
గుంటూరు జిల్లా చిలకలూరి పేట టీడీపీ రాజకీయాలు రసకందాయంగా మారాయి. ఇక్కడ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న సీనియర్ మోస్ట్ నాయకుడు, మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు.. ఇప్పుడు తీవ్ర స్థాయిలో మదన పడుతున్నారనే విషయం స్పష్టమైంది. చిలకలూరి పేట నియోజకవర్గం నుంచి వరుస విజయాలతో దూసుకుపోతున్న ప్రత్తిపాటి.. వచ్చే ఎన్నికల పై చాలానే ఆశలు పెట్టుకున్నారు. అయితే, ఇంతలోనే ఆయనకు అనూహ్యంగా ఎదురు దెబ్బ తగిలింది. తనకు పరిచ యమై.. తన ద్వారానే సీఎం చంద్రబాబును కలిసి.. ఆ తర్వాత తన ద్వారానే రాజకీయాల్లోకి వచ్చిన విడదల రజనీ ఇప్పుడు మంత్రికి కంట్లో నలుసు మాదిరిగా మారిపోయారు.
ప్రస్తుతం వైసీపీ తీర్థం పుచ్చుకుని చిలకలూరి పేటలో మంచి జోష్ మీదున్న రజనీ తెల్లవారి లేస్తే.. ప్రజల్లోనే ఉంటోంది. సంకుచిత రాజకీయాలకు పాల్పడుతోన్న మంత్రి ప్రత్తిపాటి పుల్లారావును వచ్చే ఎన్నికల్లో ఓడించి తీరుతానని శపథం చేసిన రజనీ దీనికి తగిన విధంగా ప్లాట్ ఫాం సిద్ధం చేసుకుంటున్నారు. ప్రతి ఒక్కరినీ కలుస్తున్నారు. తాను కొత్త.. అనే విషయాన్ని దాదాపు చెరిపేసేందుకు తీవ్రంగా యత్నిస్తున్నారు. అటు పార్టీలోనూ ఇటు నియోజకవర్గంలోనూ సీనియర్లను కలుసుకుని వారి ఆశీస్సులు పొందుతున్నారు.ఈ క్రమంలో ఆమె నియోజకవర్గంలో భారీ ఎత్తున ప్రచారం చేస్తున్నారు. దీంతో ఇక తన హవాకు అడ్డుకట్ట పడుతుందని గ్రహించిన మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు.. అడుగడుగునా ఆమెను అణిచేసేందుకు రెడీ అయ్యారు.
ఈ క్రమంలో తాజాగా ఆయన తన అధికారాన్ని వినియోగించి విడదల రజనీపై కఅక్కసు తీర్చుకొనే విధంగా.. నియోజకవర్గంలో తాను తప్ప ఇంకెవరూ ఉండరాదనే ప్రధాన దురుద్దేశంతో మంత్రి వ్యవహరించారు. తాజాగా చిలకలూరిపేట పట్టణంలోని శ్రీనివాసం ఫంక్షన్ హాల్లో హైదరాబాద్‌కు చెందిన వసుంధర డైమండ్ రూఫ్ సంస్థ వజ్రాభరణాల ప్రదర్శనను ఏర్పాటు చేసింది. ఈ కార్యక్రమం ప్రారంభోత్సవానికి స్థానిక వైసీపీ నాయకురాలు, నియోజకవర్గం సమన్వయ కర్త విడదల రజనీ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అయితే, తనను కాదని రజనీని నిర్వాహకులు ఆహ్వానించడాన్ని ఓర్చుకోలేని మంత్రి తన చేతిలోని తూనికలు కొలతల శాఖ అధికారులతో సదరు దుకాణాలపై దాడులు చేయించారన్న చర్చ పట్టణంలో స్టార్ట్ అయ్యింది.
ఆ ప్రదర్శన వద్దకు ఆఘమేఘాల మీద చేరుకున్న అధికారులు దాడులు చేసి 34 మిల్లీగ్రాముల తేడా ను గుర్తించినట్టు పేర్కొంటూ సీజ్ చేశారు. ఏదేమైనా పుల్లారావు రజనీని ఎంత అణగదొక్కాలని ప్రయత్నిస్తుంటే ఆమె రోజు రోజుకు అంత పాపులారిటీతో దూసుకుపోతున్నారు. దీంతో ఆయన ముందు తన పాపులారిటీ పెంచుకోవడం మానేసి రజనీని తొక్కాలని చూస్తున్నంత కాలం ఆయన మరింత మైనస్‌లో పడిపోతున్నారన్నది పేట టాక్. మొత్తానికి పేటలో తాజా పరిణామం తీవ్ర వివాదానికి దారితీసింది. మంత్రి అక్కసుతోనే ఇలా వ్యవహరించారని అంటున్నారు.