తూకం పాటించడం తెలియదా పవన్!

September 14, 2018 at 11:35 am

శకునాలు చెప్పే బల్లి తానెళ్లి కుడితిలో పడ్డదని సామెత! పవన్ కల్యాణ్ ప్రవర్తిస్తున్న తీరు చూసినా అలాగే అనిపిస్తోంది. ఆయన ప్రస్తుతం పోరాటయాత్రకు విరామం ఇచ్చి… ఎంచక్కా హైదరాబాదులో సేదతీరుతూ గడుపుతున్నారు. ఒకవైపు తెలంగాణ ఎన్నికల బరిలోకి దిగాలా వద్దా అని ఆలోచించుకుంటూ గడుపుతున్నారు. మధ్యమధ్యలో ఎవరైనా హైదరాబాదుకు వస్తే శాలువాలు కప్పేస్తున్నారు. తమ పార్టీలో చేర్చుకుంటున్నారు. అయితే ఇలాంటి చేరికల్లో కూడా పవన్ తూకం పాటించడం లేదా అనే సందేహం పలువురిలో తలెత్తుతోంది.

పవన్ కల్యాణ్ చాలా రోజులుగా హైదరాబాదులోనే ఉంటున్నారు. రెండు రోజుల కిందట తూగో జిల్లా ముమ్మిడివరం నుంచి పితాని బాలకృష్ణ తదితరులు వచ్చి పార్టీలో చేరినప్పుడు.. ఆయనకు తొలి టికెట్ పవన్ ప్రకటించేశారు. ఆ తర్వాతి రోజున మళ్లీ అదే జిల్లా నుంచి మరికొందరు నాయకులు కూడా హైదరాబాదు వచ్చి.. జనసేన పార్టీలో చేరిపోయారు.

41558903_680131369052808_9213275389080633344_o

సుమారు గత నెలరోజులుగా జనసేన పార్టీ కార్యకలాపాలను పరిశీలిస్తే.. పవన్ కల్యాణ్ యాక్టివిటీని పరిశీలిస్తే ఈ తూగో జిల్లాకు చెందిన నాయకుల చేరికలు తప్ప ప్రధానమైనది మరొకటి కనిపించడం లేదంటే అతిశయోక్తి కాదు. అందుకే నిజానికి పవన్ అభిమానులే ఈ వైఖరులపై ఆగ్రహిస్తున్నారు. తూర్పుగోదావరి జిల్లా తప్ప మీకింకో జిల్లా కనిపించదా? రాయలసీమ జిల్లాల గురిచి పట్టించుకోరా? రాయలసీమ జిల్లాలనుంచి నాయకులెవ్వరూ వచ్చి మీ పార్టీలో చేరడానికి సుముఖంగా లేరా.. అంటూ సాక్షాత్తూ జనసేన ఫేస్ బుక్ పేజీలోనే కామెంట్లు పెడుతున్నారు.

నిజానికి పవన్ కల్యాణ్ పోరాటయాత్రను మధ్యలో వదిలేసిన భాగ్యనగరానికి వచ్చి చాలారోజులే గడిచాయి. కంటి ఆపరేషన్ తాలూకు విశ్రాంతి అని ప్రకటించి కొన్ని రోజులు గడిపేశారు. తర్వాత పుట్టినరోజు నాటికి కనీసం అభిమానులకూ కనిపించకుండా అజ్ఞాతంలోకి వెళ్లారు. ఇప్పుడు పార్టీ ఆఫీసు కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు గానీ.. తిరిగి యాత్ర సంగతి తేలలేదు. సీపీఎంతో పొత్తు భేటీలు కూడా జరగనేలేదు. కనీసం ఏపీ వ్యవహారాల్లో అన్ని జిల్లాల పట్ల తాము సమంగా వెళ్తున్నామని.. అన్ని జిల్లాల్లో సమాన ఆదరణ వస్తున్నదని సంకేతాలిచ్చేలాగా జాగ్రత్తగా ప్లాన్ చేసుకోవడం లేదు. అందుకే ఆమాత్రం తూకం తెలియకపోతే ఎలా పవన్ అని అభిమానులు అనుకుంటున్నారు.

తూకం పాటించడం తెలియదా పవన్!
0 votes, 0.00 avg. rating (0% score)

commentsRelated Posts


Share
Share