తెనాలి సెంటిమెంట్‌ నమ్ముకున్న జోడి!

October 14, 2018 at 12:49 pm

కొన్నిసీట్లు సెంటిమెంట్‌ను అంటిపెట్టుకుని ఉంటాయి. అక్క‌డ ఏ పార్టీ గెలిస్తే ఆ పార్టీయే అధికారంలోకి వ‌స్తుందన్న‌ది ఒక సెంటిమెంట్‌. ఆ స్థానంలో ఏ పార్టీ గెలిస్తే.. ఆ పార్టీ ప్ర‌తిప‌క్షంలో కూర్చుంటుందన్న‌ది మ‌రొక సెంటిమెంట్‌..! ఇలా రాజ‌కీయాల్లో చాలా ర‌కాల సెంటిమెంట్లే ఉన్నాయి. ఇప్పుడు కాంగ్రెస్ నేత‌, ఉమ్మ‌డి ఆంధ్ర‌ప్ర‌దేశ్ స్పీక‌ర్ నాదెండ్ల మ‌నోహ‌ర్ జ‌న‌సేన పార్టీలో చేర‌డంతో ఈ సెంటిమెంట్ చ‌ర్చ తెర‌మీద‌కు వ‌చ్చింది. గ‌తంలో ఆయ‌న పోటీ చేసిన స్థానం గురించి ముచ్చ‌ట మొద‌లైంది. ఈ సీటు రూటుపై తెగ చ‌ర్చ జ‌రుగుతోంది. వ‌చ్చే ఎన్నిక‌ల్లో అక్క‌డ ఎవ‌రెవ‌రు బ‌రిలో ఉంటారు.. ఎవ‌రు గెలుస్తార‌న్న‌దానిపై ఆస‌క్తిక‌ర‌మైన చ‌ర్చ జ‌రుగుతోంది.

అయితే… సూటిగా విష‌యానికి వ‌ద్దాం.. నాదెండ్ల మ‌నోహ‌ర్ గ‌తంలో తెనాలి ఎమ్మెల్యేగా, ఉమ్మ‌డి రాష్ట్ర స్పీక‌ర్‌గా ప‌నిచేశారు. కాంగ్రెస్ పార్టీలో ఆయ‌న‌కు మంచి గుర్తింపు ఉంది. ఆయ‌న అనూహ్యంగా జ‌న‌సేన పార్టీలోకి వెళ్లిపోయారు. ఆయ‌న చేరిక ఆ పార్టీకి ఏ మేర‌కు క‌లిసివ‌స్తుంద‌న్న‌ది త‌ర్వాత విష‌యం. ఒక్క‌సారి తెనాలి సీటు సెంటిమెంట్‌ను చూస్తే.. అక్క‌డ ఏ పార్టీ గెలిస్తే.. ఆ పార్టీనే అధికారంలోకి వ‌స్తోంది. ఈ సెంటిమెంట్ ద‌శాబ్దాలు కొన‌సాగుతోంది. ఇప్పుడు మ‌నోహ‌ర్ రాక‌తో జ‌న‌సేన శ్రేణులు ఆనందంగా ఉన్నాయి. వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఆయ‌న గెలుస్తార‌నీ.. జ‌న‌సేనే అధికారంలోకి వ‌స్తుంద‌ని.. ప‌వ‌న్ సీఎం అవుతార‌ని అనుకుంటున్నార‌ట‌.

ఒక్క‌సారి.. తెనాలి అసెంబ్లీ సీటుకు.. సీఎం పీఠానికి ఉన్న సెంటిమెంట్ ఏమిటో.. దాని నేప‌థ్యం ఏమిటో చూద్దాం. 1983 నుంచి 85 దాకా తెనాలి ఎమ్మెల్యేగా తెలుగుదేశం పార్టీకి చెందిన అన్నాబత్తుని సత్యనారాయణ ఉన్నారు. ఆ సమయంలో ముఖ్యమంత్రి పదవిలో కూడా అదే పార్టీకి చెందిన ఎన్టీఆర్ ఉన్నారు. ఇక‌ 1985 లో వచ్చిన మధ్యంతర ఎన్నికల్లో కూడా సత్యనారాయణ మ‌ళ్లీ టీడీపీ నుంచి విజయం సాధించగా, రాష్ట్రం లో కూడా అదేపార్టీ అధికారంలోకి వ‌చ్చి ఎన్టీఆర్ సీఎం అయ్యారు. 1989 లో ఈ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ నుంచి పోటీ చేసిన నాదెండ్ల భాస్కరరావు గెలిచారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఎక్కువ స్థానాలు గెలుచుకుని అధికారంలోకి వ‌చ్చింది.

ఇక‌ 1994 లో టీడీపీకి చెందిన రవీంద్రనాథ్ విజయం సాధిస్తే, ముఖ్యమంత్రి పీఠం కూడా తెలుగుదేశం పార్టీనే సొంతం చేసుకుంది. అలాగే.. 1999లో తెలుగుదేశం పార్టీకి చెందిన గోగినేని ఉమ గెలిచారు. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి ప‌ద‌విని చేప‌ట్టారు. ఇక 2004లోనూ, ఆ తర్వాత 2009లోనూ తెనాలి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి, కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేసిన నాదెండ్ల మనోహర్ విజయం సాధించారు. ముఖ్యమంత్రి పీఠంపై కూడా అదే పార్టీకి చెందిన అభ్యర్థులు ఉన్నారు. ఇక 2014లో తెలుగుదేశం పార్టీకి చెందిన ఆలపాటి రాజేంద్రప్రసాద్ ఈ స్థానం నుంచి గెలుపొంద‌గా చంద్ర‌బాబు ముఖ్య‌మంత్రి అయ్యారు. వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఏం జ‌రుగుతుందో చూడాలి మ‌రి.

తెనాలి సెంటిమెంట్‌ నమ్ముకున్న జోడి!
0 votes, 0.00 avg. rating (0% score)

commentsRelated Posts


Share
Share