అవన్నీ ఏక‌మైతే….మోడీ ప‌నిగోవిందా!

March 18, 2018 at 4:13 pm
Modi, BJP, PM, opposition parties, fight

మ‌రో 50 ఏళ్ల‌పాటు కేంద్రంలో అధికారంలోకి ఉండి తీరాలంటూ బీజేపీ సార‌థి అమిత్ షా ప్ర‌క‌టించి ప‌ట్టుమ‌ని ప‌ది మాసాలైనా కాకుండానే మోడీ ప్ర‌భుత్వంపై స‌ర్వత్రా సెగ‌లు పుడుతున్నాయి. పెద్ద నోట్ల ర‌ద్దు వంటి అత్యంత కీల‌క మైన నిర్ణ‌యం తీసుకున్న త‌ర్వాత నుంచి జ‌రిగిన రాజ‌కీయ ప‌రిణామాలు బీజేపీని ఒంట‌రిని చేశాయి. ఆ త‌ర్వాత జీఎస్టీ ఎఫెక్ట్ కూడా మోడీ ప్ర‌భావాన్ని భారీ ఎత్తున త‌గ్గించింది. ఈ క్ర‌మంలోనే ఎన్డీఏలో బీజేపీకి మిత్ర‌ప‌క్షాలుగా ఉన్న ప‌లు పార్టీలు ఒక్కొక్క‌టిగా బ‌య‌ట‌కు వ‌చ్చాయి. అయితే, 2014లో జ‌రిగిన ఎన్నిక‌ల్లో బీజేపీకి పూర్తిస్థాయి మెజారిటీ రావ‌డంతో మిత్ర‌ప‌క్షాలు వెళ్లిపోయినా ప్ర‌భుత్వానికి ఢోకా లేకుండా పోయింది. అయితే, ప‌రిస్థితి ఎప్పుడు ఇలాగే ఉండ‌దు క‌దా?

 

వ‌చ్చే ఏడాది సార్వ‌త్రిక ఎన్నిక‌ల‌కు రంగం సిద్ధ‌మైంది. ఇప్పుడు ఆ ప‌రిణామాలే బీజేపీకి ఉచ్చులాగా మార‌తాయ‌ని అంటున్నారు విశ్లేష‌కులు. దేశ‌వ్యాప్తంగా ప్ర‌స్తుతం నెల‌కొన్న ప‌రిస్తితులు, రాజ‌కీయ ప‌రిణామాలు బీజేపీకి ఎదురు గాలి వీచేలా చేస్తున్నాయ‌ని చెబుతున్నారు. ఇప్ప‌టికే ఎన్డీయే నుంచి ఏపీ అధికార పార్టీ టీడీపీ బ‌య‌ట‌కు రావ‌డంతో రాజ‌కీయ ప‌రిణామాలు హ‌స్తిన‌లో భారీ ఎత్తున మారిపోతున్నాయి. విపక్షాలు ఐక్యంగా రంగంలోకి దిగితే బీజేపీ విడిగా.. వంద స్థానాలకు మించి దక్కించుకునే అవకాశం కూడా లేదని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. బీజేపీ మిత్రపక్షం శివసేన కూడా ఇదే రకమైన అంచనా వేసింది.

 

వాస్త‌వానికి ఆరు మాసాల కింద‌టి ప‌రిస్థితిని గ‌మ‌నిస్తే.. ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ, బీజేపీ సార‌థి అమిత్ షాల ప్ర‌భావం దేశంలో భారీ ఎత్తున సాగింది. ఏ ఎన్నిక‌లు జ‌రిగినా క‌మ‌ల వికాశం క‌నిపించింది. ఈ నేప‌థ్యంలోనే 21 రాష్ట్రాల్లో బీజేపీ జెండా ఎగిరింది. అయితే, ప‌రిస్థితులు ఒక్క‌టొక్క‌టిగా మారిపోయాయి. జీఎస్టీ ప్ర‌భావం దేశ వాణిజ్యాన్ని తీవ్రంగా కుదిపేసింది. పెద్ద‌నోట్ల ర‌ద్దు ప‌రిణామం కూడా దేశ ప్ర‌జ‌ల‌ను తీవ్రంగా ఇబ్బంది పెట్టింది. దీనికితోడు ప్రాంతీయ పార్టీల‌పై మోడీ, షా ద్వ‌యం విరుచుకుప‌డ‌డం ప్రారంభించింది. వ‌చ్చే 2019 ఎన్నిక‌ల‌పై పూర్తి స్థాయి భ‌రోసాను నింపుకొన్న ఇద్ద‌రు నేతలూ ఎవ‌రినీ ఖాత‌రు చేయ‌ని ప‌రిస్థితిలో రెచ్చిపోయారు. ఈ నేప‌థ్యంలోనే ఇటీవ‌ల యూపీలో జ‌రిగిన ఉప ఎన్నిక‌ల్లో బీజేపీ చిత్తుగా ఓడిపోయంది. 

 

మ‌రోప‌క్క‌, విభ‌జ‌న స‌మ‌యంలో ఏపీకి ఇచ్చిన హామీల‌ను నెర‌వేర్చ‌క‌పోవ‌డంతో బీజేపీ మిత్ర‌ప‌క్షంగా ఉన్న టీడీపీ త‌న దారి తాను చూసుకోవ‌డంతోపాటు బీజేపీ ప్ర‌భుత్వంపై అవిశ్వాస తీర్మానం కూడా పెట్టింది. దీంతో ఒక్క‌సారిగా ఢిల్లీ రాజ‌కీయాలు వేడెక్కాయి. యూపీ, బీహార్‌ ఉప ఎన్నికల్లో ఎదురుగాలి వీయ‌డం,  యూపీ సీఎం ఆదిత్యనాథ్‌ అడ్డాలోనే కమలనాథులకు పరాభవం ఎదురు కావ‌డంతో ఇప్పుడు 2019 ఎన్నిక‌ల విష‌యంలో బీజేపీ సార‌ధులు మ‌థ‌న ప‌డుతున్న‌ట్టు తెలుస్తోంది. ఈ క్ర‌మంలో వ‌చ్చే ఎన్నిక‌ల నాటికి కూడా ఇదే ప‌రిస్థితి కొన‌సాగితే.. బీజేపీకి క‌నీసం 100 స్థానాలు ద‌క్కినా ఘ‌న‌మేన‌ని అంటున్నారు విశ్లేష‌కులు.  అంతేకాదు, వ‌చ్చే 2019 ఎన్నిక‌ల్లో లౌకిక పక్షాల కూటమికి అనుకూలంగా మారుతున్న ప‌రిస్థితి స్ప‌ష్టంగా క‌నిపిస్తుండడం గ‌మ‌నార్హం. మ‌రి ఏం జ‌రుగుతుందో చూడాలి. 

 

అవన్నీ ఏక‌మైతే….మోడీ ప‌నిగోవిందా!
0 votes, 0.00 avg. rating (0% score)

comments



Related Posts