టీడీపీలో ప‌వ‌న్ యాత్ర క‌ల‌క‌లం

June 5, 2018 at 11:46 am

ఉత్త‌రాంధ్ర‌.. ఏపీలో అత్యంత వెనుక‌బ‌డిన ప్రాంతం.. అందులోనూ శ్రీ‌కాకుళం మ‌రింత వెన‌క‌బాటుకు గురైన ప్రాంతం.. ఇదే స‌మ‌యంలో ప్ర‌జా ఉద్య‌మాల‌ ఖిల్లా. ఎలాంటి స‌మ‌యంలోనైనా ప్ర‌భుత్వానికి వ్య‌తిరేకంగా తిరుగుబావుటా ఎగుర‌వేస్తుందీ నేల‌. ఇక్క‌డి నుంచే జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్ ప్ర‌జాపోరాట‌యాత్ర మొద‌లుపెట్ట‌డానికి ఈ నేల నేప‌థ్యమేన‌ని ప‌లువురు రాజ‌కీయ విశ్లేష‌కులు భావిస్తున్నారు. ప‌వ‌న్ త‌న పోరాట‌యాత్రను వ్యూహాత్మ‌కంగానే చేప‌ట్టార‌నీ, ఉద్వేగ‌పూరితంగా సోష‌లిస్టు భావాలు వ్య‌క్త‌ప‌రిచే ప‌వ‌న్‌కు ఇక్క‌డి ప్ర‌జ‌లు తొంద‌ర‌గా క‌నెక్టు అవుతార‌న్న రాజ‌కీయ విశ్లేష‌కుల అంచ‌నాలు ఇప్పుడు నిజ‌మ‌వుతున్నట్లు క‌నిపిస్తోంది.

ప‌వ‌న్ క‌ళ్యాణ్ ప్ర‌స్తుతం శ్రీ‌కాకుళంలో ప్ర‌జాపోరాట యాత్ర‌ను ముగించుకుని విజ‌య‌న‌గ‌రం జిల్లాలో ప‌ర్య‌టిస్తున్నారు. పోరాట‌యాత్ర‌లో ప‌వ‌న్ ఎక్కువ‌గా ప్రాంతీయ వెన‌క‌బాటు త‌నంపై, పాల‌కుల వివ‌క్ష‌, నిర్ల‌క్ష్యంపై దాడి చేస్తున్నారు. ప‌వ‌న్ వ్యూహాత్మ‌కంగా స్థానిక అంశాల‌ను ప్ర‌స్తావిస్తూనే చంద్ర‌బాబు టార్గెట్ చేస్తూ ముందుకు వెళ్తున్నారు. షెడ్యూల్‌లో లేకున్నా.. అప్ప‌టిక‌ప్పుడు ఉద్దానం కిడ్నీ బాధితుల కోసం ఏకంగా దీక్ష చేప‌ట్టారు. నిజానికి ముఖ్యమంత్రి చంద్ర‌బాబు ఎక్కువ‌గా అమరావతి, పోలవరం, పట్టిసీమపై దృష్టి సారిస్తున్నారు.

ఉత్తరాంధ్రకు రావాల్సిన గ్రీన్ ఫీల్డ్ విమానాశ్రయానికి కూడా ఆయనే అడ్డుపడ్డార‌నే విమ‌ర్శ‌లు కూడా ఉన్నాయి. ఈ అంశాల‌నే ఆధారంగా చేసుకుని సీఎం చంద్ర‌బాబుపై ప‌వ‌న్ విరుచుకుప‌డుతున్నారు. ప‌వ‌న్ ఎక్కువ‌గా స్థానిక రోడ్ల సమస్యలను..సాగునీటి ప్రాజెక్టులు, మత్స కార్మికుల జెట్టీల సమస్యలను, నిరుద్యోగ యువత అంశాలపై మాట్లాడుతున్నారు. నవనిర్మాణదీక్షల పేరుతో రూ.13 కోట్లు ఖర్చు పెట్టడం ముఖ్యమా?. లేక అదే డబ్బుతో మత్స కార్మికులకు చేపలు పట్టుకునేందుకు జెట్టీలు ఏర్పాటు చేయించటం ముఖ్యమా? అంటూ ప‌వ‌న్‌ప్ర‌శ్నిస్తున్న తీరు స్థానికుల‌ను ఆలోచింప‌జేస్తోంది.

ఈ క్రమంలోనే ఉత్త‌రాంధ్ర టీడీపీలో క‌ల‌వ‌రం మొద‌లైంది. వ‌చ్చే ఎన్నిక‌ల్లో టీడీపీపై ప‌వ‌న్ ఎఫెక్టు ఉంటుంద‌ని ప‌లువురు నాయ‌కులు అంటున్నారు. నిజానికి వ‌చ్చే ఎన్నిక‌ల్లో ప‌వ‌న్ ఎన్నిసీట్లు గెలుస్తారో తెలియ‌దుగానీ.. టీడీపీని మాత్రం ఎంతో కొంత దెబ్బ‌కొడుతార‌నే ఆందోళ‌న టీడీపీ వ‌ర్గాల్లో మొద‌లైంది. విశాఖ లాంటి జిల్లాల్లో ప‌వ‌న్ దెబ్బ టీడీపీకి గ‌ట్టిగానే ప‌డే సూచ‌న‌లు క‌నిపిస్తున్నాయి.

టీడీపీలో ప‌వ‌న్ యాత్ర క‌ల‌క‌లం
0 votes, 0.00 avg. rating (0% score)

commentsRelated Posts


Share
Share