ప్ర‌త్తిపాడులో వైసీపీ గాలి… సుచ‌రిత వైపే ప్ర‌జ‌ల చూపు

June 3, 2018 at 11:11 am
Prathi padu, YSRCP, Mekathoti Sucharitha, MLA

గుంటూరు జిల్లాలో ఎస్సీ రిజ‌ర్వ్‌డ్ నియోజ‌క‌వ‌ర్గం అయిన ప్ర‌త్తిపాడు రాజ‌కీయం గ‌త ద‌శాబ్ద‌కాలంలో అంచ‌నాల‌కు అంద‌కుండా సాగుతోంది. 2009లో ఇక్క‌డ కాంగ్రెస్ నుంచి మేక‌తోటి సుచ‌రిత గెలిచారు. ఆ త‌ర్వాత ఆమె కాంగ్రెస్‌కు రాజీనామా చేసి వైసీపీలోకి జంప్ చేసి 2012 ఉప ఎన్నిక‌ల్లోనూ విజ‌యం సాధించారు. ఉప ఎన్నిక‌ల్లో ఆమె భారీ మెజార్టీతో విజ‌యం సాధించి అంద‌రికి షాక్ ఇచ్చారు. అలాంటి నియోజ‌క‌వ‌ర్గంలో త‌ర్వాత రెండేళ్ల‌కే జ‌రిగిన సాధార‌ణ ఎన్నిక‌ల్లో టీడీపీ నుంచి రావెల కిషోర్‌బాబు గెలిచి మంత్రి అయ్యారు.

రావెల‌కు వ‌చ్చినంత ల‌క్కీ ఛాన్స్ ఎవ్వ‌రికి రాలేదు. అప్ప‌టి వ‌ర‌కు కేంద్ర ప్ర‌భుత్వ స‌ర్వీసుల అధికారిగా ఉన్న ఆయ‌న ఒక్క‌సారిగా రాజ‌కీయాల్లోకి రావ‌డం, వెంట‌నే మంత్రి అవ్వ‌డం చ‌క‌చ‌కా జ‌రిగిపోయాయి. నాలుగేళ్ల‌లో వ్య‌క్తిగ‌తంగాను, త‌న శాఖాప‌రంగాను తీవ్ర‌మైన వ్య‌తిరేక‌త మూట‌క‌ట్టుకున్న రావెల మూడేళ్ల‌కే మంత్రి ప‌ద‌వి పోగొట్టుకున్నారు. ప్ర‌స్తుతం మంత్రి రావెల దెబ్బ‌కు ఒక‌ప్పుడు టీడీపీకి కంచుకోట‌గా ఉన్న ప్ర‌త్తిపాడు ఇప్పుడు కుదేలైపోయింది.

ప్ర‌స్తుతం నియోజ‌క‌వ‌ర్గంలో రావెల‌పై తీవ్ర వ్య‌తిరేక‌త వ్య‌క్త‌మ‌వుతోంది. ఈ ప‌రిణామాలు అన్ని మాజీ ఎమ్మెల్యే మేక‌తోటి సుచ‌రిత‌కు అనుకూలంగా మారుతున్నాయి. గ‌తంలో ఆమె ఎమ్మెల్యేగా గెలిచిన‌ప్పుడు వివాదాల‌కు దూరంగా అంద‌రిని క‌లుపుకునిపోయారు. ఓ ఎమ్మెల్యే అన్న అహంభావాన్ని ఆమె ప్ర‌ద‌ర్శించ‌లేదు. ఇప్పుడు రావెల తీరు టీడీపీ వ‌ర్గాల‌నే విస్మయ‌ప‌రుస్తోంది. నియోజ‌క‌వ‌ర్గంలో కాకుమాను, పెద‌నందిపాడు, వ‌ట్టిచెరుకూరు, ప్ర‌త్తిపాడు, గుంటూరు రూర‌ల్ మండ‌లాల్లో మాజీ ఎమ్మెల్యే సుచ‌రితకు అన్ని వ‌ర్గాల నుంచి మంచి ఆద‌ర‌ణ ల‌భిస్తోంది.

ఇక్క‌డ నుంచి వ‌చ్చే ఎన్నిక‌ల్లో రావెల అవుట్ అయితే టీడీపీ త‌ర‌పున జిల్లా మంత్రి న‌క్కా ఆనంద్‌బాబు పోటీ చేస్తార‌ని కూడా వార్త‌లు వ‌స్తున్నాయి. మంత్రి ఆనంద్‌బాబు గుంటూరు లోక‌ల్ కావ‌డంతో ఈ సారి ఆయ‌న ఇక్క‌డ నుంచి పోటీ చేసేందుకు ఆస‌క్తితో ఉన్నారు. అలాగే వేమూరులో గ‌త రెండు ఎన్నిక‌ల్లోనూ ఆయ‌న అతి స్వ‌ల్ప మెజార్టీతోనే గ‌ట్టెక్కుతున్నారు. దీంతో ఇప్పుడు అక్క‌డ మంత్రిపై తీవ్ర‌మైన వ్య‌తిరేక‌త వ్య‌క్తం కావ‌డంతో ఆయ‌న నియోజ‌క‌వ‌ర్గం మార్పును కోరుకుంటూ ప్ర‌త్తిపాడుపై క‌న్నేసిన‌ట్టు టీడీపీ వ‌ర్గాలు చెపుతున్నాయి.

టీడీపీలో సిట్టింగ్ ఎమ్మెల్యే కిషోర్‌బాబు మీద ఉన్న వ్య‌తిరేక‌త‌తో పాటు క‌న్‌ఫ్యూజ‌న్ వాతావ‌ర‌ణం సుచ‌రిత‌కు క‌లిసి రానుంది. ఇక్క‌డ వైసీపీ నుంచి కొంద‌రు పోటీ చేసేందుకు ఆస‌క్తి చూపించినా జ‌గ‌న్ మాత్రం సుచ‌రిత‌కే సీటు ఇస్తున్న‌ట్టు ప్ర‌క‌టించారు. సుచరిత నియోజ‌క‌వ‌ర్గంలో క‌లియ‌తిరుగుతూ పార్టీ శ్రేణుల‌కు అందుబాటులో ఉంటున్నారు. గెలుపుఓట‌ముల‌ను స‌మానంగా తీసుకుని కూడా ఆమె ప‌ద‌విలో లేక‌పోయినా ప‌నిచేస్తున్నారు.

ప్ర‌త్తిపాడులో వైసీపీ గాలి… సుచ‌రిత వైపే ప్ర‌జ‌ల చూపు
0 votes, 0.00 avg. rating (0% score)

commentsRelated Posts


Share
Share