ఏలూరు ఎంపీ సీటుపై టీడీపీలో ఏం జ‌రుగుతోంది…మాగంటి ఫ్యూచ‌ర్ ఏంటి..!

February 24, 2018 at 12:08 pm
Maganti babu, Eluru, MP, TDP, Bolla Rajiv, Politics

వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఏపీలో చాలా నియోజ‌క‌వ‌ర్గాల్లో టిక్కెట్ల కోసం కొత్త‌వాళ్లు, యువ‌త‌, వార‌సుల నుంచి తీవ్ర‌మైన పోటీ ఉంది. దీంతో ఏ నియోజ‌క‌వ‌ర్గాల్లో ఎవ‌రు ఎవ‌రెవ‌రి సిట్టింగ్‌ల‌కు ఎర్త్ పెడ‌తారు ? చంద్ర‌బాబు ఎవ‌రిని త‌ప్పిస్తారు ? అనే అంశాల‌పై ఆస‌క్తిక‌ర చ‌ర్చ‌లే న‌డుస్తున్నాయి. ఈ క్ర‌మంలోనే ప‌శ్చిమ‌గోదావ‌రి జిల్లా ఏలూరు ఎంపీ సీటుపై కూడా జిల్లాలో కొత్త చ‌ర్చ పెద్ద ఎత్తున జ‌రుగుతోంది. టీడీపీలో కూడా దీనిపై ఎవ‌రి అభిప్రాయాలు వారు వ్య‌క్తం చేస్తున్నారు. సీనియ‌ర్ పార్ల‌మెంటేరియ‌న్‌, ఏలూరు పార్ల‌మెంటు సీటుతో రెండున్న‌ర ద‌శాబ్దాలుగా అనుబంధం ఉన్న మాగంటి బాబుకు పోటీగా మాజీ కేంద్ర‌మంత్రి బోళ్ల బుల్లి రామ‌య్య మ‌న‌వ‌డు బోళ్ల రాజీవ్ కూడా సీటుకు పోటీ వ‌స్తున్నార‌ని తెలుస్తోంది.

 

బ‌ల‌మైన రాజ‌కీయ వార‌స‌త్వం, పారిశ్రామిక‌నేప‌థ్యం, చంద్ర‌బాబు ఫ్యామిలీతో బంధుత్వం ఉండ‌డంతో గ‌త ఎన్నిక‌ల్లోనూ రాజీవ్ ఏలూరు సీటుకోసం గ‌ట్టి ప్ర‌య‌త్నాలు చేశారు. అయితే పార్టీ ప్ర‌తిప‌క్షంలో ఉన్న‌ప్పుడు మెట్ట ప్రాంతంతో పాటు జిల్లాలో చాలా నియోజ‌క‌వ‌ర్గాల్లో మాగంటి పార్టీ బ‌లోపేతం కృషి చేసి, కార్య‌క‌ర్త‌ల‌కు అండ‌గా ఉండి పార్టీని బ‌తికించారు. దీంతో చంద్ర‌బాబు బాబునే రంగంలోకి దించ‌గా ఆయ‌న ల‌క్ష ఓట్ల భారీ తేడాతో విజ‌యం సాధించారు. ఇక జిల్లాలో తాజాగా వినిపిస్తోన్న వార్త‌ల ప్ర‌కారం వ‌చ్చే ఎన్నిక‌ల్లో రాజీవ్ ఎలా అయినా ఎంపీగా పోటీ చేయాల‌ని విశ్వ‌ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు.

 

వ్యాపార‌వేత్త‌గా ఉన్న ఆయ‌న జంగారెడ్డిగూడెంలో నివాసం ఉంటూ ఇటీవ‌ల ఆ చుట్ట‌ప‌క్క‌ల ఫ్లెక్సీలు కూడా భారీ ఎత్తున ఏర్పాటు చేస్తున్నారు. ఇటీవ‌ల ఆయ‌నే కొంత‌మంది ప్ర‌జాప్ర‌తినిధుల‌తో కూడా వ‌చ్చే అక్టోబ‌ర్ నుంచి ప్ర‌జ‌ల్లోకి వ‌స్తాన‌ని, త‌న‌కు సాయం చేయాల‌ని కూడా అన్న‌ట్టు స‌మాచారం. ఎలాగైనా టిక్కెట్ సాధించాల‌న్న ధీమాతో రాజీవ్ ఉన్నారు. అయితే ఇప్ప‌టి వ‌ర‌కు పార్టీల కార్య‌క‌ర్త‌ల‌కు కాదు క‌దా… క‌నీసం ప్ర‌ధాన నాయ‌కుల‌తోనూ ఆయ‌న ప‌రిచ‌యాలు పెద్ద‌గా లేవు. పార్టీ స‌మావేశాల‌కు ఆయ‌న హాజ‌రైంది లేదు. 

 

ఇక బాబు విష‌యానికి వ‌స్తే 2009 ఎన్నిక‌ల‌కు మందు టీడీపీలోకి వ‌చ్చిన ఆయ‌న 2009లో ఓడిపోయినా గ‌త ఎన్నిక‌ల్లో గెలిచారు. వ‌చ్చే ఎన్నిక‌ల్లో బాబు నిజంగానే తీవ్ర ఒత్తిళ్ల మ‌ధ్య మాగంటిని త‌ప్పించి ఏలూరు ఎంపీ సీటు రాజీవ్‌కు ఇస్తే మాగంటికి అసెంబ్లీ సీటు ఇచ్చి గెలిచాక మంత్రి ప‌ద‌వి అయినా ఇవ్వాలి. మాగంటి నిజాయితీ, అంకిత‌భావం అంటే చంద్ర‌బాబు ఎంతో ఇష్ట‌ప‌డ‌తారు. బాబును నొప్పించే ప‌ని చేసేందుకు చంద్ర‌బాబు ఇష్ట‌ప‌డ‌రు. ఇక మాగంటికి అసెంబ్లీ సీటు ఇవ్వాలంటే ఆయ‌న గ‌తంలో ప్రాథినిత్యం వ‌హించిన దెందులూరు ఇవ్వాలి. 

 

అయితే దెందులూరును త‌న కంచుకోట‌గా మార్చుకున్న విప్ ప్ర‌భాక‌ర్‌ను త‌ప్పించ‌డం అసాధ్యం. ఇక మాగంటికి ప‌ట్టున్న కృష్ణా జిల్లాలోని కైక‌లూరు ఒక్క‌టే ఆప్ష‌న్‌గా ఉంది. కైక‌లూరులో ఉన్న కామినేని చంద్ర‌బాబుకు ఎంత ఇష్టుడో చెప్ప‌క్క‌ర్లేదు. బీజేపీతో టీడీపీ పొత్తు ఉంటే మ‌ళ్లీ కామినేనే అక్క‌డ పోటీ చేస్తారు. లేకున్నా కామినేని తిరిగి టీడీపీలోకి వ‌చ్చి అయినా అక్క‌డ పోటీ చేసేందుకు రెడీగా ఉన్న‌ట్టు వార్త‌లు వ‌స్తున్నాయి. ప‌శ్చిమ‌లో ప‌ట్టున్న మాగంటి కృష్ణా జిల్లా రాజ‌కీయాల్లోకి వెళ‌తార‌ని ఆశించ‌లేం. ఈ లెక్క‌న మాగంటికి అసెంబ్లీ సీటు సర్దుబాటు చేసే ప‌రిస్థితి లేదు. ఈ క్ర‌మంలో మాగంటి బాబుకు స‌రైన ఆప్ష‌న్ లేకుండా ఆయ‌న్ను త‌ప్పించ‌డం క‌ష్టం. మ‌రి ఈ లెక్క‌న ఎంపీ సీటు కోసం త‌న ఛానెల్లో గ‌ట్టి ప్ర‌య‌త్నాలు చేస్తూ గ్రౌండ్ వ‌ర్క్ స్టార్ట్ చేసిన బోళ్ల రాజీవ్ ప్ర‌య‌త్నాలు ఎలా ఫ‌లిస్తాయో ?  చూడాలి

 

ఏలూరు ఎంపీ సీటుపై టీడీపీలో ఏం జ‌రుగుతోంది…మాగంటి ఫ్యూచ‌ర్ ఏంటి..!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts


Share
Share