తెలుగుదేశం నిమజ్జ‌నం పూర్తి అయ్యిందా…!

November 2, 2018 at 11:38 am

మూడున్నర దశాబ్దాల రాజకీయ చరిత్రలో తెలుగు ప్రజల హృదయాల్లో ఎంతో సుస్థిరమైన స్థానం సంపాదించుకున్న తెలుగుదేశం పార్టీ నిమజ్జ‌నాన్ని ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు, ఏపీ సీఎం చంద్రబాబు పూర్తి చేశారా ? అంటే తెలుగు రాజకీయ వర్గాల్లోనే కాకుండా జాతీయ రాజకీయ వర్గాల్లో సైతం ఇదే ప్రశ్నకు అవుననే ఆన్సర్‌ వినిపిస్తోంది. తెలుగు వారికి ఢిల్లీలో ఘోరమైన అవ‌మానం జరుగుతుందని… తెలుగు వారి ఆత్మగౌరవాన్ని ఢిల్లీ పెద్దలు తాకట్టు పెట్టుకుంటున్నారని విమర్శిస్తూ దివంగత మహానటుడు ఎన్టీఆర్‌ తెలుగుదేశం పార్టీని స్థాపించారు. ఎన్టీఆర్‌ తెలుగుదేశం పార్టీ ఆవిర్భావంతోనే జాతీయ రాజకీయాల్లో ప్రకంపన‌లు సృష్టించారు. తెలుగు వాడి దెబ్బేంటో ఢిల్లీకి రుచి చూపించారు. ఇంకా చెప్పాలంటే ఢిల్లీ పీఠాన్ని సైతం కదిలించిన చరిత్ర తెలుగుదేశానికి ఉంది.

మరి అలాంటి ఘన కీర్తి ఉన్న తెలుగుదేశం నేడు ఎందుకు పతనం అయిపోయ్యింది? ఆ పార్టీని ఎందుకు నాశనం చేశారు? అంటే చంద్రబాబు రాజకీయ అసమర్థ‌తే ఇందుకు కారణమని చెప్పొచ్చు. మూడున్నర దశాబ్దాల తెలుగుదేశం రాజకీయ చరిత్రను పరిశీలిస్తే ఎన్నో సంచలనాలకు ఆ పార్టీ కేంద్ర బిందువుగా మారింది. ఎన్టీఆర్‌ తెలుగుదేశం పార్టీ స్థాపించి కేవలం 9 నెలల్లోనే అధికారంలోకి వచ్చారు. ఆ తర్వాత నాటి ప్రధాన మంత్రి ఇందిరాగాంధీ ఎన్టీఆర్‌ ప్రభుత్వాన్ని గద్ది దించినా ఆయన ప్రజల్లోకి వెళ్లి తిరిగి అఖండ విజయం సాధించారు. ఆ విజయంతో యావత్‌ దేశ రాజకీయాలను ఎన్టీఆర్‌ తన వైపునకు తిప్పుకున్నారు. ఆ తర్వాత కాంగ్రెస్‌కు వ్యతిరేఖంగా ఏర్పడిన నేషనల్‌ ఫ్రెంట్‌ కన్వినర్‌గా ఆయన ఓ వెలుగు వెలిగారు.

Chandrababu-Naidu-Rahul-Gandhi

ఓ ప్రాంతీయ పార్టీగా ఉన్న తెలుగుదేశం దేశంలోనే పార్ల‌మెంటులో ఎక్కువ సీట్లు సాధించిన రెండో పార్టీగా నిలిచిందంటే అందుకు ఎన్టీఆర్‌ రాజకీయ చాణిక్య ప్రతిభ ఎలాంటిదో చెప్పుకోవచ్చు. అంత గొప్ప చరిత్ర కలిగిన తెలుగుదేశాన్ని ఆ పార్టీ ప్రస్తుత అధ్యక్షుడు చంద్రబాబు సర్వనాశనం చేసేసారు. ఎన్టీఆర్‌ పార్టీ పెట్టినప్పుడు తాను సొంత మామ మీదే పోటీ చేస్తానని గొప్పలు పోయిన చంద్రబాబు చివరకు అదే ఎన్టీఆర్‌ చెంత చేరి ఆయన్ను ముఖ్య మంత్రి పదవి నుంచి గద్ది దింపి తెలుగుదేశం పార్టీ కబ్జా చేసేశారు. ఆ మనోవేదనతోనే ఎన్టీఆర్‌ ఆకస్మికంగా మృతి చెందిన సంగతి తెలుగు ప్రజలందరికి తెలిసిందే. ప్రజలు తెలుగువారి ఆత్మగౌరవానికి ప్రతీకగా నిలిచినా తెలుగుదేశం పార్టీ ఇప్పుడు చంద్రబాబు విధానాల వల్ల ఎంత తీవ్రంగా నష్టపోతుందో రాజకీయ వర్గాలు విశ్లేషిస్తున్నాయి.

తన రాజకీయ అవసరాల కోసం తెలుగుదేశం పార్టీని చంద్రబాబు నిలువునా ముంచేశారు. 1999లో బీజేపీతో కలిసి ఎన్నికలకు వెళ్లిన చంద్రబాబు ఆ ఎన్నికల్లో దేశ వ్యాప్తంగా ఉన్న బీజేపీ సానుకూల పవనాలతో విజయం సాధించారు. 2004 అదే పార్టీతో ఎన్నికలకు వెళ్లి చిత్తు చిత్తుగా ఓడారు. 2009లో బీజేపీ తమకు అవసరం లేదని బీజేపీతో తెగతెంపులు చేసుకున్న చంద్రబాబు తిరిగి 2014లో అదే బీజేపీ చెంత చేరారు. ఇప్పుడు బీజేపీతో పొసకక ఎన్‌డీఎ నుంచి బయటకు వచ్చిన చంద్రబాబు ఎన్టీఆర్‌ ఏ పార్టీని వ్యతిరేకిస్తూ తెలుగుదేశం పార్టీని స్థాపించారో అదే కాంగ్రెస్‌ పార్టీతో పొత్తులకు సిద్ధం అవ్వడాన్ని సగటు తెలుగుదేశం అభిమాని సైతం జీర్ణించుకోలేని పరిస్థితి వచ్చేసింది.

కాంగ్రెస్ – టీడీపీ పొత్తు పెద్ద చారిత్రక తప్పిదంగా రాజకీయ విశ్లేషకులు కూడా అభివర్ణిస్తున్నారు. అంతెందుకు తెలుగుదేశం పార్టీలోనే ఎంతో మంది సీనియర్‌ నాయకులకు సైతం చంద్రబాబు కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకోవడం ఏ మాత్రం నచ్చలేదు. అయితే వారు తమ అభిప్రాయాన్ని నిర్మొహ్మామాటంగా చెప్పలేని పరిస్థితి. మూడున్నర దశాబ్దాల పాటు తాము కాంగ్రెస్‌కు ఎంతో వ్యతిరేఖంగా పోరాడామని… ఇప్పుడు అదే కాంగ్రెస్‌తో కలిసి బాబు చిరునవ్వులు చిందిస్తుండడంతో పాటు తాము సైతం కలిసి పని చెయ్యాలని నీతి వ్యాక్యాలు వర్ణించడం ఏ మాత్రం సమంజసమని వారు ప్రశ్నిస్తున్నారు. ఏదేమైన తన రాజకీయ అవసరాల కోసం కాంగ్రెస్‌తో కలిసిన చంద్రబాబు తెలుగుదేశాన్ని మాత్రం నిమజ్జ‌నం చేసేసినట్టే అన్నది సుస్పష్టంగా తెలుస్తోంది.

తెలుగుదేశం నిమజ్జ‌నం పూర్తి అయ్యిందా…!
0 votes, 0.00 avg. rating (0% score)

commentsRelated Posts


Share
Share