చంద్ర‌గిరిలో పోటీకి లోకేష్‌ వెన‌క‌డుగు ఎందుకు

July 6, 2018 at 10:19 am
Nara Lokesh, TDP, 2019 elections, Chandragiri Ticket,

ఏపీ సీఎం నారా చంద్ర‌బాబు త‌న‌యుడు, మంత్రి లోకేష్‌.. పోటీచేసే నియోజ‌క‌వ‌ర్గంపై స‌స్పెన్స్ ఇంకా కొన‌సాగుతూనే ఉంది. త‌న మామ, ఎమ్మెల్యే బాల‌కృష్ణ ప్రాతినిధ్యం వ‌హిస్తున్న హిందూపురం, తండ్రి నియోజ‌క‌వ‌ర్గం కుప్పం, కృష్ణా జిల్లాలోని పెన‌మ‌లూరు ఇలా.. ర‌క‌ర‌కాల పేర్లు వినిపిస్తున్నాయి. కానీ ఒకే ఒక్క పేరు చెబితే మాత్రం అటు చంద్ర‌బాబు, ఇటు నారా లోకేష్ ఇద్ద‌రూ భ‌య‌ప‌డుతున్నారు. ఆ నియోజ‌క‌వ‌ర్గం పేరు అస్స‌లు ప్ర‌స్తావించొద్దు అంటున్నారు! ఎక్క‌డైనా పోటీకి ఓకేగానీ.. అక్కడ మాత్రం అస్స‌లు వ‌ద్దంటే వ‌ద్దు అని తెగేసి చెబుతున్నారు. ఇంతకీ ఆ నియోజ‌క‌వ‌ర్గం ఏంటా అని ఆలోచిస్తున్నారా? చ‌ంద్ర‌బాబు రాజ‌కీయాల్లో అరంగేట్రం చేసిన నియోజ‌క‌వ‌ర్గం చంద్ర‌గిరి. మ‌రి తాను రాజ‌కీయాల్లోకి అడుగు పెట్టిన నియోజ‌క‌వ‌ర్గంలో కొడుకు పోటీచేసేందుకు చంద్ర‌బాబు ఎందుకు వ‌ద్దంటున్నారు? చ‌ంద్ర‌గిరి అంటే నారా ఫ్యామిలీకి భ‌య‌మెందుకు అనే ప్ర‌శ్న‌లు వినిపిస్తున్నాయి.

రాజ‌కీయాల్లో 40 ఏళ్ల సుదీర్ఘ రాజ‌కీయ అనుభ‌వం ఉన్న చంద్ర‌బాబు తొలిసారి ప్ర‌జా జీవితంలోకి అడుగుపెట్టేలా చేసి.. తొలి విజ‌యాన్ని అందించిన నియోజ‌క‌వ‌ర్గం చంద్ర‌గిరి. రాజ‌కీయాల్లో సెంటిమెంట్లు ఎక్కువ‌గా ఫాలో అవుతుంటారు. రాజ‌కీయాల్లో చంద్ర‌బాబు వేసిన అడుగే ఒక సంచ‌ల‌నం. అక్క‌డి నుంచి ఎప్పుడూ ఆయ‌న వెనుదిరిగి చూడ‌లేదు. మ‌రి చంద్ర‌బాబును ఇంత‌టి వాడిని చేసిన నియోజ‌క‌వ‌ర్గంపై త‌న‌యుడు లోకేష్ క‌న్ను ప‌డింద‌ట‌. అయితే ఈ ఆలోచ‌న‌ను విరమించుకోవాల‌ని చంద్ర‌బాబు.. గ‌ట్టిగానే హెచ్చ‌రించిన‌ట్లు స‌మాచారం. ప్ర‌స్తుతం లోకేష్ రాజ‌కీయ భ‌విష్య‌త్‌ను నిర్ణ‌యించే నియోజ‌క‌వ‌ర్గం కోసం రాష్ట్రంలో ఉన్న 175 నియోజ‌క‌వ‌ర్గాల‌ను సీనియ‌ర్ నాయ‌కులు జ‌ల్లెడ ప‌డుతున్నారు. ఎక్క‌డి నుంచి అయితే చిన‌బాబు గెలుపు సునాయ‌స‌మ‌వుతుందో ఆ నియోజ‌క‌వ‌ర్గం కోసం తీవ్రంగా వెతుకుతున్నారు.

కుల‌, రాజ‌కీయ స‌మీక‌ర‌ణాల‌న్నింటినీ బేరీజు వేసుకుని ఒక్కో నియోజ‌క‌వ‌ర్గాన్ని మ‌దింపు చేస్తున్నారు. ఇందులో కొన్నిపేర్లు బ‌య‌టికి గ‌ట్టిగా వినిపిస్తున్నాయి. కానీ వీటిలో ఏ ఒక్క‌టీ ఫైన‌లైజ్ కావడం లేదు. ముఖ్యంగా చంద్ర‌బాబే ద‌గ్గ‌రుండి ఈ వ్య‌వ‌హారాల‌న్నీ చూస్తున్నారు. అయితే సెంటిమెంట్ ప్ర‌కారం.. లోకేష్‌కు చంద్ర‌గిరి నుంచి పోటీచేయాల‌నే ఆలోచ‌న వ‌చ్చింద‌ట‌. అంతేగాక ఇక్క‌డ అయితే బాగుంటుంద‌ని యోచిస్తున్నార‌ట‌. అయితే ఇదే అభిప్రాయాన్ని చంద్ర‌బాబు ముందుంచ‌గా.. ఆయ‌న మండిప‌డ్డార‌ట‌. ఎందుకంటే చంద్ర‌బాబు తొలిసారి ఇక్క‌డి నుంచి గెలిచినా.. త‌ర్వాత వ‌చ్చిన ఎన్నిక‌ల్లో ఓడిపోయిన విష‌యం గుర్తుచేశార‌ట‌. తొలిసారి 1978లో కాంగ్రెస్ త‌ర‌ఫున పోటీచేసిన చంద్ర‌బాబు ఇక్క‌డి నుంచి భారీ మెజారిటీతో విజ‌యం సాధించారు. అప్పుడు అదో సంచల‌నం.

త‌ర్వాత వ‌చ్చిన ఎన్నిక‌లు అంటే 1983లో తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం, ఎన్టీఆర్ ప్ర‌భంజ‌నంలో ఆయ‌న కూడా ఓడిపోక త‌ప్ప‌లేదు. త‌ర్వాత నుంచి కుప్పం నుంచే పోటీచేస్తున్నారు. అయితే ఎన్టీఆర్ హ‌యాంలో చంద్ర‌గిరిలో టీడీపీ గెలిచినా.. గ‌త 20 ఏళ్లలో గ‌మ‌నిస్తే ఇక్క‌డ టీడీపీ ఒక్క‌సారి కూడా గెల‌వ‌లేదు. అలాగే పార్టీకి ఇక్క‌డ ప‌ట్టు అస్సలు లేదు. ఇవన్నీ గ‌మ‌నించిన ఆయ‌న‌.. లోకేష్‌ను సున్నితంగా హెచ్చ‌రించార‌ట‌. ఆ నియోజకవర్గం ఎప్పుడూ ఒకేలా ఉండదని .. స్థానిక నాయకులను సెట్ చెయ్యటం కాస్త క్లిష్టమైన పని అని హెచ్చరించార‌ట‌. దీంతో నియోజకవర్గంపై లోకేశ్ ఊగిసలాడుతున్నట్లు తెలుస్తోంది.

చంద్ర‌గిరిలో పోటీకి లోకేష్‌ వెన‌క‌డుగు ఎందుకు
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts


Share
Share