పవన్.. పోరాటయాత్రను అటకెక్కించారా?

September 12, 2018 at 7:41 pm

జనసేనాని పవన్ కల్యాణ్ ప్రవర్తించే తీరును గమనిస్తే.. ఆయన పార్ట్ టైం పొలిటీషియన్ అనే అభిప్రాయం ఎవ్వరికైనా కలుగుతుంది. ఆయన అప్పుడెప్పుడో మార్చి నెలలో పార్టీ ఆవిర్భావ సభ నిర్వహించి.. తాను వచ్చే ఎన్నికల్లో ప్రత్యక్ష సమరానికి సిద్ధమవుతున్నాననే సంకేతాలు ఇచ్చారు. అప్పటినుంచి ఇప్పటిదాకా నిర్వహించిన బహిరంగ సభలను వేళ్ల మీద లెక్కపెట్టవచ్చు.

అదలా ఉంచితే.. చంద్రబాబు సర్కార్ దుర్మార్గంగా పాలిస్తోంది.. వీరిని గద్దె దించడానికి, ప్రజల్లో చైతన్యం తీసుకురావడానికి ఆయన పోరాటయాత్ర ప్రారంభించారు. ఈ యాత్ర ప్రారంభించి నెలలు గడిచాయి. ఇప్పటిదాకా ఓసారి లెక్కతీస్తే.. ఆయన పోరాటం పేరుతో యాత్ర చేసిన రోజులకంటె.. తరచూ హైదరాబాదు వచ్చేసి విశ్రాంతి తీసుకుంటున్న రోజుల సంఖ్యే ఎక్కువగా నిగ్గు తేలుతుంది. ఇప్పుడు చూస్తే ఆయన తన పోరాటయాత్రను అటకెక్కించారేమో అనిపిస్తోంది.

ఎందుకంటే.. ప్రస్తుతం తెలంగాణ ముందస్తు ఎన్నికల హడావిడి నడుస్తోంది. మామూలుగా అయితే.. తన పార్టీకి ఇక్కడ అతీగతీ లేని ప్రస్తుత తరుణంలో మరో నాయకుడు అయితే.. మిన్నకుండిపోయేవారు. కానీ, పవన్ మాత్రం.. తనతో పొత్తు కోసం సీపీఎం ఎగబడుతూ ఉండేసరికి తగుదునమ్మా అంటూ ఎన్నికల బరిలోకి దిగుతున్నారు. వారితో పొత్తు సంగతి ఇవాళ తుదిరూపు సంతరించుకోనుంది.

ఆయన కంటికి చేయించుకున్న ఆపరేషన్ కు ఇన్ఫెక్షన్ వచ్చిందనే నెపం మీద చాన్నాళ్లుగా పోరాటయాత్రను వదిలేసి హైదరాబాదులోనే గడుపుతున్నారు. మధ్యలో వ్యక్తిగత పర్యటనలాగా విదేశాలకు వెళ్లి వచ్చినట్లుగా కూడా గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇప్పుడు తెలంగాణ పొత్తుల సంగతి తేలుస్తున్నారు. దీని తర్వాత.. ఆ పొత్తుల కూటమికి అభ్యర్థుల ఎంపిక, కొత్త శక్తులను ఆ కూటమిలోకి తీసుకురావడం వంటి బాద్యతలు ఉంటాయి. ఆ తర్వాత.. పొత్తుల కూటమి తరఫున ఎన్నికల ప్రచారం వంటి రూపాల్లో బిజీ అయిపోతారు.

తెలంగాణ ముందస్తు ఎన్నికలు పూర్తయ్యేసరికి కనీసం డిసెంబరు నెల కూడా గడచిపోతుంది. అప్పుడిక ఏపీలో ఎన్నికలు కేవలం మూణ్నెల్ల దూరంలో ఉంటాయి. అంత తక్కువ వ్యవధిలో రాష్ట్రం మొత్తం తిరిగి పవన్ పార్టీని సన్నద్ధం చేయగలరా? లేదా ఇప్పట్లోనే తెలంగాణ ఎన్నికల ప్రచారాలతో పాటూ.. ఏపీలో పోరాటాన్ని కూడా సమాంతరంగా కొనసాగిస్తారా? అనేది అనుమానం. ప్రస్తుతానికి పోరాటయాత్ర అటకమీదనే ఉన్నదని.. ఎప్పుడు కిందికి దించుతారో తెలియదని పలువురు అంటున్నారు.

పవన్.. పోరాటయాత్రను అటకెక్కించారా?
0 votes, 0.00 avg. rating (0% score)

commentsRelated Posts


Share
Share