పవన్ పాలిటిక్స్…ఇది పరాకాష్ట!

August 13, 2018 at 11:33 am
Pawan Kalyan, Janasena, politics, alcohol ban, in andhra pradesh

తెరమీద నటించడంలో సూపర్ హిట్ ల కంటె, సూపర్ ఫ్లాప్ ల సంఖ్య అధికంగా ఉన్నప్పటికీ.. మెగా కుటుంబ సభ్యుడిగా, కులాభిమానులకు దేవుడిగా అంతో ఇంతో పేరు తెచ్చుకున్న పవన్ కల్యాణ్.. రాజకీయాల్లో కూడా నటించేస్తే సరిపోతుందని అనుకున్నట్లుగా కనిపిస్తోంది. అన్నీ మనం చేసేస్తున్నట్టే ఉండాలి.. కానీ ఏ పనీ జరగకూడదు. ప్రజలు కోరుకునే కీలకాంశాలకు తాము కట్టుబడి ఉన్నట్లే కనిపించాలి.. .కానీ వారి కోరిక మాత్రం తీరకూడదు అన్నట్లుగా.. పవన్ కల్యాణ్ వక్ర రాజకీయాలకు తెర తీస్తున్నారు.

సగటు కుటుంబాలను, జీవితాలను ఛిద్రం చేసేస్తున్న, సర్వనాశనంగా మారుస్తున్న మద్యపాన మహమ్మారిని దూరం కావాలనేది మహిళల కోరికగా ప్రబలంగా ఉంది. ప్రస్తుతం ఉన్న చంద్రపాలనలో పైకి ఎన్ని మాటలు చెబుతున్నప్పటికీ.. బెల్టుషాపులు విచ్చలవిడిగా మారి.. జీవితాలను శిథిలంచేసేస్తున్నాయన్నది నిజం. ప్రభుత్వం నిస్సిగ్గుగా- బెల్టు షాపులను తొలగిస్తాం అనే మాటను కొన్ని సంవత్సరాలుగా చెబుతూ వస్తోంది.

వైఎస్ జగన్మోహన్ రెడ్డి చాలా ప్రాక్టికల్ గా మద్య నిషేధం పెట్టేస్తాం.. అనే అసాధ్యమైన హామీ ఇవ్వకుండా.. నూతన మద్య విధానం తీసుకువస్తాం అంటూ ఒక భరోసాగల హామీ ఇచ్చారు. అందులోని నిబంధనల్ని కఠినంగా అమలు చేస్తాం అని చెప్పారు.

38921063_655280134871265_7253144326270615552_n

కానీ, కొత్తగా రంగంలోకి వచ్చి, హఠాత్తుగా తాను ముఖ్య మంత్రి అయిపోవాలని కలలు కంటున్న పవన్ కల్యాణ్… మద్యం షాపుల విషయంలో ఘోరమైన మాట ఇచ్చారు. 75 శాతం మహిళలు వ్యతిరేకించిన చోట షాప్ లను బంద్ చేయిస్తారట. అంటే ఒక మద్యం షాపు మూసేయాలంటే.. ఆ ఏరియాలోని 75 శాతం మహిళలు రోడ్డు మీదకు రావాలా? మద్యం మాఫియా వారు ఏక్షణంలో ఏం చేస్తారో తెలియక ప్రాణాలు గుప్పిట్లో పెట్టుకుని బతకాలా? తన మాటల ద్వారా పవన్ ఏం చెప్పదలచుకున్నారు? చూడబోతే.. బెల్టు షాపులను తీసేస్తానంటున్న పవన్ పాలనలో బెల్టుషాపు ఉన్న ప్రతిచోటా.. రెగ్యులర్ షాపునే ఏర్పాటుచేస్తారేమోననే భయం కలుగుతోంది.

75 శాతం మంది మహిళలు ఒప్పుకుంటేనే ఒక ప్రాంతంలో షాపు కు అనుమతి లభిస్తుంది… అని పేర్కొంటే ఒక రకంగా ఉండేది. అప్పుడు మద్యం వ్యాపారులే మహిళలను దేవతల్లా చూసుకుని, వారిని ప్రసన్నం చేసుకునేవారు. కానీ పవన్ 75 శాతం మంది వ్యతిరేకిస్తేనే షాపు బంద్ చేస్తాం అనడం వల్ల.. మద్యం ముఠాలు.. మహిళల్ని మరింతగా భయపెడతారు. మహిళలకు భద్రత కరవవుతుంది. చెడు పర్యవసానాలకు వెరవని, తెగించిన, సాహసించే మహిళలు మన సమాజంలో 75 శాతం మంది ఉంటారా? ఇది ప్రాక్టికల్ గా సాధ్యమేనా? పవన్ ఇలాంటి బూటకపు మాటలతో మహిళల్ని మోసం చేయాలనుకోవడం చీదర పుట్టిస్తోందని పలువురు భావిస్తున్నారు.

పవన్ పాలిటిక్స్…ఇది పరాకాష్ట!
0 votes, 0.00 avg. rating (0% score)

commentsRelated Posts


Share
Share