ఏపీ రాజకీయాల్లో పవన్ భలే మార్పు తెచ్చాడే!

August 8, 2018 at 9:29 am
Pawan Kalyan, Janasena, Politics, andhra pradesh, congress party leaders, chiranjeevi

సినిమాల్లో ట్రెండ్ సెట్ట‌ర్‌.. పాలిటిక్స్‌లో మాత్రం అట్ట‌ర్ ఫ్లాప్‌. సినిమాల్లో స్టార్ ఇమేజ్‌.. పాలిటిక్స్‌లో డ్యామేజ్‌. ఇదీ ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్‌క‌ళ్యాణ్ ప్ర‌స్తుత ప‌రిస్థితి. స‌రికొత్త రాజ‌కీయాలు తెస్తాన‌ని చెప్పిన ప‌వ‌న్.. తుక్కునంతా మోసుకొస్తున్నారు. న‌యాట్రెండ్ సృష్టిస్తాన‌న్న ప‌వ‌న్‌.. న‌వ్వుల‌పాలు రాజ‌కీయాలు చేస్తున్నారు. ద‌శ‌, దిశ లేని నిర్ణ‌యాలు తీసుకుంటూ.. క‌ర్ణ‌భేరి ప‌గిలేలా డైలాగులు చెబుతూ.. పాలిటిక్స్‌లో పాపం ప‌వ‌న్‌గా మిగిలిపోతున్నారు. ప‌వ‌న్ గురించి మ‌రీ ఇలా అంటారా..? అని మీకు అనిపిస్తే.. ఒక‌సారి రాజ‌కీయాల్లో ఆయ‌న తీరు చూస్తే.. మీరు కూడా అంత‌కుమించి అంటారేమో. ఎందుకంటే.. పార్టీలో చేర్చుకోకుండా ప‌ద‌వులు క‌ట్ట‌బెట్ట‌డం.. ఏ పార్టీలో ఉన్నారో కూడా తెలియ‌ని నాయ‌కుల‌ను ప‌క్క‌న బెట్టుకోవ‌డం.. రాజ‌కీయాల్లో ప‌వ‌న్ తెచ్చిన మార్పు ఇదేమ‌రి.

జ‌న‌సేన అధినేత‌గా ఆయ‌న అనుస‌రిస్తున్న తీరుతో అంద‌రూ విస్తుపోతున్నారు. ఇక ఇతర రాజ‌కీయ పార్టీలు అయితే.. దాదాపుగా ఆయ‌న ఏం మాట్లాడినా పెద్ద‌గా ప‌ట్టించుకోవ‌డం లేద‌నే చెప్పాలి. ఉత్త‌రాంధ్ర‌లోనే ఆయ‌న ఎక్కువ‌గా ప‌ర్య‌టిస్తున్నారు. త‌న సొంత సామాజిక‌వ‌ర్గం ఎక్కువ‌గా ఉన్న ఈ ప్రాంతంలోనే ప‌ట్టుకోసం ప్ర‌య‌త్నం చేస్తున్నారు. అయితే.. ప‌లువురు నాయ‌కులు జ‌న‌సేన‌లో చేరుతున్నారు. అయితే, విచిత్ర‌మేమిటంటే.. ఇత‌ర పార్టీలో ఉన్న వారు జ‌న‌సేన‌లో చేరేందుకు ఆస‌క్తిచూపుతున్నారు. ఇంకా వారు ఆయా పార్టీల‌కు రాజీనామాలు చేయ‌క‌ముందే.. జ‌న‌సేన‌లో చేరి స‌భ్య‌త్వం తీసుకోక‌ముందే వారికి ప‌వ‌న్ ప‌ద‌వులు క‌ట్ట‌బెడుతున్నారు. ఇటీవ‌ల ముగ్గురికి ఆయ‌న ప‌ద‌వులు ఇచ్చిన తీరు రాజ‌కీయ వ‌ర్గాల‌ను ఆశ్చ‌ర్యానికి గురిచేస్తోంది.

నిజానికి ఇప్ప‌టికే అనేక పార్టీలు మారి ఇపుడు ఏ పార్టీలో ఉన్నారో కూడా తెలీని మాజీ మంత్రి ముత్తా గోపాల‌కృష్ణ‌కు ప‌వ‌న్ ప‌ద‌వి ఇచ్చేశారు. జ‌నసేన‌లో పొలిటిక‌ల్ అడ్వైజ‌రీ క‌మిటీలో చోటు క‌ల్పించ‌బోతున్న‌ట్లు ప్ర‌క‌టించారు. వాస్త‌వానికి ముత్తా గోపాల‌కృష్ణ ఇంకా జ‌న‌సేన పార్టీలో చేర‌నే లేదు. ఇక‌ తూర్పు గోదావ‌రి జిల్లాలో కో ఆర్డినేటర్ గా మేడా గురుద‌త్త ప్ర‌సాద్ ను ప్ర‌క‌టించారు. అలాగే జాయింట్ కో ఆర్డినేట‌ర్లుగా పెసంగి ఆదినారాయ‌ణ, శెట్టిబ‌త్తుల రాజ‌బాబుల‌ను నియ‌మించారు ప‌వ‌న్‌. అయితే వీరిద్ద‌రూ జ‌న‌సేన‌లో స‌భ్యులు కారు. ప‌వ‌న్ ప‌ద‌వి ప్ర‌క‌టించిన‌పుడు శెట్టిబ‌త్తుల రాజ‌బాబు వైసీపీలో ఉన్నారు. ఇక‌ పెసింగి ఆదినారాయ‌ణేమో వీఆర్ఎస్ తీసుకుని ఏపీలో ప‌ర్య‌టిస్తున్న సీబీఐ జేడీ ల‌క్ష్మీనారాయ‌ణ‌తో క‌లిసి ఉంటున్నారు. ఇలా ఇత‌ర పార్టీల్లో ఉన్న‌వారికీ ప‌ద‌వులు ఇవ్వ‌డం విచిత్ర‌మే మ‌రి.

మొద‌టి నుంచీ ప‌వ‌న్ తీరు ఇలాగే ఉంది. ఆయ‌న‌కు మూడొచ్చిన‌ప్పుడే ప్ర‌జ‌ల్లోకి వ‌స్తార‌నే ముద్ర‌ప‌డింది. అయితే కొన్ని నెల‌లుగా మాత్రం ఏపీలో బిజీగా ప‌ర్య‌టిస్తున్నారు. కానీ, దిశానిర్దేశం లేకుండా ఆయ‌న ప‌ర్య‌ట‌న కొన‌సాగుతోంది. మ‌రో విష‌యం ఏమిటంటే.. కాంగ్రెస్ పార్టీలో కొన‌సాగుతున్న ఆయ‌న అన్న చిరంజీవి అభిమానుల‌ను జ‌న‌సేన‌లోకి ఆహ్వానించారు. ఇది కూడా విచిత్రంగానే క‌నిపిస్తోంది. అన్నేమో కాంగ్రెస్ పార్టీలో ఉంటే.. ఆయ‌న అభిమానులు జ‌న‌సేన‌లో ఎలా ఉంటార‌నే ప్ర‌శ్న‌లు ఉత్ప‌న్న‌మ‌వుతున్నాయి. ఇక జ‌న‌సేన‌లోకి వ‌స్తున్న వారిలో నాటి ప్ర‌జారాజ్యం పార్టీలో వివిధ హోదాల్లో ప‌నిచేసిన వారే కావ‌డం గ‌మ‌నార్హం. ఈ నేప‌థ్యంలోనే ప‌వ‌న్‌పై ఆస‌క్తిక‌ర‌మైన కామెంట్లు వినిస్తున్నాయి. ఆహా.. రాజ‌కీయాల్లో ప‌వ‌న్ భ‌లే మార్పు తెస్తున్నారంటూ ప‌లువురు సెటైర్లు వేస్తున్నారు.

ఏపీ రాజకీయాల్లో పవన్ భలే మార్పు తెచ్చాడే!
0 votes, 0.00 avg. rating (0% score)

commentsRelated Posts


Share
Share