కంచుకోటకి పంచర్లు … నోరుమెదపని టీడీపీ అధిష్టానం !

July 7, 2018 at 6:00 pm
TDP, East Godavari, Conflicts Between Leaders, Politics

తెలుగుదేశం పార్టీకి అధికారం తీసుకొచ్చిన గోదావరి జిల్లాలో తమ్ముళ్ల కుమ్ములాటలు పార్టీకి చేటు తెస్తున్నాయి. తూర్పుగోదావరి జిల్లాలో పార్టీ నాయకుల మధ్య ఆధిపత్య పోరు బాగా ఎక్కువయిపోయింది. నువ్వెంత అంటే నువ్వెంత అనే స్థాయికి నాయకులు వెళ్లిపోయారు. వర్గపోరు ముదిరిపోవడంతో అధికారపార్టీ ఉక్కిరిబిక్కిరవుతోంది. ఒకవైపు ఇదే జిల్లాలో వైసీపీ అధ్యక్షుడు జగన్ పర్యటిస్తుండడం.. ఆ పార్టీకి ప్రజల నుంచి అనూహ్య స్పందన రావడం .. ఇదే సమయంలో టీడీపీలో నాయకుల మధ్య రగడ మొదలవ్వడం ఆ పార్టీకి పెద్ద తలనొప్పిగా మారింది. నాయకుల వ్యవహారం ఇలా ఉండడంతో కార్యకర్తలు అయోమయంలో కొట్టుమిట్టాడుతున్నారు.

టీడీపీ ఆవిర్భావం నుంచి రాజమహేంద్రవరం లో పార్టీ స్ట్రాంగ్ గా ఉంది. ఇక్కడి రెండు అసెంబ్లీ స్థానాల్లోనూ టీడీపీయే ఎక్కువసార్లు జెండా ఎగురవేసింది. గత ఎన్నికల్లో కూడా టీడీపీ, దాని మిత్రపక్షమైన బీజేపీయే విజయం సాధించాయి. మరో ఏడాదిలోగా ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో అధికార టీడీపీలో ఇక్కడ నుంచి పోటీ చేయడానికి నేతలు పోటీ పడుతున్నారు. వచ్చే ఎన్నికల్లో సీటు తమకంటే తమదేనని ప్రచారం చేసుకుంటున్నారు. కేవలం ప్రచారంతోనే సరిపెట్టుకుండా పార్టీలో పట్టు కోసం ఇతర నేతలను అడ్డుకునే ప్రయత్నాలు సాగిస్తున్నారు.

రాబోయే ఎన్నికల్లో రాజమండ్రి అర్బన్‌ నుంచి పోటీ చేయాలని ప్రస్తుత ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి ప్రయత్నాలు చేస్తున్నారు. ఆదిరెడ్డి అప్పారావు కూడా పట్టుకోసం ప్రయత్నాలు ముమ్మరం చేశారు. వీరు సరిపోదన్నట్టుగా గుడా చైర్మన్‌, సీనియర్‌ టీడీపీ నేత గన్ని కృష్ణ ఈసారి తనకే టికెట్‌ దక్కుతుందన్న ధీమాగా కనిపిస్తున్నారు. సిటీ మేయర్‌ పంతం రజనీశేషసాయి కూడా టిక్కెట్‌ కోసం తెరవెనుక ప్రయత్నాల్లో ఉన్నారు.

ముఖ్యంగా ఇక్కడ టీడీపీ సీనియర్ లీడర్ గోరంట్ల బుచ్చయ్య చౌదరి కి ఆదిరెడ్డి అప్పారావు వర్గాలకి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి ఉంది. ఇటీవల కౌన్సిల్‌ సమావేశంలో బుచ్చయ్య చౌదరి, ఆదిరెడ్డి కేకలు వేసుకునే వరకూ వెళ్లింది. రోడ్డుమీద కూడా నువ్వెంత అంటే నువ్వెంత అనుకుంటూ రచ్చ చేసారు. ఈ గొడవల కారణంగానే… ఇటీవల టీడీపీ తలపెట్టిన ధర్మ పోరాట దీక్ష రాజమహేంద్రవరం నుంచి కాకినాడకు మార్చేశారు. గోరంట్ల సీనియర్ లీడర్ కావడంతో అధిష్టానం కూడా ఈ గొడవల్లో చొరవ తీసుకునేందుకు జంకుతోంది. ఏదేమైనా కీల‌క‌మైన రాజ‌మండ్రిలో టీడీపీ గ్రూపుల గోల‌తోనే తీవ్రంగా న‌ష్ట‌పోనుంది. ఈ ప‌రిణామాలు వైసీపీకి లాభం చేకూర్చ‌నున్నాయి.

కంచుకోటకి పంచర్లు … నోరుమెదపని టీడీపీ అధిష్టానం !
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts


Share
Share