
మాటలు కోటలు దాటె.. అడుగుమాత్రం గడప దాటలేదట..! నరంలేని నాలుకది చాటింపు ఎక్కువ.. పాటించడం తక్కువ..! పంచ్ డైలాగులు కంచులా మెగినా.. ఆచరణకు మాత్రం ఆమడదూరంలోనే ఆగిపోతాయి.. ఇంతకీ ఈ ముచ్చట ప్రాసలో బాగానే ఉందిగానీ.. అసలు విషయం ఏమిటనే కదా మీ డౌటు..! ఇక అక్కడికే వద్దాం.. టాలీవుడ్లో ట్రెండ్‌సెట్టర్‌గా వెలుగొందిన పవన్.. రాజకీయాల్లో మాత్రం కాపీ కట్టర్‌గా రాణించేందకు ప్రయత్నం చేస్తున్నారు. అప్పుడెప్పుడో జనసేన పార్టీని ఏర్పాటు చేసి.. మూడొచ్చినప్పుడు మీడియా ముందుకొచ్చి ఫటాఫట్ పంచ్‌లతో ఆ పూటకు సందడి చేయడం.. మాయం కావడం… మళ్లీ కొంతకాలానికి దర్శనమివ్వడం తెలిసిందే.. అయితే కొంతకాలంగా ఆయనలో గింతంత మార్పు వచ్చింది. ప్రజాపోరాటయాత్ర పేరుతో జనంలో ఉండేందుకు ప్రయత్నం చేస్తున్నారు.
అదికూడా ఉత్తరాంధ్రకే పరిమితం అయ్యారు. ఈ క్రమంలో పవన్ పశ్చిమగోదావరి జిల్లాను దాదాపుగా చుట్టేశారు. మరో నాలుగు రోజుల్లో అంటే ఈనెల 9న తూర్పుగోదావరి జిల్లాలోకి ఆయన వెళ్లనున్నారు. దీనిని చాలా గ్రాండ్ గా చేయాలన్నది జనసేన ప్లాన్. `కొవ్వూరు నుంచి రాజమండ్రి దాకా 11 కిలోమీటర్ల మేర జనసేన కవాతు.. అందరూ కదలి రండి` అంటూ ఇప్పటికే అధికారికంగా కూడా పిలుపునిచ్చారు. రెండు జిల్లాలకు వారధిగా ఉన్న రాజమండ్రి రోడ్ కమ్ రైల్ బ్రిడ్జి మీదుగా జనసేన ప్రవాహంలా కదలాలన్నది ప్రణాళిక. అయితే.. దీనిని జనసేన ఎందుకు ఇంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంటోంది. ఇందుకు బలమైన కారణమే ఉంది. అదేమిటంటే.. వైసీపీ అధినేత జగన్ ప్రజా సంకల్పయాత్ర రికార్డును బద్దలు కొట్టడమేనట. వైసీపీ కంటే తమకే ఎక్కువబలం ఉందని చూపిండమే పవన్ లక్ష్యమట.
ఒక్కసారి.. జూన్ 12న అంటే సుమారు నాలుగు నెలల కిందట.. పశ్చిమ గోదావరి జిల్లా పర్యటన ముగించుకొని ఈ దారిలోనే జగన్ పాదయాత్ర తూర్పుగోదావరి జిల్లాలో ఎంట్రీ ఇచ్చింది. ఈ సందర్భంగా రోడ్ కమ్ రైల్ బ్రిడ్జి మీదుగా జగన్ వెంట సాగిన అభిమాన సందోహం సముద్రాన్నే తలపించింది. గోదావరిలో వైసీపీ వర్గాలు పడవలతో సాగించిన ప్రయాణం మొత్తానికే హైలెట్. అప్పట్లో ఆ ద`శ్యానికి ప్రశంసల జల్లులు కురిసాయి. బాబోయ్ జగన్ అంటే జనానికి ఇంతలా అభిమానా..? అని అందరూ నోరెళ్లబెట్టారు. ఇక అధికార టీడీపీ వర్గాలు బెంబేలెత్తిపోయాయి. 2003లో అప్పటి ప్రతిపక్ష నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి సైతం ఇదే బ్రిడ్జ్ మీదుగా రాజమండ్రిలోకి వెళ్లారు. ఇప్పుడు జనసేన వైసీపీ రికార్డును బద్దలు కొడుతుందట. ఎప్పుడైతే ఈ విషయం తెలిసిందే.. అప్పటి నుంచి జనసేనది కాపీ కవాతు.. అంటూ సెటైర్లు పేలుతున్నాయి.