క‌ర్నూల్లో వేడెక్కిన రాజకీయం..శిల్పాకు మళ్లీ అగ్ని పరీక్ష

December 14, 2017 at 10:36 am
Kurnool

ఏపీలో మ‌రోసారి రాజ‌కీయాలు వేడెక్కాయి. ఎమ్మెల్సీ ఉప ఎన్నిక‌కు నిన్న కేంద్ర ఎన్నిక‌ల సంఘం నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది. దీంతో ఒక్క‌సారిగా పొలిటిక‌ల్ పొజిష‌న్లు.. పీక్ స్టేజ్‌కు చేరుకున్నాయి. విష‌యంలోకి వెళ్తే.. నంద్యాల అసెంబ్లీకి జ‌రిగిన ఉప ఎన్నిక సంద‌ర్భంగా క‌ర్నూలు జిల్లా టీడీపీ ఇంచార్జ్‌గా ఉన్న శిల్పా మోహ‌న్ రెడ్డికి బాబు టికెట్ నిరాకరించారు. దీంతో ఆయ‌న అలిగి.. వైసీపీ గూటికి చేరారు. ఈ క్ర‌మంలోనే తొలుత పొలిటిక‌ల్ గేమ్‌లో అన్న అన్నే.. త‌మ్ముడు త‌మ్ముడే అని ఒక్కాణించిన శిల్పా మోహ‌న్‌రెడ్డి తమ్ముడు శిల్పా చ‌క్ర‌పాణి రెడ్డి.. త‌ర్వాత స‌డెన్‌గా ఆయ‌న కూడా మాట గ‌ట్టున పెట్టి మెడ‌లో కండువా మార్చేశాడు. వైసీపీ లోకి చేరి అన్న‌గారి త‌ర‌ఫున అప్ప‌టి ఉప ఎన్నిక‌ల్లో విస్తృత‌మైన ప్ర‌చారం చేశాడు. ఇంత వ‌ర‌కు బాగానే ఉన్నా.. అప్ప‌టికి ఆయ‌న టీడీపీ స్థానిక సంస్థ‌ల కోటాలో ఎమ్మెల్సీగా ఉన్నాడు. 

అప్ప‌టి ఎన్నిక‌లో టీడీపీ త‌ర‌ఫున బ‌రిలో నిలిచిన క్ర‌పాణిరెడ్డి వైసీపీ అభ్య‌ర్థిగా పోటీ చేసిన గౌరు వెంక‌ట‌రెడ్డిపై గెలిచారు. అయితే ఆయ‌న ఎమ్మెల్సీగా గెలిచి మూడు నెల‌లు కూడా కాకుండానే నంద్యాల ఉప ఎన్నిక రావ‌డం, టీడీపీలో పొస‌గ‌క‌పోవ‌డం నేప‌థ్యంలో వైసీపీ అధినేత జ‌గ‌న్ ప్ర‌వచించిన నీతిమంత‌మైన రాజ‌కీయాలకు క‌ట్టుబ‌డి చ‌క్ర‌పాణి రెడ్డి త‌న ఎమ్మెల్సీ ప‌ద‌వికి రాజీనామా స‌మ‌ర్పించి జ‌గ‌న్ చెంత‌కు చేరుకున్నాడు. దీంతో ఈ స్థానానికి ఉప ఎన్నిక అనివార్య‌మైంది. దీంతో కేంద్ర ఎన్నిక‌ల సంఘం.. క‌ర్నూలు స్థానిక సంస్థ‌ల కోటాలోని ఎమ్మెల్సీ స్థానానికి నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది. షెడ్యూల్ ప్ర‌కారం ఈనెల 19న నోటిఫికేషన్‌ జారీ చేయనుంది. జనవరి 12న పోలింగ్, 16న కౌంటింగ్‌ జరపాలని నిర్ణయించింది. అదే రోజున ఫ‌లితం కూడా వెలువ‌డుతుంది. 

ఇక‌, ప్ర‌క‌ట‌న విడుద‌లైన నిన్న‌టి నుంచే స్థానిక సంస్థ‌ల ప‌రిధిలో ఎన్నిక‌ల కోడ్ కూడా అమ‌ల్లోకి వ‌చ్చింది. ఇక‌, ఇప్పుడు జిల్లాలో రాజ‌కీయం రాజుకుంది. ఈ ఉప ఎన్నిక‌ల్లో వైసీపీ పోటీ చేస్తుందా ?  లేదా ? అన్న‌దానిపై అప్పుడే చ‌ర్చ‌లు స్టార్ట్ అయ్యాయి.  చ‌క్ర‌పాణిరెడ్డి మ‌రోసారి పోటీ చేసేందుకు త‌హ‌త‌హ లాడుతున్నారు. ఈయ‌న‌కు వైసీపీ అధినేత జగ‌న్ కూడా ప‌చ్చ‌జెండా ఊపేందుకు సిద్ధంగానే ఉన్నారు. ఈ నేప‌థ్యంలో చ‌క్ర‌పాణి రెడ్డి బ‌రిలోకి దిగ‌డం ఖాయంగా క‌నిపిస్తోంది. అయితే, బ‌లాబ‌లాల విష‌యంలోనే అనేక సందేహాలు క‌నిపిస్తున్నాయి. నాటికి నేటికి జిల్లాలో టీడీపీ బ‌లం మ‌రింత‌గా పెరిగింది. నంద్యాల ఉప ఎన్నిక‌ల్లో టీడీపీ ఘ‌న‌విజ‌యం సాధించ‌డం, జిల్లా నుంచి ఎక్కువ మంది వైసీపీ ఎమ్మెల్యేలు టీడీపీలోకి జంప్ చేయ‌డంతో ఇక్క‌డ పోటీ చేసినా వైసీపీ గెలుస్తుంద‌న్న గ్యారెంటీ అయితే లేదు.  

అసెంబ్లీ ఎన్నిక‌ల‌కు ముందు మరోసారి అధికార టీడీపీకి గ‌ట్టి పోటీ ఇవ్వ‌డంతో పాటు తాడోపేడో తేల్చుకునేందుకే జ‌గ‌న్ రెడీ అయిన‌ట్టే క‌న‌ప‌డుతోంది. ఈ నేప‌థ్యంలోనే ఇక్క‌డ నుంచి శిల్పా చ‌క్ర‌పాణినే పోటీ పెడితే సానుభూతితో పాటు త‌మ బ‌లం నిరూపించుకునే ఛాన్స్ ఉంటుంద‌ని జ‌గ‌న్ ప్లాన్‌గా క‌న‌ప‌డుతోంది. ఇక క‌ర్నూలు జిల్లాలో నాయ‌కులు మారినా స్థానికంగా, సంస్థాగ‌తంగా వైసీపీకే బ‌లం ఉంద‌ని జ‌గ‌న్ కూడా న‌మ్ముతున్నారు. నంద్యాల ఉప ఎన్నిక‌ల టైంలో ప్ర‌చారంలో కూడా జ‌గ‌న్ ఉప ఎన్నిక‌ల్లో చ‌క్ర‌పాణిరెడ్డి అన్న‌నే పోటీ చేయించి గెలిపించుకుంటాన‌ని హామీ ఇచ్చారు. ఇప్పుడు గెలుపు ఓట‌ములు ఎలా ఉన్నా శిల్పా పోటీ చేయ‌డం మాత్రం ఖాయంగానే క‌నిపిస్తోంది. మ‌రి ఏంజ‌రుగుతుందో చూడాలి.  ప్ర‌భుత్వ వైఫ‌ల్యాల‌ను జ‌గ‌న్ ఎండ‌గ‌ట్ట‌డంలో విజ‌య‌వంతం అవుతున్నాడా? అనేది, ఆయ‌న ప్రారంభించిన పాద‌యాత్ర ఇప్ప‌టికే క‌ర్నూలులో పూర్తికావ‌డం కూడా వైసీపీకి క‌లిసొచ్చే అంశంగానే అంటున్నారు విశ్లేష‌కులు. మ‌రి బాబు మేనేజ్ చేస్తే..?! ఇదే ఇప్పుడు నూరు డాల‌ర్ల ప్ర‌శ్న‌గా మారింది. మ‌రి ఏం జ‌ర‌గుతుందో చూడాలి. 

 

క‌ర్నూల్లో వేడెక్కిన రాజకీయం..శిల్పాకు మళ్లీ అగ్ని పరీక్ష
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts


Share
Share