొండా సురేఖ మాట‌ల్లోని ఆంత‌ర్యమేమిటో తెలుసుకునే ప‌నిలో ప‌డ్డాయి రాజ‌కీయ‌వ‌ర్గాలు. ఆదివారం పరకాల నియోజకవర్గంలోని ఆత్మకూరు, దామెర, పరకాలలో ఇటీవల మృతిచెందిన వారి కుటుంబ సభ్యులను కొండా సురేఖ‌ పరామర్శించారు. ఈ సందర్భంగా పరకాలలో ఆమె మాట్లాడుతూ పరకాల, భూపాలపల్లి, వరంగల్‌ తూర్పు నియోజకవర్గాల నుంచి పోటీ చేయాలని ప్ర‌జలు ఒత్తిడి తెస్తున్నారని అన్నారు. అంతేగాకుండా.. వరంగల్‌ తూర్పు, భూపాలపల్లి నియోజకవర్గాల్లో పార్టీ అభ్యర్థులను గెలిపించాల్సిన బాధ్యత కూడా తనపైనే ఉందని ఆమె చెప్ప‌డం గ‌మ‌నార్హం. వరంగల్‌ జిల్లాలో కాంగ్రెస్‌ పార్టీ నుంచి 10 సీట్లు గెలుపొందుతామని ఆమె ధీమా వ్యక్తం చేశారు. అయితే.. ఈ మేర‌కు కాంగ్రెస్ అధిష్ఠానం హామీ ఇచ్చిందా..? లేక త‌మ కోరిక‌ను బ‌య‌ట‌పెడుతున్నారా..? అన్న‌ది మాత్రం తెలియ‌డం లేదు.

కాంగ్రెస్ పెద్ద‌లు భూపాల‌ప‌ల్లి, వ‌రంగ‌ల్‌తూర్పు టికెట్లు ఎవ‌రికి ఇస్తార‌న్న‌దానిపై పార్టీలో ఆస‌క్తిక‌ర‌మైన చ‌ర్చ జ‌రుగుతోంది. సిట్టింగ్ స్థాన‌మైన వ‌రంగ‌ల్ తూర్పు నుంచిగాకుండా.. ప‌ర‌కాల నుంచి పోటీ చేస్తాన‌ని కొండా సురేఖ చెప్ప‌డం గ‌మ‌నార్హం. అయితే.. కాంగ్రెస్ పార్టీ వ్యూహాత్మ‌కంగానే కొండా సురేఖ‌ను ప‌ర‌కాల నుంచి బ‌రిలోకి దించుతున్న‌ట్లు తెలుస్తోంది. ప‌రకాల నుంచి ఆమె పోటీ చేస్తే.. అటు భూపాల‌ప‌ల్లితోపాటు వ‌రంగ‌ల్ తూర్పు నియోజ‌క‌వ‌ర్గాల అభ్య‌ర్థుల‌ను గెలిపించ‌డం సుల‌భం అవుతుంద‌న్న ఆలోచ‌న‌లో కాంగ్రెస్ ఉన్న‌ట్లు తెలుస్తోంది. ఇక ఇదే స‌మ‌యంలో వ‌రంగ‌ల్ తూర్పు టికెట్‌ను ముస్లిం మైనార్టీ వ‌ర్గానికి కేటాయించేందుకు సానుకూలంగా ఉన్న‌ట్లు స‌మాచారం. వ‌రంగ‌ల్ ప‌ట్ట‌ణంలో ముస్లింలు ఎక్కువ సంఖ్య‌లోనే ఉంటారు.

అందుకే ఆ వ‌ర్గానికి టికెట్ ఇస్తే గెలుపు సుల‌భ‌మ‌వుతుంద‌ని కాంగ్రెస్ అధిష్ఠానం అంచ‌నా వేస్తున్న‌ట్లు తెలుస్తోంది. మ‌రోవైపు ప‌ర‌కాల నుంచి కొండా సురేఖ పోటీ చేయ‌డం వ‌ల్ల ప‌ర‌కాల‌తోపాటు, భూపాల‌ప‌ల్లి ప్ర‌జ‌ల్లో కొండా దంప‌తులు త‌మకు స్థానికంగా అందుబాటులో ఉన్నార‌న్న భావ‌న‌కు వ‌స్తార‌ని, దీంతో మూడు నియోజ‌క‌వ‌ర్గాల్లో అధికార టీఆర్ఎస్ అభ్య‌ర్థుల‌ను మ‌ట్టిక‌రిపించ‌వ‌చ్చున‌ని అనుకుంటున్న‌ట్లు స‌మాచారం. అయితే.. ప‌ర‌కాల నుంచి టికెట్ ఆశిస్తున్న ఇత‌ర కాంగ్రెస్ నేత‌లు కొండా సురేఖ మాట‌పై ఏమంటారో చూడాలి మ‌రి.

కొండా సురేఖ పోటీ చేసేది అక్కడి నుంచే
0 votes, 0.00 avg. rating (0% score)

commentsRelated Posts


Share
Share