టీడీపీపై ప‌వ‌న్ ఫైరింగ్ వెన‌క ఆయ‌న ఉన్నారా..!

March 15, 2018 at 12:37 pm
pawan kalyan, janasena, comments on TDP, JFC, vundavalli arun kumar,

పవన్ కళ్యాణ్ దూకుడు వెనుక ఎవరున్నారు..? తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు బాగానే పని చేస్తున్నారని నిన్న‌మొన్న‌టి వ‌ర‌కు చెప్పిన‌ జనసేన అధినేత ఇప్పుడు స్వరం మార్చడానికి కారణం ఏమిటి..? తాను ప్రభుత్వాలతో గొడవలకు దిగనని చెప్పిన ఆయన గొడవపెట్టుకునే స్థాయికి ఎలా వచ్చారు? గత ఎన్నికల్లో టీడీపీకి మద్దతు ఇచ్చి.. ఇప్పుడదే పార్టీ అధినేత, మంత్రులపై అవినీతి ఆరోపణలు గుప్పించడం ఏమిటి..?  ప‌వ‌న్ ఏకంగా చంద్ర‌బాబు త‌న‌యుడు లోకేశ్ అవినీతిని ప్ర‌ధానంగా టార్గెట్ చేసుకుని మాట్లాడ‌డం ఏంటి ? ఇలా అనేక ప్రశ్నలు ఆంధ్రప్రదేశ్ లో హాట్ హాట్ గా మారాయి. 

 

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇంతటి స్థాయిలో ఫైర్ కావడం వెనుక ఓ కీలక నేత ఉన్నట్లు తెలుస్తోంది. రెండు మూడు నెలల్లోనే ఆయనలో ఇంతగా మార్పు రావడానికి ఆ నేతే కారణమనే ప్రచారం జరుగుతోంది. రెండు నెలల కిందట పవన్ కళ్యాణ్ తెలంగాణ లోని కరీంనగర్ జిల్లా కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయం నుంచి ప్రజాయాత్ర చేపట్టారు. యాత్ర చేపట్టే ముందు ఆయన ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడున్న తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు బాగానే పని చేస్తున్నాయనీ..తనకు ప్రభుత్వాలతో గొడవలకు దిగే ఉద్దేశం లేదని ప్రకటించారు. యాత్రలో భాగంగా కరీంనగర్, ఖమ్మం, అనంతపురం జిల్లాల్లో పర్యటించి కార్యకర్తలతో సమావేశాలు నిర్వహించారు. 

 

ఈ క్రమంలోనే అనేక రాజకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి. ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా విషయం రగులుకుంది. అసలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కేంద్రం ఎన్ని నిధులు కేటాయించిందో చెప్పాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. కానీ వెబ్సైట్ లో అన్ని వివరాలు ఉన్నాయంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు దాటవేయడం, అదేసమయంలో కేంద్రంలోని బీజేపీ నుంచి సరైన స్పందన రాకపోవడంతో కేటాయించిన నిధుల లెక్కల సంగతి తేల్చేందుకు ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీ ఏర్పాటు చేశారు. ఇందుకు ఆయన కాంగ్రెస్ సీనియర్ నేత ఉండవల్లి అరుణ్ కుమార్, లోక్ సత్తా పార్టీ అధినేత జయప్రకాష్ నారాయణ్ తో సంప్రదింపులు జరపడం, కమిటీ సమావేశం నిర్వహించడం చకచకా జరిగిపోయాయి. 

 

ఈ క్రమంలోనే టీడీపీ ప్రభుత్వం పనితీరు, పనుల్లో మంత్రులపై వస్తున్న అవినీతి ఆరోపణలు, అసలు ఏపీలో ఏం జరుతుందన్న విషయాలపై ఉండవల్లి అరుణ్ కుమార్ పవన్ కళ్యాణ్ కు వివరించినట్లు సమాచారం. ఇదేసమయంలో ప్రత్యేక హోదా ఇవ్వడం కుదరదని కేంద్ర ప్రభుత్వం తేల్చి చెప్పడం.. కేంద్ర ప్రభుత్వం నుంచి టీడీపీ బయటకు రావడం.. కేంద్రంలో ఇద్దరు టీడీపీ మంత్రులు, రాష్ట్రంలో ఇద్దరు బీజేపీ మంత్రులు రాజీనామాలు చేయడంతో ఒక్కసారిగా రాజకీయ వాతావరణం వేడెక్కింది. 

 

ప‌వ‌న్ ఇప్ప‌టి వ‌ర‌కు టీడీపీకి, చంద్ర‌బాబుకు అనుకూలంగా మాట్లాడుతూ వ‌స్తున్నారు. ఇక‌పై అదే ధోర‌ణితో వెళితే ప‌వ‌న్ టీడీపీకి భ‌జ‌న‌ప‌రుడిగా మారిన‌ట్ల‌వుతుంద‌ని.. ఆ ముద్ర రాకుండా చూసుకోవాల‌ని ఉండ‌వ‌ల్లి ప‌దే ప‌దే ప‌వ‌న్‌కు చెప్పిన‌ట్టు టాక్‌. ఈ నేపథ్యంలో టీడీపీ, బీజేపీలకు దగ్గరగా ఉండడం ఇక ఎంతమాత్రం మంచిదికాదనీ.. కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలపై పోరాటంతో ప్రజల్లోకి వెళ్లాలని గట్టి నిర్ణయం తీసుకొనే గుంటూరులో జరిగిన పార్టీ ఆవిర్భావ సభలో పవన్ కళ్యాణ్ ఫైర్ అయినట్లు పలువురు నేతలు అంటున్నారు. మరో విషయం ఏమిటంటే.. గుంటూరు సభలో పవన్ కళ్యాణ్ తొలిసారిగా చంద్ర‌బాబు అండ్ టీడీపీ ప్ర‌భుత్వంపై తీవ్ర‌స్థాయిలో విమ‌ర్శ‌లు చేయ‌డంతో రాజ‌కీయంగా హాట్ హాట్‌గా ప్ర‌కంప‌న‌లు రేపుతోంది.

 

టీడీపీపై ప‌వ‌న్ ఫైరింగ్ వెన‌క ఆయ‌న ఉన్నారా..!
0 votes, 0.00 avg. rating (0% score)

comments



Related Posts