పవన్ కొత్త ఛానల్ కు ముహూర్తం ఖరారు!

July 4, 2018 at 1:48 pm
Pawan Kalyan, janasena, News media, New channel, launch date

రాజ‌కీయాల‌న్నాక‌.. సొంత ప్ర‌చారం చేసుకునేందుకు ప‌త్రికైనా ఉండాలి. లేదా చానెల్ అయినా ఉండాలి. ఇప్పుడు ఇది ట్రెండ్‌! రాష్ట్రంలో అధికార‌పార్టీకి అన‌ధికారికంగా ప్ర‌చారం చేసేందుకు మూడు నుంచి ఐదు ఛానెళ్లు సిద్ధంగా ఉన్నాయి. ఇక‌, వీటిలో రెండు ఛానెళ్లు ఎప్పుడూ భ‌జ‌న చేయ‌డంలో ముందంజలో ఉన్నాయి. ఇక‌, విప‌క్షం వైసీపీకి సాక్షి సొంత ఛానెల్‌, ప‌త్రిక కూడా ఉన్నాయి. ఇక‌, ఇప్పుడు మూడో కీల‌క పార్టీగా జ‌న‌సేన అరంగేట్రం చేసింది.వ‌చ్చే ఎన్నిక‌ల్లో సొంత‌గా పోటీ చేయాల‌ని, కుదిరితే మొత్తంగా 175 నియోజ‌క‌వ‌ర్గాల్లోనూ బ‌రిలోకి దిగాల‌ని ప‌వ‌న్ డిసైడ్ అయ్యాడు. ఈ నేప‌థ్యంలో త‌న‌కు విస్తృతంగా ప్ర‌చారం చేసి పెట్ట‌గ‌ల ఛానెల్ ఇప్పుడు ప‌వ‌న్‌కు అత్యంత అవ‌స‌రం.

వాస్త‌వానికి జ‌న‌సేనానికి ఆది నుంచి కూడా తెలుగు మీడియా అండ‌గానే నిలిచింది. ఆయ‌న పార్టీ పెట్టిన ద‌గ్గ‌ర నుంచి కూడా ఛానెళ్లు.. జ‌న‌సేనానికి క‌వ‌రేజీ ఇస్తూనే వ‌స్తున్నారు. అయితే, ఇటీవ‌ల కొన్ని రోజుల కింద‌ట ఫిలిన‌గ‌ర్‌లో జ‌ర‌గిన శ్రీరెడ్డి ఉదంతం త‌ర్వాత‌.. మీడియాకు,ప‌వ‌న్‌కు మ‌ధ్య తీవ్ర‌స్థాయిలో గ్యాప్ పెరిగిపోయింది. పవన్‌కు వస్తున్న ప్రచారం.. మీడియా కవరేజీ పరిమితమయింది. దీంతో.. పవన్ కల్యాణ్ ప్ర‌స్తుతం ఉత్త‌రాంధ్ర‌లో చేస్తున్న పోరాట యాత్ర‌ ప్రజల్లోకి వెళ్లడం లేదన్న భావన జనసేన వర్గాల్లో ఉంది. దీంతో మ‌న‌మే సొంత‌గా ఓ ఛానెల్‌ను న‌డిపితే బాగుంటుంద‌నే ఆలోచ‌న వ‌చ్చింది. వెనువెంట‌నే రంంలోకి దిగి.. సొంత‌గా ఛానెల్ పెట్టుకోవ‌డ‌మా? లేక ఇప్ప‌టికే ఉన్న ఛానెల్‌ను తీసుకోవ‌డ‌మా? అనే విష‌యం తెర‌మీదికి వ‌చ్చింది.

ఈ క్ర‌మంలో సొంతగా కొత్త ఛానెల్ ప్రారంభించే బ‌దులుగా ఇప్ప‌టికే ఉండి ముక్కి మూలుగుతున్న ఛానెల్‌ను తీసుకోవ డం మంచిద‌ని భావించారు. ఈ క్ర‌మంలోనే ప్ర‌స్తుతం ఖాళీగా ఉన్నప్రముఖ తులసీ సీడ్స్ యజమాని తులసీరామచంద్ర ప్రభు..టీవీ చానల్‌పై ప‌వ‌న్ దృష్టి పెట్టార‌ని కొన్నాళ్లు ప్ర‌చారం సాగింది. ఈ చానల్‌కు లైసెన్స్ , బ్యాండ్ విడ్త్ ఉన్నాయి. తులసీ రామచంద్రప్రభు కుటుంబసభ్యులు ఇప్పుడు జనసేన పార్టీలో కీలకంగా వ్యవహరిస్తున్నారు. ఈ నేప‌థ్యంలోనే ఈ ఛానెల్‌ను ప‌వ‌న్ కొనుగోలు చేయొచ్చ‌ని స‌మాచారం. అయితే, ఇంత‌లోనేప‌వ‌న్ వ్యూహం మారిపోయింద‌ని తెలుస్తోంది. ఎలాగూ వ‌చ్చే ఎన్నిక‌ల్లో క‌మ్యూనిస్టుల‌తో క‌లిసే పోటీకి సిద్ధ‌మ‌వుతున్న నేప‌త్యంలో వీరికి చెందిన 10టీవీని కొనుగోలు చేయ‌డంపై దృష్టి పెట్టారని వార్త‌లు వ‌స్తున్నాయి.

ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్న టెన్ టీవీలో కొంత పెట్టుబడి సీపీఎం నేత తమ్మినేని వీరభద్రంది కాగా.. మిగతా అంతా క్రౌడ్ ఫండింగ్. జనసేన కోసం పారిశ్రామికవేత్త నిమ్మగడ్డ ప్రసాద్ టెన్‌టీవీలో పెట్టుబడులు పెడతారన్న ప్రచారం కూడా జరుగుతోంది. దీని కోసం చర్చలు ప్రారంభించారట. చిరంజీవి కూడా పెట్టుబడుల చర్చల్లో పాల్గొంటున్నట్లు తెలుస్తోంది. నిమ్మగడ్డ ప్రసాద్, చిరంజీవి, అల్లు అరవింద్, నాగార్జున గతంలో మా టీవీలో పార్టనర్లుగా వ్యవహరించారు. మొత్తంగాత‌న మేనిఫెస్టో విడుద‌ల చేసే ఆగ‌స్టు 14 నాటికి ప‌వ‌న్ సొంత ఛానెల్ ను ప్రారంభిస్తార‌నే ప్ర‌చారం జోరుగా సాగుతుండ‌డం గ‌మ‌నార్హం.మ‌రి ఏం జ‌రుగుతుందో చూడాలి.

పవన్ కొత్త ఛానల్ కు ముహూర్తం ఖరారు!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts


Share
Share