రేవంత్ రెడ్డి సరికొత్త డ్రామా!

September 7, 2018 at 4:33 pm

ఒకవైపు రాష్ట్రమంతా కేసీఆర్ తీసుకోబోయే అసెంబ్లీ రద్దు నిర్ణయం మీద అట్టుడికిపోతున్న సమయంలో.. గురువారం ఉదయం తెలంగాణ కాంగ్రెస్ లో పదవి లేని ప్రముఖ నాయకుడి డిజిగ్నేషన్ తో ఉన్న రేవంత్ రెడ్డి ఓ తమాషా నడిపించారు. చాలా కాలం కిందటే… తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేసేసిన రేవంత్ రెడ్డి… గురువారం ఉదయం అసెంబ్లీ స్పీకరు కార్యాలయానికి వెళ్లి.. తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా సమర్పించారు. మొత్తం తెలంగాణ అసెంబ్లీనే రద్దయిపోడానికి కేవలం మూడు గంటల ముందుగా.. రేవంత్ రెడ్డి ఈ డ్రామా నడిపించడమే తమాషా!

పార్టీ మారిన తర్వాత.. తనకు ఎమ్మెల్యే పదవి కూడా అక్కర్లేదని రేవంత్ రెడ్డి అప్పట్లో చాలా ఘాటుగా ప్రకటించారు. ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి తాను మళ్లీ ఎన్నికలకు వెళ్లడానికి సిద్ధం అని కూడా ఆయన ప్రకటించారు. అప్పట్లో పార్టీకి రాజీనామాతో పాటూ, ఎమ్మెల్యే పదవికి కూడా రాజీనామా చేసి.. లేఖలను మీడియాకు విడుదల చేశారు. కాకపోతే.. ఆ రెండు లేఖలను చంద్రబాబు చేతికే ఇచ్చారు. అయితే చంద్రబాబు ఆ లేఖను తెలంగాణ స్పీకరుకు పంపారో లేదో తెలియదు గానీ.. ఆయన పదవి మాత్రం పోలేదు.

తాజాగా కేసీఆర్ అసెంబ్లీ రద్దు నిర్ణయం ఖరారు అయిపోయిన తర్వాత.. ఎటూ ఊడిపోయే పదవిని కొన్ని గంటల ముందుగా ‘‘త్యాగం’’ చేయడం ద్వారా కాస్త ప్రజల దృష్టిలో పడవచ్చునని రేవంత్ తలపోసినట్లుగా కనిపిస్తోంది. కాకపోతే గురువారం స్పీకర్ మధుసూదనాచారికి రాజీనామా సమర్పించిన సందర్భంలో ఆయన తన వైఖరిని సమర్థించుకున్నారు.

కాంగ్రెస్ లో చేరిప్పటినుంచే తాను ఎమ్మెల్యేగా రాజీనామా చేశానని, ఎమ్మెల్యే సదుపాయాలేవి అప్పటినుంచి ఉపయోగించుకోవడం లేదని, గన్ మెన్లను కూడా సరెండర్ చేసేశానని ఆయన చెప్పుకొచ్చారు. కేసీఆర్ చర్యలకు నిరసనగా ఇప్పుడు మళ్లీ , స్పీకర్ ఫార్మాట్ లోనే రాజీనామా చేసినట్లు రేవంత్ చెప్పారు.

తమాషా ఏంటంటే.. గతంలో రాజీనామా చేసినప్పటినుంచి రేవంత్ రెడ్డి ఎమ్మెల్యే హోదాను అనుభవించడం లేదని, గన్ మెన్లను వాడడం లేదని చెప్పారు సరే.. మరి ఎమ్మెల్యే వేతనం కూడా తీసుకోవడం లేదా? ఇన్నాళ్లూ వేతనం కూడా తీసుకోకుండా ఉండి ఉంటే ఆయన చిత్తశుద్ధితో అప్పుడే రాజీనామా చేసినట్లు లెక్క. కానీ.. ఆ విషయం ప్రకటించలేదు గనక, సందేహంగానే ఉంది.

రేవంత్ రెడ్డి సరికొత్త డ్రామా!
0 votes, 0.00 avg. rating (0% score)

commentsRelated Posts


Share
Share