ఏం ఖర్మ ? కాంగ్రెస్ దూత పాత్రలో తెదేపా!

September 14, 2018 at 9:03 am

తెలంగాణలో తెలుగుదేశం పార్టీకి ఎంత ఖర్మ పట్టిందిరా దేవుడా.. అని ఆ పార్టీ అభిమానులు అనుకుంటున్నారు. రాష్ట్ర విభజన తర్వాత.. ఓటుకు నోటు కేసు పుణ్యమాని చంద్రబాబునాయుడు పలాయనమంత్రం పఠించి ఆంధ్రప్రదేశ్ కు పారిపోవడానికి తోడు, తెలంగాణలో కేసీఆర్ ప్రయోగించిన సమ్మోహనస్త్రానికి తెలుగుదేశం దాదాపుగా ఖాళీ అయిపోయింది. ఇప్పుడు కనీసం మొత్తం సీట్లకు అభ్యర్థులను వెతుక్కోలేని పరిస్థితిలో, మొత్తం సీట్లకు పోటీచేయలేని స్థితిలో ఉంది. అందుకే కాంగ్రెస్ తో పొత్తులు పెట్టుకుని వారు ఎన్ని సీట్లు ఇస్తే అన్ని తీసుకోవడానికి కూడా సిద్ధపడింది.

Left

అంతకంటె ఘోరమైన, పార్టీ అభిమానులకు అవమానకరమైన విషయం ఏంటంటే.. తెలంగాణ తెలుగుదేశం ఇప్పుడు కాంగ్రెస్ ఏజెంటులాగా పనిచేయాల్సి వస్తోంది. ‘మహా’ పేరుతో ఏర్పడబోతున్న కూటమికి కాంగ్రెస్ నేతృత్వం వహించడం ఖరారు. నేతృత్వం కాదు కదా.. మాకు సమానాధికారం ఉండాలని అయినా.. అడిగే దమ్ము మరెవ్వరికీ లేదు. ఆ కూటమిలో మొన్నటికి కాంగ్రెస్, తెదేపా, సీపీఐ మాత్రమే ఉన్నాయి. తెజసను కూడా కూటమిలో కలుపుకోవాలనేది కాంగ్రెస్ ఉద్దేశం.

దీంతో కాంగ్రెస్ తరఫున ఏజెంటుగా పనిచేయడానికి తెలుగుదేశం ఒప్పుకున్నట్లుగా కనిపిస్తోంది. తమ మూడు పార్టీలు కలిసినా కూడా పెద్దగా ప్రయోజనం ఉండదని తెలుగుదేశం నాయకులు భయపడ్డారో ఏమో తెలియదు గానీ.. మొత్తానికి తెజసను ఒప్పించే పనిని ఎల్.రమణ భుజాన వేసుకున్నారు. ఆ సమావేశానికి కనీసం ఉత్తమ్ కుమార్ కాదు కదా.. కాంగ్రెస్ ప్రతినిధులు కూడా హాజరు కాకపోవడం గమనార్హం. వారికి తామేమీ తక్కువ తినలేదన్నట్లుగా తెజసలో ఫైనల్ అథారిటీ అయిన.. కోదండరాం కూడా ఈ భేటీకి రాలేదు. ఆ రకంగా ఈ రెండు పార్టీలకు చెందిన ఆ ఇద్దరు నాయకులూ తమ గౌరవానికి భంగం రాకుండా చూసుకున్నారు. కాకపోతే.. తెలుగుదేశమే కాంగ్రెస్ తరఫున దూత పాత్రకు దిగజారిపోయినట్లుగా పరిణామాలు చెబుతున్నాయి.

HY12ALLPARTYLEADERS

ఇవాళ దూత పాత్ర, రేపటి నేత పాత్రలోకి మారవచ్చు. ఆరకంగా వారు ఆశావహంగా మాట్లాడవచ్చు. తప్పేమీ కాదు. కానీ, సీట్ల విషయంలో నైనా పట్టుగా ఉంటారా.. ఇంకాస్త దిగజారుతారా చూడాలి.

ఏం ఖర్మ ? కాంగ్రెస్ దూత పాత్రలో తెదేపా!
0 votes, 0.00 avg. rating (0% score)

commentsRelated Posts


Share
Share