
ఒకప్పుడు ఆయన విద్యా సంస్థల అధినేత. తన పేరుతోనే ప్రారంభించిన విద్యాసంస్థలను నెంబర్ వన్ స్థానంలో పరుగులు పెట్టించారు. ఆయనే నారాయణ విద్యాసంస్థల అధినేత పొంగూరు నారాయణ. కాపు సామాజిక వర్గానికి చెందిన ఈయన ఆర్థికంగా బలపడ్డాక.. 2014కు ముందు టీడీపీ అధినేత చంద్రబాబు బాగా ఉపయోగపడ్డారు. దీనికి మరో కారణం కూడా ఉంది. చంద్రబాబు రాష్ట్రంలో తొమ్మిదేళ్లు సీఎంగా ఉన్న కాలంలో నారాయణ విద్యాసంస్థలకు ఎంతో సాయం చేశారు. ఎక్కడ కావాలంటే అక్కడ సంస్థల ఏర్పాటుకు అనుమతి ఇచ్చారు. దీంతో రుణం తీర్చుకునేందుకు నారాయణ పార్టీ విపక్షంలో ఉండగా, ఎన్నికలకు ముందు కూడా ఎంతో సాయం చేశారు. దీంతో చంద్రబాబు 2014 ఎన్నికల అనంతరం నారాయణకు పార్టీలో ప్రాధాన్యం ఇచ్చారు.
తొలుత ఎమ్మెల్సీగా ఆయనను పార్టీలోకి ఆహ్వానించిన బాబు.. తర్వాత ఆయనను మంత్రిగా తీసుకున్నారు. కీలకమైన మునిసిపల్ శాఖను మంత్రి నారాయణకి అప్పగించారు. తొలుత ఆయన మంత్రిగా ఏం రాణిస్తారులే అనుకున్నారు అందరూ. ముఖ్యంగా పార్టీలోని సీనియర్లు తెరచాటుగా నారాయణపై వ్యంగ్యాస్త్రాలు కూడా రువ్వారు. అనంతరం, సీఎం చంద్రబాబు ఆయనకు అదనంగా రాజధాని అభివృద్ధి ప్రాంత ఏజెన్సీ(ఏపీ సీఆర్ డీఏ) ఉపాధ్యక్షుడిగా నియమించి మరింతగా బాధ్యత పెంచారు. రాజధాని నిర్మాణాల బాధ్యతను కూడా అప్పగించారు. దీంతో ఆయన అటు మంత్రిగా, ఇటు ఏపీ సీఆర్ డీఏ ఉపాధ్యక్షుడిగా కూడా బాధ్యతలు నిర్వహించాల్సి వచ్చింది. ఇది ఓ రకంగా కత్తిమీద సాములాంటిదేనని మిగిలిన మంత్రులు సైతం అంగీకరించారు.
అయితే, మంత్రి నారాయణ మాత్రం దీనిని స్పోర్టివ్‌గా తీసుకుని ముందుకు సాగారు. ముఖ్యంగా సీఎం చంద్రబాబు ఎంత చెబితే అంత అన్నట్టుగా మంత్రి నారాయణ వ్యవహరించడంతో అతి తక్కువ కాలంలోనే సీఎం టీంలో అత్యంత నమ్మకస్తుడుగా మారిపోయారు. అవినీతి జోలికిపోకుండా తన పేషీ కార్యక్రమాలను నిర్వహిస్తూ.. అందరికీ ఆదర్శంగా నిలిచారు. రాజధాని నిర్మాణ డిజైన్ల విషయంలో రాజీ పడకుండా చంద్రబాబు ఓకే అనేవరకు నారాయణ కష్టపడ్డారు. అదే సమయంలో దర్శకుడు రాజమౌళి దగ్గరకు సైతం వెళ్లి రాజధాని డిజైన్లపై చర్చించడం గమనార్హం. ఇక, మంత్రి గంటా శ్రీనివాసరావుతో వియ్యం అందుకోవడం విశేషం. మంత్రులుగా ఒకరికి ఒకరు సాయం చేసుకుంటున్నారనే వ్యాఖ్యలు కూడా వినిపించాయి.
ఇదిలావుంటే, మంత్రిగా సక్సెస్ అయిన నారాయణ .. వచ్చే ఎన్నికలపై దృష్టి పెట్టారు. 2019 ఎన్నికల్లో నెల్లూరు సిటీ నుంచి తాను పోటీ చేయాలని నిర్ణయించుకున్నట్టు ఆయన సహచరులతో చెప్పడం గమనార్హం. ఈ క్రమంలోనే మంత్రిగా తన పనితీరు, నియోజకవర్గంలో తన పట్ల ఉన్న అభిప్రాయాలను ఆయన అతి రహస్యంగా తెలుసుకుంటున్నారు. మరి ఇవి సక్సెస్ రేంజ్లో రిజల్ట్ ఇస్తే.. మంత్రి నారాయణ వచ్చే ఎన్నికల్లో ప్రత్యక్ష రాజకీయాల్లోనే పార్టిసిపేట్ చేసే అవకాశం ఉంటుందని తెలుస్తోంది. ఏదేమైనా.. మౌనంగా అమాయకంగా వచ్చిన నారాయణ.,. మంత్రిగా తన సత్తా చాటుతున్నారనడంలో సందేహం లేదు.