
ప్రశ్నించడానికే వచ్చానని చెప్పిన జనసేనాని ఎక్కడ? ప్రజా పోరాట యాత్ర పేరులో ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడి పార్టీ, క్యాడర్లో జోష్ నింపిన పవన్.. దానిని కొనసాగించడంలో విఫలమయ్యాడా? పార్ట్ టైం నుంచి ఫుల్ టైం రాజకీయాల్లోకి వచ్చి పార్టీని ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన సమయంలో యాత్రకు బ్రేకుల మీద బ్రేకులు వేయడం దేనికి సంకేతం? అనే ప్రశ్నలు ఇప్పుడు రాజకీయ వర్గాల్లో వినిపిస్తున్నాయి. ఎన్నికల ఏడాదిలో పవన్‌పై భారీ ఆశలే ఉన్నా యి. టీడీపీ, వైసీపీకి ప్రత్యామ్నాయంగా 2019 ఎన్నికల్లో జనసేనను తీసుకెళతాడని.. ఆయన అభిమానులు ఎంతో నమ్మకం పెట్టుకున్నారు.
అయితే ప్రస్తుతం పవన్ తీరుతో వీరు నిరాశలో పడిపోయారంటున్నారు విశ్లేషకులు. పవన్ ఎప్పుడు ఏ నిర్ణయం తీసుకుంటాడో.. ఎప్పుడు యాత్ర ప్రారంభిస్తాడో.. ఎప్పుడు ఆపేస్తాడో తెలియని అయోమయంలో ఉన్నారట. అప్పుడప్పుడూ వచ్చి యాత్రలు చేస్తే ప్రజల్లో చులకన భావం ఏర్పడుతుందనే ఆందోళన పెరుగుతోందట. ఎప్పుడు వస్తాడో తెలియదు.. వస్తే ప్రభుత్వంపై హడావుడిగా విమర్శలు, సీఎం చంద్రబాబుపై వ్యంగ్యాస్త్రాలు, చినబాబుపై తనదైన శైలిలో సెటైర్లు వేస్తాడు! ఎప్పుడు ఎక్కడ ఉంటాడో తెలియదు.. కానీ ఉన్న ప్రాంతంలో మాత్రం అభిమానుల కోలాహలం ఆకాశాన్ని తాకుంతుంది.
ఫుల్ రాజకీయాల్లోకి వచ్చానంటాడు.. కానీ దానికీ కొన్ని కండీషన్స్ అప్లై అంటాడు. అప్పుడప్పుడూ కనిపించి, హడావుడిగా నాలుగు విమర్శలు చేసి.. ప్రభుత్వంపై విరుచుకుపడిపోతున్నాడు జనసేనాని పవన్ కళ్యాణ్! ఫలితంగా పవన్ ఇంకా సీరియస్ రాజకీయాలు నేర్చుకోవటం లేదా? అని అందరిలోనూ సందేహాలు కలిగేలా చేస్తున్నాడు. ఉత్తరాంధ్రలో వరస పెట్టి 45 రోజులు పర్యటించి ప్రజా సమస్యలు తెలుసుకుంటానన్న పవన్ తన పర్యటనకు బ్రేకుల మీద బ్రేకులు వేస్తున్నారు. దీంతో పవన్ రాజకీయాలపై మరోసారి అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.
పర్యటనలో ఉండగానే కొన్ని రోజులు ఫాం హౌస్‌కు పరిమితమైపోయాడు. తర్వాత ఓ రెండు రోజుల పాటు కొనసాగించి తన భద్రతా సిబ్బందిలో ఎక్కువ మంది మైనారిటీలు ఉన్నారని చెప్పి రంజాన్ సెలవులు ప్రకటించేశాడు. రంజాన్ అయిపోయి నాలుగు రోజులు గడుస్తున్నా కూడా పవన్.. తన యాత్ర మళ్లీ ఎప్పటి నుంచో ప్రారంభమవుతుందో ఇంతవరకూ ప్రకటించలేదు. ప్రజాపోరాట యాత్రలో ప్రభుత్వంపై విమర్శలు సూటిగా.. స్పష్టంగానే చేశారు. స్థానిక సమస్యలను ప్రస్తావిస్తూ ప్రజలకు దగ్గరయ్యేందుకు ప్రయత్నం చేశారు. కొన్ని చోట్ల పవన్ ప్రసంగాలకు మంచి స్పందనే లభించింది.
ఇక అంతా బాగానే ఉందనుకున్న తరుణంలో యాత్రకు విరామాలు ప్రకటిస్తుండటం ఇప్పుడు అభిమానులను సందిగ్ధంలో పడేసింది. వైసీపీ నేత జగన్ గతంలో విమర్శించినట్లు ఇంటర్వెల్స్ ఎక్కువ సినిమా తక్కువ అన్న చందంగా రాజకీయాలు చేస్తే ముందుకు సాగటం కష్టం అనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. పైగా సార్వత్రిక ఎన్నికలు డిసెంబర్ లోనే జరుగుతాయనే ప్రచారం జోరుగా జరుగుతున్న తరుణంలో.. రాష్ట్రంలో తన పర్యటనను ఎప్పుడు పూర్తి చేసుకుంటారు. 175 సీట్లలో అభ్యర్ధుల ఖరారు ఎప్పుడు పూర్తి చేస్తారు.
ఈ సారైనా పూర్తి స్థాయిలో అభ్యర్ధులను బరిలో నిలబెట్టగలిగే పరిస్థితికి చేరుకుంటారా? లేదా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. జనసేన ఆవిర్భావ సభ సమయంలో కేడర్ కు ఇచ్చిన కిక్‌ను కంటిన్యూ చేయటంలో పవన్ విఫలమవుతు న్నారనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. పవన్ తన తర్వాత రాష్ట్ర స్థాయిలో ఇమేజ్ ఉన్న నాయకులను ఆకర్షించటంలో కూడా ఇంతవరకూ సక్సెస్ అవ్వలేకపోయారు. మరి పవన్ ఇంటర్వెల్ రాజకీయాలకు ఎప్పుడు తెరదించుతారో ఏమో!