కాషాయదళంతో స్వామి డీల్ కుదర్లేదా?

October 12, 2018 at 5:30 pm

ఇంతకూ భారతీయ జనతా పార్టీలో స్వామి పరిపూర్ణానందను చేర్చుకునే విషయం ఏమైంది? పరిపూర్ణానందను తెలంగాణ ముందస్తు ఎన్నికల్లో భాజపా తరఫున ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించబోతున్నారని.. రెండు రోజుల్లో అభ్యర్థుల జాబితాలతో పాటూ… ఈ ప్రకటన కూడా వస్తుందని నాలుగైదు రోజులుగా రాజకీయ వర్గాల్లో పుకార్లు షికారు చేస్తున్నాయి. ఆ క్రమంలోనే పరిపూర్ణానంద ఓసారి ఢిల్లీ వెళ్లి, అమిత్ షాను కలిసి వచ్చారు. అయితే తాజాగా విశ్వసనీయంగా తెలుస్తున్న సమాచారాన్ని బట్టి.. పరిపూర్ణానంద ప్రతిపాదించిన డీల్ , భాజపాకు అంగీకార యోగ్యంగా లేదని తెలుస్తోంది.

పరిపూర్ణానందను సీఎం అభ్యర్థి చేస్తారని, ఆయన రెండు తెలుగురాష్ట్రాల్లో ప్రచారం చూసుకుంటారని తొలుత గుప్పుమంది. కానీ, అమిత్ షాను కలిసిన తర్వాత.. స్వామి మాట్లాడుతూ.. తను చెప్పవలసింది షాకు చెప్పానని… ఆయన తీసుకునే నిర్ణయాన్ని బట్టి తన భవిష్యత్ ప్రణాళిక ఉంటుందని అన్నారు. ఇప్పుడు పార్టీలో చేరడానికి, ప్రచారం చేయడానికి సిద్ధమే గానీ, పార్టీ ఓడిపోయినా సరే.. తనకు రాజ్యసభ ఎంపీగా అవకాశం కల్పించాలని ఆయన డిమాండ్ చేసినట్లుగా సమాచారం. అయితే అది భాజపాకు, అమిత్ షాకు ఇష్టమున్నట్లు లేదు.

10వ తేదీన కరీంనగర్ సభ నాటికే.. పరిపూర్ణానంద, అమిత్ షా సమక్షంలో పార్టీలో చేరుతారని కూడా ప్రచారం జరిగింది. అయితే అలా జరగలేదు. ఓ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో అమిత్ షా మాట్లాడుతూ… ఆయనను కేవలం ఒక స్వామీజీ గా మాత్రమే కలిసానని… అంతే తప్ప.. దానికి ఎలాంటి రాజకీయ ప్రాధాన్యం లేదని బుకాయించారు. ఏతావతా ఈ పరిణామాలు అన్నిటినీ కలగలిపి చూస్తున్నప్పుడు.. కమలదళంతో దోస్తీ కట్టడానికి, కాషాయదళంలో చేరడానికి… ఈ సన్యాసి స్వామి పరిపూర్ణానందకు మొత్తానికి డీల్ కుదిరినట్లుగా లేదని తెలుస్తోంది.

కాషాయదళంతో స్వామి డీల్ కుదర్లేదా?
0 votes, 0.00 avg. rating (0% score)

commentsRelated Posts


Share
Share