2019 గ్రేట‌ర్ అసెంబ్లీ వార్ ఎలా ఉంటుంది

July 3, 2018 at 3:25 pm
Telangana, 2019 elections, Great hyderabad, TRS, congress leaders

గ్రేట‌ర్ హైద‌రాబాద్‌… ఇప్పుడు పార్టీల్లో వ‌ణుకుపుట్టిస్తోంది. ఎన్నిక‌లు స‌మీపిస్తున్న వేళ అనూహ్య‌రాజ‌కీయ ప‌రిణామాల‌తో ఏం జ‌రుగుతుందో తెలియ‌ని ప‌రిస్థితి నెల‌కొంది. గ్రేట‌ర్ లో ఎక్కువ‌సీట్లు గెలిచిన పార్టీకే అధికారంలోకి వ‌చ్చే అవ‌కాశాలు క‌నిపిస్తున్నాయి. అయితే 2014 ఎన్నిక‌ల‌కు ముందు ఉన్న ప‌రిస్థితుల‌కు.. ఇప్ప‌టి ప‌రిస్థితులు పూర్తి భిన్నంగా ఉన్నాయి. దీంతో ఇక్క‌డ ఉన్న సుమారు 24 అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గాల్లో ప‌ట్టుకోసం అధికార టీఆర్ఎస్‌, కాంగ్రెస్, బీజేపీ, ఎంఐఎంలు ప్ర‌య‌త్నాలు ముమ్మ‌రం చేశాయి. గులాబీ బాస్ కేసీఆర్ మాత్రం ఆప‌రేష‌న్ ఆక‌ర్ష్ చేప‌ట్టి ఇత‌ర పార్టీల నేత‌ల్ని టీఆర్ఎస్‌లో చేర్చుకునే ప‌నిలో ప‌డ్డారు.

ఇందులో భాగంగానే.. కాంగ్రెస్ సీనియ‌ర్ నేత‌, మాజీ మంత్రులు అదే బాట ప‌ట్టారు. మ‌రికొంద‌రు అదే రూట్లో ఉన్నారు. అయితే.. గ‌త ఎన్నిక‌ల్లో గ్రేటర్ హైద‌రాబాద్‌లో టీఆర్ఎస్ పార్టీ కేవ‌లం మూడు స్థానాల్లోనే విజ‌యం సాధించింది. సికింద్రాబాద్, మ‌ల్కాజిగిరి, ప‌టాన్‌చెరులో మాత్ర‌మే గెలిచింది. ఇక కాంగ్రెస్ పార్టీ మాత్రం ఖాతానే తెరువ‌లేదు. తెలంగాణ ఉద్య‌మ గాలిని త‌ట్టుకుని టీడీపీ, బీజేపీ క‌లిసి బ‌రిలోకి దిగి 15 స్థానాల్లో విజ‌యం సాధించాయి. ఇందులో బీజేపీ ఐదు, టీడీపీ ప‌ది స్థానాలు ద‌క్కించుకున్నాయి. టీడీపీ శేరిలింగంప‌ల్లి లాంటి సీట్ల‌ను అయితే ఏకంగా 70 వేల పైచిలుకు మెజార్టీతో గెలుచుకుంది.

బీజేపీ ఇక్క‌డ ఐదు సీట్లు గెలుచుకుందంటే అది నిజంగా టీడీపీతో పొత్తు వ‌ల్లే. ఈ రెండు పార్టీల క‌ల‌యిక‌తోనే సికింద్రాబాద్ నుంచి బీజేపీ ఎంపీగా పోటీ చేసిన కేంద్ర మాజీ మంత్రి బండారు ద‌త్తాత్రేయ భారీ మెజార్టీతో ఘ‌న‌విజ‌యం సాధించారు. అయితే.. టీఆర్ఎస్ అధికారంలోకి వ‌చ్చిన త‌ర్వాత ఎల్‌బీన‌గ‌ర్ ఎమ్మెల్యే ఆర్ కృష్ణ‌య్య త‌ప్ప మిగ‌తా టీడీపీ ఎమ్మెల్యేలంద‌రూ గులాబీ గూటికి చేరిపోయారు. అయితే గ్రేట‌ర్ హైద‌రాబాద్ ప‌రిధిలో సెటిల‌ర్ల ప్ర‌భావం ఎక్కువ‌గా ఉండ‌డంతో రాష్ట్ర విభ‌జ‌న‌కు కార‌ణ‌మైంద‌న్న ఆగ్ర‌హంతో వారు ఎక్కువ‌గా టీడీపీవైపే మొగ్గు చూపారు. టీఆర్ఎస్ ను పెద్ద‌గా ఆద‌రించింది లేదు. అయితే ఈ సారి ప‌రిస్థితులన్నీ భిన్నంగా ఉన్నాయి.

గ‌తంలో క‌లిసి బ‌రిలోకి దిగిన బీజేపీ, టీడీపీలు ఇప్పుడు విడిపోయాయి. ఏపీకి ప్ర‌త్యేక హోదా ఇవ్వ‌డం సాధ్యం కాద‌ని బీజేపీ చెప్ప‌డంతో ఎన్డీయే నుంచి చంద్ర‌బాబు బ‌య‌ట‌కు వ‌చ్చిన విష‌యం తెలిసిందే. దీంతో వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఈ రెండు పార్టీలు క‌లిసి న‌డిచే అవ‌కాశాలు క‌నిపించ‌డం లేదు. మ‌రోవైపు 2014ఎన్నిక‌ల్లో స‌త్తాచాట‌లేని టీఆర్ఎస్ గ్రేట‌ర్ హైద‌రాబాద్ మున్సిప‌ల్ ఎన్నిక‌ల్లో దాదాపుగా క్లీన్‌స్వీప్ చేసింది. అయితే.. ఇప్ప‌టికీ గ్రేట‌ర్ హైద‌రాబాద్ ప‌రిధిలోని అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గాల్లో ఆ పార్టీకి బ‌లమైన అభ్య‌ర్థులు లేక‌పోవ‌డం గ‌మ‌నార్హం. ఇందులో భాగంగానే.. బ‌ల‌మైన అభ్య‌ర్థుల వేట కోసం సీఎం కేసీఆర్ మ‌ళ్లీ ఆప‌రేష‌న్ ఆక‌ర్ష్ చేప‌ట్టిన‌ట్లు స‌మాచారం.

ఇదిలా ఉండ‌గా.. ఏపీ టీడీపీ ఎంపీ టీజీ వెంక‌టేశ్ చేసిన వ్యాఖ్య‌లు క‌ల‌క‌లం రేపుతున్నాయి. ప్ర‌త్యేక హోదాకు మ‌ద్ద‌తు ఇవ్వ‌క‌పోతే.. టీఆర్ఎస్‌కు ఓటు వేయ‌వ‌ద్ద‌ని సెటిల‌ర్ల‌కు పిలుపునిస్తామ‌ని ఆయ‌న ప్ర‌క‌టించ‌డం తీవ్ర చ‌ర్చ‌నీయాంశంగా మారింది. ఈ సారి సెటిల‌ర్ల ఓట్లు ఎవ‌రికి ప‌డ‌తాయ‌న్న‌ది ప్ర‌స్తుతానికి అయితే స‌స్పెన్సే. ఇదిలా ఉండ‌గా… గ్రేట‌ర్ ప‌రిధిలో గ‌త ఎన్నిక‌ల్లో ఏడు స్థానాల్లో గెలిచిన ఎంఐఎం, ఐదు స్థానాల్లో గెలిచిన బీజేపీలు త‌మ స్థానాల‌ను కాపాడుకుంటాయా లేవా అన్న‌ది ఇప్పుడు అంద‌రిలో ఆస‌క్తిని రేపుతోంది. అలాగే.. టీడీపీ నుంచి వ‌చ్చిన ఎమ్మెల్యేల‌కు ఈసారి సీఎం కేసీఆర్ టికెట్లు ఇచ్చే అవ‌కాశం లేద‌ని ప్ర‌చారం జ‌రుగుతోంది.

ఈ నియోజ‌క‌వ‌ర్గాల్లో సీట్ల స‌ర్దుబాటుపైనే టీఆర్ఎస్ విజ‌యావ‌కాశాలు ఉంటాయ‌ని ప‌లువ‌రు రాజ‌కీయ విశ్లేష‌కులు భావిస్తున్నారు. మ‌రోవైపు సెటిల‌ర్ల ఓట్ల కోసం ఈసారి కాంగ్రెస్ పార్టీ ప‌క్కా ప్లాన్ రూపొందిస్తున్న‌ట్లు స‌మాచారం. గ‌తంలో దాదాపు ఈ స్థానాల‌న్నీ కాంగ్రెస్ పార్టీవే కావ‌డం గ‌మ‌నార్హం. సెటిల‌ర్ల ఓట్ల‌ను ఆక‌ట్టుకునేందుకు సీమాంధ్ర‌లో గ‌తంలో బ‌ల‌మైన కాంగ్రెస్ నేత‌లుగా ఉన్న ఒక‌రిద్ద‌రికి కూడా కాంగ్రెస్ ఇక్క‌డ సీట్లు ఇస్తుంద‌న్న ప్ర‌చారం కూడా జ‌రుగుతోంది. గ‌త ఎన్నిక‌ల్లో రాష్ట్ర విభ‌జ‌న కార‌ణంగా సెటిల‌ర్లు ఈ పార్టీని దూరంగా పెట్టిన‌ట్లు ఎన్నిక‌ల ఫ‌లితాల‌ను బ‌ట్టి స్ప‌ష్ట‌మ‌వుతోంది. ఈసారి సెటిల‌ర్లు ఎవ‌రివైపు ఉంటారో చూడాలి మ‌రి.

2019 గ్రేట‌ర్ అసెంబ్లీ వార్ ఎలా ఉంటుంది
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts


Share
Share