తెలంగాణ‌లో.. మంత్రికే దిక్కేలేదా?

November 3, 2017 at 8:56 am

ఏ రాష్ట్రంలోనైనా అధికార ప‌క్షానికి చెందిన‌ ప్ర‌జాప్ర‌తినిధులు అన‌గానే ప్ర‌భుత్వం నుంచి జ‌ర‌గాల్సిన అన్ని ప‌నుల‌ను త‌మ‌కు న‌చ్చిన విధంగా, న‌చ్చిన‌ట్టు చేయించుకుంటార‌ని అంద‌రూ అనుకుంటారు. అదేస‌మ‌యంలో అధికారుల‌ను త‌మ అదుపులో పెట్టుకుంటార‌ని కూడా భావిస్తారు. ఈ క్ర‌మంలోనే త‌మ స‌మ‌స్య‌లు కూడా ప‌రిష్క‌రించాల‌ని ప్ర‌జ‌లు కోరుతుంటారు. అదే స‌మ‌యంలో విప‌క్ష నేత‌లైతే కొంత హ‌డావుడి, ర‌గ‌డ చేసైనా త‌మ ప‌నులు పూర్తి చేయించుకోవాల‌ని చూస్తారు. అయితే, తెలంగాణ‌లో మాత్రం ప‌రిస్థితి రివ‌ర్స్‌లో సాగుతోంది.

ప్ర‌స్తుతం జ‌రుగుతున్న అసెంబ్లీ స‌మావేశాల్లో రాష్ట్ర రైతాంగం దుస్థితిపై ప్ర‌భుత్వం స్పందించింది. ప్ర‌భుత్వం అండ‌గా ఉంటుంద‌ని తెలిపింది. ఇంత‌వ‌ర‌కు బాగానే ఉన్నా.. క్షేత్ర‌స్థాయిలో మాత్రం ప‌ర‌స్థితి బాగోలేదు. ప్ర‌భుత్వం కానీ, అధికారులు కానీ రైతుల కంట ప‌డ‌డంలేదు. వారి మానాన వారు ప‌నిచేసుకుపోతున్నారు. దీంతో కేసీఆర్ టీం స‌భ్యుడు జోగు రామ‌న్న నేరుగా స్పందించారు. తన నియోజకవర్గంలో రైతు సమస్యలను పరిష్కరించాలని కోరుతూ.. సాక్షాత్తూ తాను మంత్రి అయి ఉండి కూడా మ‌రో మంత్రి వ‌ద్ద‌కు వెళ్లి ప‌రిస్థితి వివ‌రించ‌డం చర్చనీయాంశమైంది.

భారీ వర్షాలతో ఆదిలాబాద్ జిల్లాలో పత్తి పంటకు తీవ్రమైన నష్టం జరిగింది. అయితే పత్తి రైతులకు ఇంతవరకూ నష్టపరిహారం అందలేదు. బీమా కంపెనీల నుంచి కూడా స్పందన లేదు. దీంతో ఆదిలాబాద్ జిల్లాలో రైతుల నుంచి మంత్రి జోగురామన్నపై వత్తిడి పెరిగింది. ఆయన నేరుగా సచివాలయంలోని వ్యవసాయశాఖ మంత్రి పోచారం శ్రీనివాసురెడ్డిని కలిసి వినతి పత్రాన్ని సమర్పించారు. ఆదిలాబాద్ జిల్లాలోని జైనద్, బేల మండాలాల్లో పత్తి పంట తీవ్రంగా దెబ్బతినింది. పత్తి కాయలు కుళ్లిపోయాయి. దూది నలుపురంగుకు మారింది. ఇటు వ్యవసాయ అధికారులు, అటు బీమా అధికారులు రైతులను ఆదుకునేందుకు ముందుకు రాలేదు.

దీంతో తన నియోజకవర్గంలో రైతు సమస్యలను పరిష్కరించాలని కోరుతూ మంత్రి జోగురామన్న మరో మంత్రిని కలవడం చర్చనీయాంశంగా మారింది. మంత్రి నియోజకవర్గంలోనే ఈ పరిస్థితి ఉంటే… మిగిలిన జిల్లాల్లోనూ, నియోజకవర్గాల్లో పరిస్థితి ఏవిధంగా ఉంటుందో అర్థం చేసుకోవచ్చంటున్నారు. మంత్రికే దిక్కులేకుంటే.. తెలంగాణ‌లో అధికార పార్టీ ఎమ్మెల్యేల‌ పరిస్థితి ఏమిట‌ని, ఇక త‌మ ప‌రిస్థితి ఏమిట‌ని సీఎం కేసీఆర్‌ను విపక్ష పార్టీలు నిలదీస్తున్నాయి. మ‌రి దీనికి గులాబీ బాస్ ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి.

 

తెలంగాణ‌లో.. మంత్రికే దిక్కేలేదా?
0 votes, 0.00 avg. rating (0% score)

commentsRelated Posts


Share
Share