టీఆర్ఎస్‌లో కొండా క‌ల‌క‌లం..

May 15, 2018 at 10:54 am
Konda Surekha, TRS, comments, speaker, Bhupalipalli

ఎన్నిక‌ల‌కు ఇంకా ఏడాది స‌మ‌యం ఉండ‌గానే భూపాల‌ప‌ల్లి నియోజ‌క‌వ‌ర్గం టికెట్ కోసం తీవ్ర పోటీ ఏర్ప‌డుతోంది. చాలా రోజులుగా జ‌రుగుతున్న ప్ర‌చారం నిజ‌మేన‌ని వ‌రంగ‌ల్ తూర్పు ఎమ్మెల్యే కొండా సురేఖ తేల్చిప‌డేశారు. త‌న మ‌న‌సులోని మాట‌ను సూటిగా చెప్పేశారు. వ‌చ్చే ఎన్నిక‌ల్లో భూపాల‌ప‌ల్లి నియోజ‌క‌వ‌ర్గం నుంచి త‌మ వార‌సురాలిగా కూతురు సుష్మితా ప‌టేల్‌ను బ‌రిలోకి దింపుతామ‌ని బ‌హిరంగంగానే చెప్ప‌డం ఇప్పుడు హాట్‌టాపిక్‌గా మారింది. ఏకంగా సిట్టింగ్ ఎమ్మెల్యే, స్పీక‌ర్ సిరికొండ మ‌ధుసూద‌నాచారిపై కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. స్పీక‌ర్‌పై ప్ర‌జ‌ల్లో తీవ్ర వ్య‌తిరేక‌త ఉంద‌ని, ఆయ‌న‌కు టికెట్ ఇవ్వ‌కుంటే ఇక్క‌డి నుంచి త‌మ కూతురిని బ‌రిలోకి దింపుతామ‌ని కొండా స్ప‌ష్టం చేశారు. 

 

ఇటీవ‌ల భూపాల‌ప‌ల్లి నియోజ‌క‌వ‌ర్గంలోని గ‌ణ‌పురం మండల కేంద్రంలో జ‌రిగిన ఓ వివాహ వేడుకకు హాజరైన సంద‌ర్భంగా కొండా సురేఖ‌ విలేకరులతో మాట్లాడారు. పాత నియోజ‌క‌వ‌ర్గం శాయంపేట ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఇక్కడి ప్రజలతో విడదీయరాని అనుబంధం ఏర్పడిందన్నారు. ఈ అనుబంధాన్ని ఎవ్వ‌రూ విడ‌దీయ‌లేర‌ని బ‌ల‌మైన మాట‌లు మాట్లాడారు. ఇవి నేరుగా స్పీక‌ర్‌ను ఉద్దేశించే ఆమె మాట్లాడార‌న్న‌ది కూడా తెలుస్తోంది.

 

సిట్టింగ్‌ ఎమ్మెల్యే స్పీక‌ర్ సిరికొండ మ‌ధుసూద‌నాచారిపై ప్ర‌జ‌ల్లో తీవ్ర వ్య‌తిరేకత ఉంద‌నీ, సింగ‌రేణి ఎన్నిక‌లే ఇందుకు నిద‌ర్శ‌న‌మంటూ ఆమె చేసిన వ్యాఖ్య‌లు పార్టీ వ‌ర్గాల్లో క‌ల‌క‌లం రేపుతున్నాయి. స్పీక‌ర్‌కు అవకాశం లేకపోతే తమ కూతురు సుస్మితాపటేల్‌కు భూపాలపల్లి నుంచి టికెట్‌ ఆశిస్తున్నామని తెలిపారు. గతంలో ఇక్కడి ప్రజలకు తాము సేవలందించామని, సుస్మితాపటేల్‌ను ప్రతినిధిగా ప్రజలు కోరుకుంటున్నారని పేరొన్నారు.

 

ఇదిలా ఉండ‌గా.. ఎమ్మెల్యే కొండా సురేఖ వ్యాఖ్య‌ల‌పై స్పీక‌ర్ సిరికొండ కూడా ఘాటుగా స్పందించారు. భూపాలపల్లి నియోజకవర్గంలో తనను ఓడించిన వారికి స్వర్ణకంకణం తొడిగి, క్షీరాభిషేకం చేస్తానని స‌వాల్ విసిరారు. భూపాలపల్లి నియోజకవర్గంలో కనీసం కొన్ని గ్రామాల పేర్లు తెలియని వారు కూడా ఇక్క‌డికి వ‌చ్చి మాట్లాడుతున్నారు.. తస్మాత్‌ జాగ్రత్త..అని హెచ్చరించారు. తాటాకు చప్పుళ్లకు భయపడేది లేదని ఆయ‌న దీటుగా స్పందించారు. 70 ఏళ్లలో చేయని అభివృద్ధి నాలుగేళ్లలో చేశామని, ప్రజలను మోసం చేసేందుకు గ్రామాల్లో తిరుగుతున్న కొంతమంది నాయకులను నమ్మి మోసపోవద్దని స్పీకర్‌ పేర్కొన్నారు.

 

వ‌చ్చే ఎన్నిక‌ల్లో తాను తిరిగి భూపాల‌ప‌ల్లి నుంచే అసెంబ్లీకి పోటీ చేస్తాన‌ని… త‌నను అడ్డుకునే వాళ్లే లేర‌ని, తాను తెలంగాణ ఉద్య‌మంలో ముందునుంచి ఉన్న వ్య‌క్తిని అని త‌న‌కు తిరుగేలేద‌ని ఆయ‌న కుండ‌బ‌ద్ద‌లు కొట్టేశారు. అదేవిధంగా కొండా స‌రేఖపై భూపాల‌ప‌ల్లి నియోజ‌క‌వ‌ర్గంలోని ప్ర‌తీ మండ‌లం నుంచి స్పీక‌ర్ అనుచ‌రులు విలేక‌రుల స‌మావేశాలు నిర్వ‌హించి ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. స్పీక‌ర్‌పై ప్ర‌జ‌ల్లో వ్య‌తిరేకత ఉందంటూ కొండా సురేఖ చేసిన వ్యాఖ్య‌ల్లో ఇసుమంతైనా నిజం లేద‌ని భూపాల‌ప‌ల్లి ప‌ట్ట‌ణ పార్టీ అధ్యక్షుడు సాంబ‌మూర్తి, మున్సిప‌ల్ చైర్‌ప‌ర్స‌న్ బండారి సంపూర్ణ అన్నారు. స్పీక‌ర్‌పై అడ్డ‌గోలుగా మాట్లాడితే ఊరుకునేది లేద‌ని హెచ్చ‌రించారు. మున్ముందు ఈ టికెట్ పోరు ఎలాంటి ప‌రిణామాల‌కు దారితీస్తాయో వేచి చూడాల్సిందే.

 

టీఆర్ఎస్‌లో కొండా క‌ల‌క‌లం..
0 votes, 0.00 avg. rating (0% score)

comments



Related Posts


Share
Share