మ‌రో కుమార‌స్వామి కాచుకుని ఉన్నాడా…!

June 8, 2018 at 2:56 pm
Kumaraswami, chthisghad, Ramana Singh, elections

వ‌చ్చే న‌వ‌బంర్‌లో నిర్వ‌హించే రాజ‌స్థాన్‌, మ‌ధ్య‌ప్ర‌దేశ్‌, ఛ‌త్తీస్‌ఘ‌డ్ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నిక‌ల‌పై ఆస‌క్తిక‌ర‌మైన చ‌ర్చ జ‌రుగుతోంది. అయితే చివ‌రి వ‌ర‌కూ తీవ్ర ఉత్కంఠ రేపిన క‌ర్ణాట‌క ఎన్నిక‌ల నేప‌థ్యంలో ఇప్పుడు ఛ‌త్తీస్‌ఘ‌డ్‌లోనూ మ‌రో కుమార‌స్వామి అవ‌త‌రిస్తార‌నే ఊహానాగానాలు అప్పుడే మొద‌ల‌య్యాయి. ఈ రాష్ట్రంలో 2003 నుంచి బీజేపీ అధికారంలో ఉంటోంది. మ‌ధ్య‌ప్ర‌దేశ్ నుంచి విడిపోయిన‌ప్ప‌టి నుంచి ర‌మణ్‌సింగే సీఎంగా ఉంటున్నారు. ఆయ‌న వ్య‌క్తిగ‌త ఇమేజ్ క్లీన్‌గా ఉండ‌డంతో ర‌మ‌ణ్‌సింగ్‌కు ఇక్క‌డ తిరుగులేకుండా పోతోంది.

అయితే 2013ఎన్నిక‌ల వ‌ర‌కూ ఇక్క‌డ కాంగ్రెస్‌, బీజేపీ మ‌ధ్య‌నే ప్ర‌ధాన పోటీ ఉండేది. కానీ.. ఈ సారి ప‌రిస్థితి పూర్తిగా మారింది. కాంగ్రెస్ నేత‌, మాజీ ముఖ్య‌మంత్రి అజిత్‌జోగి 2016లో వేరుకుంప‌టి పెట్టుకుని జ‌న‌తా కాంగ్రెస్ చ‌త్తీస్‌ఘ‌డ్(జేసీసీ) పేరిట సొంత పార్టీ ఏర్పాటు చేసుకున్నారు. ఇప్పుడు అజిత్ జోగి నేతృత్వంలో జ‌న‌తా కాంగ్రెస్ పార్టీ కూడా బ‌రిలోకి దిగుతుండ‌డంతో రాజ‌కీయ స‌మీక‌ర‌ణాలు వేగంగా మారే అవ‌కాశాలు ఉన్నాయ‌ని ప‌లువురు రాజ‌కీయ విశ్లేష‌కులు అంటున్నారు.

బీజేపీ నేత‌ రమణ్‌ సింగ్‌ 15 ఏళ్లగా ముఖ్యమంత్రిగా కొనసాగుతున్నారు. 2000 లో మధ్యప్రదేశ్‌ నుండి విడిపోయి రాష్ట్రం ఏర్పడినపుడు కాంగ్రెసు ముఖ్యమంత్రి అజిత్‌ జోగి ముఖ్యమంత్రి అయ్యాడు. ఛ‌త్తీస్‌ఘ‌డ్‌లో మొత్తం 90 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. 2003లో ఎన్నికల్లో బీజేపీ 39.3% ఓట్లు సాధించి, 50 సీట్లు గెలుచుకుంది. కాంగ్రెసుకు దాని కంటె 2.6% తక్కువ ఓట్లు సాధించి, 13 తక్కువ సీట్లు వచ్చాయి. 2008 వచ్చేసరికి ఓట్లలో తేడా 1.7%, సీట్లలో తేడా 12 (50-38) అయింది. 2013లో ఓట్లలో తేడా 0.8%, సీట్లలో తేడా 10 (49-39) అయింది.

ప్ర‌స్తుతం రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ వర్గ సమస్యలకు దూరంగా, కొంత బలంగా కనిపిస్తోంది. అజిత్‌జోగి వేరుకుంపటి పెట్టుకున్నాక ఆపార్టీలో ముఠా కుమ్ములాటలు తగ్గాయి. ఒకవైపు మూడుసార్లు ముఖ్యమంత్రిగా కొనసాగుతున్న రమణ్‌సింగ్‌, మరోవైపు ప్రాంతీయపార్టీ నేత అజిత్‌జోగి, మరోవైపు పీసీసీ అధ్యక్షుడు భూపేష్‌భగేల్‌ నేతృత్వంలో మూడు పార్టీలూ బలంగా కనిపిస్తున్నాయి. ఇక‌ కాంగ్రెస్‌, భాజపాల్లో టికెట్లురాని వారిని ఆకట్టుకొని వచ్చే ఎన్నికల్లో గట్టిపోటీనివ్వాలని జేసీసీ నేత‌ అజిత్‌జోగీ ప్రణాళికలు రూపొందిస్తున్నారు.

గత ఎన్నికల్లో మొత్తం 90 స్థానాలకుగాను భాజపా 49, కాంగ్రెస్‌ 39 గెలుచుకున్నాయి. ఈసారి తాను అధికారంలోకి రాకున్నా.. బీజేపీ అడ్డుకోవ‌డ‌మే ల‌క్ష్యంగా కాంగ్రెస్ పార్టీ పావులు క‌దుపుతోంది. ఈసారి వ‌చ్చే అసెంబ్లీ ఎన్నిక‌ల్లో ఒక్క శాతం ఓట్లు కూడా ఫ‌లితాల‌ను తారుమారు చేస్తాయ‌ని ప‌లువురు రాజ‌కీయ విశ్లేష‌కులు చెబుతున్నారు. ఇన్నాళ్లూ బీజేపీ, కాంగ్రెసుల మధ్యనే ముఖాముఖీ పోటీ గానీ ఈసారి 2016 జూన్‌లో కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చేసి ‘జనతా కాంగ్రెస్‌ ఛత్తీస్‌గఢ్‌స‌ (జేసీసీ) పేర సొంత పార్టీ పెట్టుకున్న అజిత్‌ జోగీ కూడా రంగంలో ఉన్నాడు. ఎవరి ఓట్లు, ఏ మేరకు చీల్చుతాడో తెలియని ప‌రిస్థితి నెల‌కొంది.

అయితే ఎవరు నెగ్గినా అతను కింగ్‌మేకర్‌ అవుతాడని, లేదా కర్ణాటక తరహాలో జేడీఎస్ నేత‌ కుమారస్వామిలా ఏకంగా కింగే అయిపోతాడని అనుకుంటున్నారు. ఇదే స‌మ‌యంలో కాంగ్రెస్ పార్టీ ధోర‌ణిలోనూ మార్పు వ‌స్తోంది. మ‌రోవైపు ఛ‌త్తీస్‌ఘ‌డ్‌లో బీఎస్పీ ప్ర‌తీసారి దాదాపు ఐదుశాతం ఓట్లు సాధిస్తోంది. ఇప్ప‌టికే కాంగ్రెస్‌, బీఎస్పీలు పొత్తు దిశ‌గా అడుగులు వేస్తున్నాయి. ఇదే స‌మ‌యంలో కాంగ్రెస్ పార్టీ అజిత్‌జోగితో కూడా క‌లిసి న‌డిస్తే బీజేపీని ఓడించ‌డం చాలా సులువు అవుతుంద‌ని ప‌లువురు రాజ‌కీయ విశ్లేష‌కులు భావిస్తున్నారు.

మ‌రో కుమార‌స్వామి కాచుకుని ఉన్నాడా…!
0 votes, 0.00 avg. rating (0% score)

commentsRelated Posts


Share
Share