ప‌డిపోతున్న మోడీ గ్రాఫ్‌.. గుజ‌రాత్‌లో హోరాహోరీ!

December 18, 2017 at 11:34 am
Modi, gujarath, BJP, graph

రాజ‌కీయాలు ఎప్పుడూ ఒకేలా ఉండ‌వు! ఎప్పుడు నేత‌ల బ‌ళ్లు ఓడ‌లు అవుతాయో?  ఎప్పుడు బ‌ళ్ల‌వుతాయో కూడా చెప్ప‌డం క‌ష్టం. ఇప్పుడు ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ ప‌రిస్థితి కూడా ఇలానే ఉంద‌ని అంటున్నారు విశ్లేష‌కులు. న‌ల్లేరుపై న‌డ‌క‌గా మారుతుంద‌ని, మ‌రో సారి కూడా క‌ళ్లు మూసుకుని అధికార పీఠాన్ని చేజిక్కించుకోవ‌చ్చ‌ని పెద్ద ఎత్తున వేసుకున్న ప్లాన్ మోడీకి తాజాగా చుక్క‌లు చూపించి ఇంత చ‌లి వాతావ‌ర‌ణంలోనూ చెమ‌ట‌లు పుట్టిస్తోంది. విష‌యంలోకి వెళ్తే.. ఈ నెల‌లో రెండు ద‌ఫాలుగా జ‌రిగిన గుజరాత్‌ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు తాజాగా వెలువడుతున్నాయి. అయితే, ముందుగానే అన్ని పార్టీల నేత‌ల‌కీ భ‌రోసా పెంచేసిన‌ ఎగ్జిట్‌ పోల్స్‌ అంచనాలు తారుమారవుతున్నాయి. 

గుజరాత్‌లో రెండో దశ ఎన్నికల పోలింగ్‌ ముగిసిన వెంటనే ప్రముఖ సంస్థలు తమ ఎగ్జిట్‌ పోల్స్‌ ఫలితాలను వెల్లడించాయి. దాదాపుగా అన్నీ ఒక్కటే చెప్పాయి. అధికార బీజేపీ మంచి మెజారిటీతో విజయం సాధిస్తుందని. అన్ని ఎగ్జిట్‌ పోల్స్‌ కూడా బీజేపీ 110 నుంచి 120 స్థానాల వరకూ గెలుచుకుంటుందని తేల్చాయి. ఇక కాంగ్రెస్‌ దాదాపు 60 స్థానాలకే పరిమితమవుతుందని వెల్లడించాయి. అయితే గుజరాత్‌లో వెలువడుతున్న ఫలితాల స‌ర‌ళి అందుకు భిన్నంగా కనిపిస్తోంది. బీజేపీ, కాంగ్రెస్‌ మధ్య పోటాపోటీ నెలకొంది. ఆధిక్యంలో బీజేపీ ముందంజలో ఉన్నప్పటికీ రెండు పార్టీలు మధ్య అంతరం స్వల్పంగానే ఉండటం గమనార్హం. 

బీజేపీ ఆధిక్యం వంద స్థానాలను దాటినప్పటికీ.. కాంగ్రెస్‌ కూడా ఆధిక్యంలో సమీపంలోనే ఉంది. కాంగ్రెస్‌ ఇప్పటివరకూ దాదాపు 75 స్థానాల్లో ముందంజలో ఉంది. ఈ ప‌రిణామాన్ని న‌రేంద్ర మోడీ ఊహించనైనా ఊహించ‌ని మాట వాస్తవం. వార్ వ‌న్ సైడ్ అయిపోతుంద‌ని ఆయ‌న భావించారు. అయితే, అనూహ్యంగా ఆయ‌న‌కు ఇక్క‌డ ఎదురు దెబ్బ త‌గిలే సూచ‌న‌లు క‌నిపిస్తున్నాయి. బ‌ల‌మైన విప‌క్షం కొలువుదీర‌డం, బొటాబొటీ మార్కుతోనే అధికారం చేప‌ట్టే అవ‌కాశం ఉండ‌డం వంటి అంశాలు మోడీకి గొంతులో వెల‌క్కాయ మాదిరిగానే ఉంటుంద‌ని అంటున్నారు. వ‌చ్చే సార్వ‌త్రిక ఎన్నిక‌ల‌కు ఇన్నింగ్స్‌గా భావిస్తున్న ఈ ఎన్నిక‌ల‌ను బీజేపీ, కాంగ్రెస్‌లు రెండూ ప్ర‌తిష్టాత్మ‌కంగా తీసుకున్నాయి.

కాంగ్రెస్ ప్ర‌స్తుత అధ్య‌క్షుడు రాహుల్ గాంధీ, ప్ర‌ధాని మోడీ రోజుల త‌ర‌బ‌డి ప్ర‌చారం చేశారు. మోడీ అయితే, ఏకంగా త‌న‌ను చంపేయ‌డానికి కాంగ్రెస్ పెద్ద ఎత్తున ప్లాన్ చేస్తోంద‌ని విరుచుకుప‌డ్డారు. ఇలా ప్రధాని నరేంద్రమోదీకి, కాంగ్రెస్‌ నూతన అధ్యక్షుడు రాహుల్‌గాంధీకి ఈ ఎన్నికలు ఎంతో ప్రతిష్ఠాత్మకం కావడంతో యావత్‌ దేశం మొత్తం ఈ ఎన్నికల ఫలితాలను ఆక్తిగా గమనిస్తోంది. మ‌రి తుది ఫ‌లితం ఎవ‌రికి అనుకూలంగా వ‌స్తుందో చూడాలి. 

 

ప‌డిపోతున్న మోడీ గ్రాఫ్‌.. గుజ‌రాత్‌లో హోరాహోరీ!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts


Share
Share