
కర్ణాటక రాజకీయాల్లో అనూహ్య పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. రాజకీయ ముఖచిత్రం నిమిషాల్లో మారిపోతోంది. తొలుత స్పష్టమైన ఆధిక్యంలో దూసుకుపోయి అధికారం చేజిక్కించుకుంటుందని బీజేపీ నేతలు భావించినా.. చివరకు మ్యాజిక్ ఫిగర్‌కు అడుగు దూరంలోనే పార్టీ నిలిచిపోయింది. దీంతో ఏ పార్టీకి స్పష్టమైన మెజారిటీ దక్కకపోవడంతో రాజకీయాలు క్షణాల్లో మారిపోయాయి. ఈ నేపథ్యంలో అనూహ్యంగా అధికారం తమకు దక్కకపోయినా ఫర్లేదు కానీ బీజేపీకి మాత్రం వెళ్లకుండా చూస్తున్నారు కాంగ్రెస్ నేతలు. ప్రధానంగా కింగ్ మేకర్ అయిన జేడీఎస్‌తో చర్చలు మొదలయ్యాయి. అన్నీ సక్రమంగా జరిగితే ఆ పార్టీ అధినేత కుమార స్వామికి సీఎం పదవి ఇచ్చే అవకాశాల పైనా మంతనాలు జరుపుతున్నారు. ఈ నేపథ్యంలో ఏ క్షణాన ఏం జరుగుతుందోననే ఉత్కంఠ పెరుగుతోంది.
హంగ్ అన్నారు.. లేదు లేదు కర్ణాటకలో మొదట్లో ఉన్న ఆధిక్యం చూసి కమల వికాసం తప్పదనన్నారు. హంగ్‌కు అవకాశమే లేదన్నారు. కానీ అటు తిరిగి ఇటు తిరిగి.. చివరికి సర్వేల మాటే నిజమైంది. కర్ణాటకలో ఏ పార్టీకి స్పష్టమైన ఆధిక్యం రాకపోవడంతో అందరిలోనూ ఆందోళన నెలకొంది. తొలి నుంచి భావిస్తున్నట్లుగానే జేడీఎస్ `కింగ్ మేకర్` అయింది. ఇప్పుడు ఆ పార్టీ ఎవరికి మద్దతు ఇస్తే వాళ్లదే అధికార పీఠమని తేలిపోయింది. మధ్యాహ్నం 12 గంటల వరకూ 115 స్థానాల్లో బీజేపీ అధిక్యతలో ఉన్నట్లు లెక్కలు తేలగా.. కేవలం రెండున్నర గంటల వ్యవధిలో పార్టీ చేతి నుంచి 12 స్థానాలు చేజారిపోవటంతో ఒక్కసారిగా సమీకరణాల్లో మార్పులు చోటు చేసుకుంటున్నాయి. రెండున్నర గంటల వ్యవధిలో ఫుల్ మెజార్టీ కాస్తా.. ప్రభుత్వ ఏర్పాటుకు ఎనిమిది తొమ్మిది మంది అవసరమైన పరిస్థితి ఏర్పడింది.
దీంతో.. జేడీఎస్ కు బయట నుంచి మద్దతు ఇస్తూ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు సాయం చేసేందుకు కాంగ్రెస్ ఓకే చెప్పేసింది. కర్ణాటక ఫలితాలు ఎలా ఉన్నా.. తమ అవసరం ఏమైనా ఉంటుందన్న ఉద్దేశంతో ఒక పూట ముందే బెంగళూరుకు చేరుకున్న గులాం నబీ అజాద్ పావులు కదపటం మొదలెట్టారు. తమకు అధికారం అక్కర్లేదని.. జేడీఎస్ ప్రభుత్వానికి మద్దతు ఇస్తామని.. కుమారస్వామిని సీఎంగా ప్రమాణస్వీకారం చేసేందుకు తమకు ఎలాంటి అభ్యంత రం లేదని చెప్పిన ప్రకటనతో సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. తమకు స్పష్టమైన మెజార్టీ ఇచ్చారన్న ఉద్దేశంతో విజయోత్సవాల్లో మునిగిపోయిన బీజేపీ నేతలకు షాకిచ్చేలా పరిణామాలు చోటు చేసుకున్నాయి. 115 స్థానాల్లో గెలవటం ఖాయమన్న స్థానం నుంచి.. ఇప్పుడు వారు 103 స్థానాలకే పరిమితం కావటంతో సీన్ మారిపోయింది.
మేజిక్ మార్కుకు కాస్త దూరంలో బీజేపీ జైత్రయాత్ర ఆగిపోవటంతో.. కాంగ్రెస్ ఒక్కసారిగా అలెర్ట్ అయ్యింది. బీజేపీకి అవకాశం ఇవ్వకుండా జేడీఎస్ కు సీఎం పదవిని ఆఫర్ ఇచ్చింది. దీంతో.. కాంగ్రెస్ తో కలుద్దామా? వద్దా? అన్న ఆలోచనలో ఉన్న కుమారస్వామి.. ఇప్పుడు కీలకంగా మారారు. వెతుక్కుంటూ వచ్చిన సీఎం పదవిని ఆయన ఓకే చేసే అవకాశం ఉందంటున్నారు. వరుస దెబ్బలతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న జేడీఎస్.. తానే అధికారపక్షంగా అవతరించే ఛాన్స్ వస్తే.. ఆ అద్భుత అవకాశాన్ని ఎందుకు వదులుకుంటుందనేది విశ్లేషకుల అభిప్రాయం. ఏదిఏమైనా మరికొద్ది నిమిషాల్లో ఈ సస్పెన్స్‌కు తెరపడటం ఖాయమని తెలుస్తోంది.