ప్ర‌తిష్టాత్మ‌క పోల‌వ‌రంలో ఎగిరేది ఎవ‌రి జెండా…!

June 8, 2018 at 9:02 am
Polavaram, west godavari, YSRCP, TDP, 2019 Elections, Who will Win,

ప‌శ్చిమ గోదావ‌రి జిల్లాలోని గిరిజ‌న అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గం పోల‌వ‌రంపై విప‌క్షం ఆశ‌లు నానాటికీ పెరుగుతున్నాయి. పోల‌వ‌రం పేరుకు దేశ‌వ్యాప్తంగా ఎంత క్రేజ్ ఉందో ప్ర‌త్యేకంగా చెప్ప‌క్కర్లేదు. పోల‌వ‌రం ప్రాజెక్టు నిర్మాణంతో ఈ నియోజ‌క‌వ‌ర్గం పేరు ఇప్పుడు మార్మోగిపోతోంది. ఇక ఇప్పుడు వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఈ నియోజ‌క‌వ‌ర్గంలో ఎగిరేది అధికార టీడీపీ జెండానా ? విప‌క్ష వైసీపీ జెండానా ? అన్న‌దానిపై స‌హ‌జంగానే అంద‌రికి ఆస‌క్తి ఉంది. అక్క‌డ రాజ‌కీయ వాతావ‌ర‌ణం చూస్తే అధికార ప‌క్షంపై ఇక్క‌డి గిరిజ‌నుల్లో తీవ్ర వ్య‌తిరేక‌త వ‌స్తుండ‌డం, ప్ర‌స్తుత సిట్టింగ్ ఎమ్మెల్యేపై తీవ్ర అవినీతి ఆరోప‌ణ‌లు వ‌స్తున్న క్ర‌మంలో ఇక్క‌డి ప్ర‌జ‌లు విప‌క్షం వైసీపీకి బ్ర‌హ్మ‌ర‌థం ప‌ట్ట‌డం ఖాయ‌మ‌నే వార్త‌లు వ‌స్తున్నాయి.

ముఖ్యంగా ఇక్క‌డి గిరిజ‌న ప‌ల్లెల్లో అభివృద్ధి ఏమాత్ర‌మూ క‌నిపించ‌క‌పోవ‌డం, అధికార పార్టీ చేస్తున్న వివిధ సంక్షేమ ప‌థ‌కాలు ఇప్ప‌టికీ ప్ర‌జ‌ల‌కు చేరువ కాక‌పోవ‌డం వంటివి స్థానిక సిట్టింగ్ ఎమ్మెల్యేకు అగ్నిప‌రీక్ష‌గా మారిపోయింది. దీంతో వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఈయ‌న‌కు టికెట్ ఇచ్చే ప‌రిస్థితి క‌నిపించ‌డం లేద‌ని పెద్దగా వినిపిస్తున్న వ్యాఖ్య‌లు. ఈ నేప‌థ్యంలో విప‌క్షం వైసీపీ ఇక్క‌డ పుంజుకునేందుకు ప‌క్కా స్కెచ్‌తో ముందుకు అడుగులు వేస్తుండ‌డం గ‌మ‌నార్హం.

గ‌తంలో రెండు సార్లు కాంగ్రెస్ త‌ర‌ఫున ఇక్క‌డ గెలిచిన బాల‌రాజు.. 2014 ఎన్నిక‌ల్లో వైసీపీ త‌ర‌ఫున పోటీ చేసి ప‌రాజ‌యం పాల‌య్యారు. అయితే, ఓట‌మి నుంచి పాఠాలు నేర్చుకోవ‌డంలో బాల‌రాజు ముందున్నారు. గ‌త రెండేళ్లుగా కూడా ఆయ‌న ఇక్క‌డి ప్ర‌జ‌ల‌తో మ‌మేక‌మ‌వుతున్నారు. వారి క‌ష్ట‌న‌ష్టాలు తెలుసుకుంటున్నారు. వారికి జ‌రుగుతున్న అన్యాయాల‌పై ప్ర‌శ్నిస్తున్నారు కూడా. అదేస‌మ‌యంలో సిట్టింగ్ ఎమ్మెల్యే చేస్తున్న అవినీతిని ఎండ‌గ‌ట్ట‌డంలోనూ బాల‌రాజు రెండడుగులు ముందే ఉన్నారు.

ఇక‌, బాలరాజుకు క‌లిసి వ‌స్తున్న మ‌రో అంశం.. పోల‌వ‌రం టికెట్ కోసం వైసీపీ నుంచి ఎవ‌రూ పోటీ లేక‌పోవ‌డం. ఇక్క‌డ ఒకే ఒక్క‌డుగా బాల‌రాజు మాత్రమే వైసీపీ త‌ర‌ఫున బ‌ల‌మైన పేరు వినిపిస్తోంది. అదేస‌మ‌యంలో వైసీపీ అధినేత జ‌గ‌న్ కూడా బాల‌రాజు అభ్య‌ర్థిత్వంపై ఎలాంటి సందేహాలూ వెలిబుచ్చ‌డం లేదు. గ‌తంలో జ‌గ‌న్ కోసం త‌న సిట్టింగ్ సీటును వ‌దులుకుని ఉప ఎన్నిక‌ల‌కు వెళ్లి మ‌రీ గెలిచారు. వైసీపీ జిల్లా అధ్య‌క్షుడిగా కూడా ఆయ‌న ప‌నిచేశారు. ఫ‌లితంగా ఇక్క‌డ వ‌చ్చే ఎన్నిక‌ల్లో బాల‌రాజు పోటీ ఖాయ‌మ‌ని అంటున్నారు

ఈ క్ర‌మంలోనే ఆయ‌న ముంద‌స్తు వ్యూహంతో నిత్యం ప్ర‌జ‌ల్లో ఉండ‌డం, వైసీపీ న‌వ‌ర‌త్నాలు స‌హా వివిధ సామాజిక ప‌థ‌కాల‌ను గిరిజ‌నుల‌కు ప‌రిచ‌యం చేయ‌డంలోనూ బిజీగా మారిపోయారు. మొత్తంగా ఇక్క‌డ బాల‌రాజు సీనియ‌ర్టీ.. అధికార పార్టీ ఎమ్మెల్యే అవినీతి బాగోతం వెర‌సి.. వైసీపీని విజ‌యం తీరం చేర్చే ప‌వ‌నాలు వీస్తున్నాయి. ఇక‌, అధికార పార్టీ విష‌యానికి వ‌స్తే.. ఇక్క‌డ లెక్క‌కు మిక్కిలిగా నాయ‌కులు టికెట్ కోసం పోటీ ప‌డుతున్నారు.

దీనికితోడు సిట్టింగ్ ఎమ్మెల్యేపై తీవ్ర అవినీతి ఆరోప‌ణ‌లు చుట్టుముట్టాయి. అంతేకాదు, ఆయ‌న ప్ర‌జ‌ల‌కు అందుబాటులో ఉండ‌డం లేద‌ని, వ్యాపారాలు, వ్య‌వ‌హారాల్లోనే కాలం గ‌డుపుతున్నాడ‌ని పెద్ద ఎత్తున ప్ర‌చారం జ‌రుగుతోంది. కొస‌మెరుపు ఏంటంటే.. ఇక్క‌డి టికెట్ ఆశిస్తున్న టీడీపీ నేత‌లే ఈ ప్ర‌చారం చేస్తుండ‌డం గ‌మ‌నార్హం. మ‌రి ఇక్క‌డ ఫ‌లితం ఎవ‌రికి అనుకూలంగా ఉంటుందో చూడాలి.

ప్ర‌తిష్టాత్మ‌క పోల‌వ‌రంలో ఎగిరేది ఎవ‌రి జెండా…!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts


Share
Share