ఒప్పందానికి మంత్రి పుల్లారావు తూట్లు..!

January 20, 2018 at 3:52 pm
minister, AP, Pathipati Pullarao, TDP, Politics

త‌న‌కు మాలిన ధ‌ర్మం ప‌నికిరాదంటారు పెద్ద‌లు! దీనిని ప‌ట్టించుకోని ఏపీ మంత్రి ప‌త్తిపాటి పుల్లారావు ఇప్పుడు ఇబ్బందుల్లో ప‌డ్డారు. త‌న‌కు అన‌వస‌ర‌మైన విష‌యాల్లో జోక్యం చేసుకుని చిక్కుల్లో ప‌డుతున్నారు. ఇప్ప‌టికే సొంత జిల్లాలో అనేక వివాదాల్లో ఇరుక్కుని బ‌య‌ట‌ప‌డ‌లేక‌పోతున్న‌ ఆయ‌న‌.. తాజాగా మ‌రో పంచాయితీలో త‌ల దూర్చారు. త‌న అనుచ‌రుల కోసం నిబంధన‌లు, ఒప్పందాల‌కు తూట్లు పొడుస్తూ మ‌రో వర్గానికి ఝ‌ల‌క్ ఇచ్చే ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు. చినికి చినికి గాలివాన‌లా మొద‌లైన ఈ త‌గాదా రేపోమాపో సీఎం చంద్ర‌బాబు వ‌ద్దకు చేర‌బోతోంది. ఎన్నిక‌ల స‌మ‌యంలో టీడీపీకి అండ‌దండ‌గా ఉన్న బీసీ వ‌ర్గంలో మంత్రిపై ఆగ్ర‌హ జ్వాల‌లు రేగుతున్నాయి. 

గుంటూరు జిల్లా జడ్పీ ఛైర్మన్‌ ఒప్పందం ప్రకారం రాజీనామా చేయకుండా మంత్రి పుల్లారావు పరోక్షంగా సహకరిస్తున్నారనే చ‌ర్చ గుంటూరు జిల్లాలో హాట్ టాపిక్‌గా మారింది. బీసీ వర్గాలకు కేటాయించిన జడ్పీ ఛైర్మన్‌ పదవి అప్పట్లో ముస్లిం వర్గానికి చెందిన జానీమూన్‌కు రెండున్నరేళ్లు.. బీసీ వర్గానికి చెందిన వారికి రెండున్నరేళ్లు ఇచ్చేలా ఒప్పందం కుదిరింది. ఈ ఒప్పందాన్ని అమలు చేసేందుకు మంత్రి హోదాలో విశ్వప్రయత్నాలు చేసి మాజీమంత్రి రావెల కిశోర్ విఫ‌ల‌మ‌య్యారు. అప్పట్లో కూడా మంత్రి పుల్లారావు జడ్పీ ఛైర్మన్‌కు పరోక్షంగా మద్దతు తెల పడం పలు వివాదాలకు దారితీసింది. ఇప్పుడు బీసీ వ‌ర్గ నేత‌లు పుల్లారావుపై వ‌ర్గం అగ్గిమీద గుగ్గిలం అవుతున్నారు. 

ముస్లిం ఓటర్లు కన్నా.. బీసీ సామాజికవర్గ ఓట్లు టీడీపీ వైపు ఉన్న విషయం ఎమ్మెల్యేలకు ఇతర ముఖ్యనాయకులు తెలుసు. అయినప్పటికీ ఆ పదవి తమకు దక్కకుండా మంత్రి పుల్లారావు అడ్డుపడుతున్నార‌ని ఆ వ‌ర్గ నేత‌లు మండి ప‌డుతున్నారు. జిల్లా పార్టీ అధ్యక్షుడు ఆంజనేయులు, ఇతర సీనియర్‌ ఎమ్మెల్యేలు, మద్దతు ఇవ్వడం లేదని, ఇదే విధంగా కొనసాగితే రాబోయే ఎన్నికల్లో తమ సత్తా చూపిస్తామని బిసీ వర్గానికి చెందిన నేతలు హెచ్చరిస్తున్నారు. టీడీపీకి అండగా నిలిచి అధికారంలోకి రావడానికి కారణమైన బీసీలను విస్మరిస్తారా..? అని ప్ర‌శ్నిస్తున్నారు. ఇక‌ బాపట్ల ఎంపీపీ విష‌యంలోనూ పుల్లారావు జోక్యం చేసుకుని ఒప్పందం పాటించ‌కుండా చేస్తున్నార‌ట‌.

ఎంపీపీగా మానం విజేతను ఎంపిక చేసేటప్పుడు.. ఆమె రెండున్నరేళ్లు మరొకరికి రెండున్నరేళ్లు అని ఒప్పందం కుదిరింది. పుల్లారావు మద్దతు ఆమెకు ఉండడంతో..రాజీనామాకు ఆమె ససేమిరా..అంటున్నారని ఆ నియోజకవర్గ పార్టీ ఇన్‌ఛార్జి అన్నం సతీష్‌ వర్గీయులు బాహాటంగానే విమర్శిస్తున్నారు. అప్పట్లో జరిగిన ఎంపీటీసీ ఎన్నికల్లో..వైసీపీకి  మూడు స్థానాలు అదనంగా వచ్చినా.. వారిలో కొందరికి ఎంపీపీ పదవి ఇస్తామని ఆశ చూపి టీడీపీ అభ్యర్థికి మద్దతు ఇప్పించారు ఎమ్మెల్సీ అన్నం సతీష్‌. క‌మ్మ‌ సామాజికవర్గానికి రెండున్నేర్లు ఎంపీపీ పదవి ఇచ్చాం.. అప్పట్లో మద్దతు ఇచ్చిన వైకాపా ఎంపీపీ అభ్యర్థులైన రెడ్డి సామాజికవర్గానికి ఆ పదవి ఇస్తామని చెప్పామని, త్వరలో ఎన్నికలు రాబోతున్నందున ఆ పదవి వారికి ఇవ్వాలని అన్నం సతీష్‌ పట్టుపడుతున్నారని తెలిసింది. 

ఒప్పందం ప్రకారం రెడ్డి సామాజికవర్గానికి ఎంపీపీ పదవి ఇవ్వకపోతే పార్టీకి నష్టమని మండల పరిధిలోని వివిధ గ్రామాలకు చెందిన కమ్మ సామాజికవర్గ నేతలు కూడా చెబుతున్నారు. ఇప్పటికైనా మంత్రి పుల్లారావు మరింత వివాదాలు సృష్టించకుండా వీరి రాజీనామాలను చేయించాలని సూచిస్తున్నారు. ఈ వివాదాల‌కు ఫుల్‌స్టాప్ పెట్టేందుకు త్వ‌ర‌లో నేత‌లు సీఎం చంద్ర‌బాబును క‌ల‌వ‌బోతున్నారు. ఇంతకు ముందు ఈ ఇద్దరు రాజీనామాల వ్యవహారంలో స మా వేశాలు ఏర్పాటు చేసిన వినుకొండ ఎమ్మెల్యే ఆంజనేయులు..ఈ మధ్య కాలంలో మౌనం వహించడంపై పుల్లారావు ఒత్తిడి ఉందని ఆ వర్గాలు చెబుతున్నాయి. మొత్తానికి మంత్రి పంచాయితీలు ఎప్ప‌టికి ప‌రిష్కార‌మ‌వుతాయో!

 

ఒప్పందానికి మంత్రి పుల్లారావు తూట్లు..!
0 votes, 0.00 avg. rating (0% score)

comments



Related Posts