కాంగ్రెస్ లో అసంతృప్తులకు దిక్కెవ్వరు?

September 16, 2018 at 11:28 am

అసంతృప్త నాయకులు లేకుండా అసలు ఏ పార్టీ అయినా ఉంటుందా? ఒక నాయకుడికి అనుకూల నిర్ణయం వస్తే.. వంద మంది అసంతృప్త నాయకులు తయారవుతారు. ఇది సహజం. ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర సమితి ఎన్నికల్లో బరిలోకి దిగే అభ్యర్థులను ప్రకటించేసింది గనుక.. ఆ పార్టీలో అసంతృప్తులు ఎవ్వరో బయటపడిపోయింది. వారంతా పార్టీ అభ్యర్థులను ఓడించడానికి కంకణం కట్టుకుని, ఇతర పార్టీల్లో చేరడానికి ఉద్యుక్తులవుతున్నారు. మెజారిటీ ఇలాంటి నాయకులంతా కాంగ్రెస్ వైపు చూస్తున్నారు.

మరి కాంగ్రెస్ పార్టీలో పరిస్థితి అంతా సవ్యంగానే ఉన్నదా? అనేది అనుమానమే. కాంగ్రెస్ పార్టీలో అసలు అసంతృప్తులే లేవా? అందరూ అటువైపు వెళితే అక్కడ మాత్రం సంక్షోభం పుట్టదా? అనే సందేహాలు ఎవ్వరికైనా కలుగుతాయి. నిజానికి అంతర్గత ప్రజాస్వామ్యం అనేది అతి బీభత్స స్థాయిలో వర్ధిల్లుతూ ఉండే కాంగ్రెస్ పార్టీలో అసంతృప్తి లేకుండా ఉంటుందనుకోవడం భ్రమ. అయితే ప్రస్తుతానికి అది నివురుగప్పిన నిప్పులాగానే ఉంది.

Telangana-Congress-Leaders-Disputes-1511289418-1783

తెరాస పార్టీనుంచి ఎందరు వచ్చి కాంగ్రెస్ లో చేరుతున్నా.. ఇంకా ఇక్కడి అసంతృప్తులు బయటపడలేదు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ఇంకా టికెట్లు ప్రకటించలేదు. ఒక రకంగా చూస్తే.. కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు చాలా పెద్ద సంక్షోభంలో ఉన్నట్లు లెక్క. బోలెడన్ని పార్టీలతో వారు పొత్తులు పెట్టుకున్నారు. ఆ పార్టీలన్నింటికీ సీట్లు కేటాయించగా.. కాంగ్రెస్ కు ఎన్ని మిగులుతాయో సందేహమే. 90 కి తక్కువకాకుండా పోటీచేస్తాం అంటున్నా.. రాజీపడాల్సి రావొచ్చు.

ఆ లెక్కన, కాంగ్రెస్ జాబితా విడుదల అయిన వెంటనే.. ఇక్కడి అసంతృప్తులు అన్నీ ఒక్కసారిగా తారస్థాయికి చేరుతాయనే అభిప్రాయం పలువురిలో కలుగుతోంది. జాబితా రాగానే కాంగ్రెస్ లో దాగిఉన్న అసంతృప్త నాయకులంతా బయటపడతారు. మరి వారికి ప్రత్యామ్నాయ పార్టీ ఏంటి? ఇక్కడ అలగడం వల్ల వారు ఏ పార్టీ వైపు వెళ్తారు.. తెలంగాణలో అన్ని పార్టీలు ఫుల్ గా ఉన్నాయి కదా అనే చర్చ జరుగుతోంది. నిజానికి కాంగ్రెస్ వారు వచ్చి చేరేట్లయితే ఆనందంగా చేర్చుకోవడానికి భాజపా సిద్ధంగానే ఉంది.

కాంగ్రెస్ లో అసంతృప్తులకు దిక్కెవ్వరు?
0 votes, 0.00 avg. rating (0% score)

commentsRelated Posts


Share
Share