కాన్ఫిడెన్స్ ఉందని లోకేష్ చాటుకోవాలి..!

March 14, 2019 at 11:01 am

ఏదో ఒక రకంగా కాలం కలసివచ్చినా, చంద్రబాబు జాతీయ రాజకీయాల్లోకి వెళ్లినా… ఉన్న పళంగా ముఖ్యమంత్రి అయిపోవచ్చుననే ఆశతో ఎమ్మెల్యేగా ఎన్నికల బరిలోకి దిగుతున్న నాయకుడు నారా లోకేష్. ఇలాంటప్పుడు ఆయన సాధారణంగా సేఫ్ జోన్ ఎంచుకోవాలి. లోకేష్ గనుక పోటీచేయదలచుకుంటే… పార్టీ మీద ఆయన పెత్తనం నడుస్తున్న తీరు తెలుసు గనుక.. తెదేపాకు అత్యంత బలం ఉన్న ఏ నియోజకవర్గంలోని సిటింగు ఎమ్మెల్యే అయినా.. రాజీనామా చేసి.. తమ సీటును ఆయనకు పూలలో పెట్టి అందించగలరు.

అయితే నారా లోకేష్… ప్రస్తుతం వైసీపీ చేతిలో ఉన్న గుంటూరు జిల్లా మంగళగిరి స్థానాన్ని ఎంచుకున్నారు. మంగళగిరి నుంచి లోకేష్ పోటీ చేయడం అనేది… ఏదో రాష్ట్రాన్ని ఉద్ధరించడానికి… ఎడాపెడా జరిగిపోతున్న అభివృద్ధికి విఘాతం కలగకుండా ఉండడానికి అనేంతగా బిల్డప్ జరుగుతోంది. రాజధాని అభివృద్ధి పనులకు ఎవరూ అడ్డు పడకుండా ఉండడానికే ఆ నియోజకవర్గం నుంచి లోకేష్ బరిలోకి దిగదలచుకున్నట్లుగా పార్టీ భావిస్తున్నది.

అయితే లోకేష్ కు ఆ సీటులో నెగ్గగలమనే కాన్ఫిడెన్స్ ఉందా లేదా? అనేది మాత్రం సందేహమే. ఎందుకంటే.. ఆయన ఇప్పటికీ ఎమ్మెల్సీ పదవిని అంటిపెట్టుకునే ఎమ్మెల్యేగా బరిలోకి దిగే ప్రయత్నం చేస్తున్నారు. ఒకవేళ ఓడిపోయినా ఆయన చట్టసభ హోదాను కొనసాగించుకునే ఆలోచనతో ఉన్నారు. ఇదే తెలుగుదేశం పార్టీలో మరికొందరు ఎమ్మెల్సీలు కూడా ఈసారి ఎన్నికల బరిలోకి దిగుతున్నారు. సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, రామసుబ్బారెడ్డి లాంటి వాళ్లు ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసి మరీ.. బరిలోకి దిగుతున్నారు. అంటే కనీసం తమలు గెలుపుపై కాన్ఫిడెన్స్ ఉన్నదని వారు అధినేత వద్ద ప్రాథమికంగా చెప్పుకున్నట్లు లెక్క. కానీ.. లోకేష్ లో ఆ కాన్ఫిడెన్స్ కనిపించడం లేదు.

కేవలం మాటలు చెప్పడం కాకుండా.. నిజంగా లోకేష్ లో తన శక్తి సామర్థ్యాల మీద కాన్ఫిడెన్స్ ఉంటే… ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసి ఎన్నికల బరిలో దిగాలని ప్రజలు అనుకుంటున్నారు.

కాన్ఫిడెన్స్ ఉందని లోకేష్ చాటుకోవాలి..!
0 votes, 0.00 avg. rating (0% score)

commentsRelated Posts


Share
Share