ఇచ్చినవే తీసుకోండి.. ఎక్కువ మాట్లాడొద్దు!

October 22, 2018 at 6:28 pm

“నేను త‌లుచుకుంటే కేంద్రాన్ని శాసించ‌గ‌ల‌ను“- అని ప‌దే ప‌దే చెప్పుకొనే ఏపీ సీఎం టీడీపీ అధినేత చంద్ర‌బాబు ఇప్ప‌డు శాసించ‌డం మాట అటుంచి కాంగ్రెస్ చేతిలో బందీ అయ్యార‌నే విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి. కాంగ్రెస్ వ్య‌తిరేక పునాదుల‌పై పురుడు పోసుకున్న టీడీపీని ఆయ‌న చేజేతులా ఆ పార్టీ మోచేతి నీళ్లు తాగే ప‌రిస్థితికి ఆయ‌న పార్టీని తెచ్చార‌నే వ్యాఖ్య‌లు వినిపిస్తున్నాయి. విష‌యంలోకి వెళ్తే..ముందస్తు ఎన్నిక‌ల ముచ్చ‌ట‌కు తెర‌దీసిన తెలంగాణాలో తెలుగుదేశం పార్టీ కేడ‌ర్‌ను, కీల‌క నాయ‌కుల‌ను కోల్పోయి.. అవ‌సాన ద‌శ‌లో ఉన్న విష‌యం తెలిసిందే. అయితే, దీనిని జ‌వ‌స‌త్వాలు తీసుకు వ‌చ్చేందుకు చంద్ర‌బాబు చేసిన ప్ర‌య‌త్నాలు చాలా విమ‌ర్శ‌ల‌ను ఎదుర్కొంటున్నాయి. పోయిపోయి ఆయ‌న తెలంగాణాలో కాంగ్రెస్‌తో జ‌ట్లు క‌ట్టారు. మ‌హాకూట‌మి పేరుతో ఆయ‌న కాంగ్రెస్‌, క‌మ్యూస్టులు, నిన్న‌గాక మొన్న క‌న్ను తెరిచిన తెలంగాణా జ‌న‌స‌మితి పార్టీతో పొత్తు పెట్టుకుని ఎన్నిక‌ల్లో పోటీ చేస్తున్నారు.

Telangana-Mahakutami-Seat-Distribution-Socialpost

అయితే, ఇక్క‌డ విచిత్రం ఏంటంటే.. రాష్ట్రంలోని 119 నియోజ‌వ‌క‌ర్గాల్లో నాకు ఇన్ని సీట్లు కావాలి! అని అడిగే రేంజ్‌లో కూడా బాబు లేక‌పోవ‌డం గ‌మ‌నించాల్సిన విష‌యం. ఇదే విష‌యాన్నిఆయ‌న స‌న్నిహితులు చెబుతున్నారు. రాష్ట్రంలో ఒక‌ప్పుడు చ‌క్రం తిప్పాం. హైద‌రాబాద్‌, సైబ‌రాబాద్‌ను అభివృద్ధి చేశాం. ప్ర‌పంచ ప‌టంలో హైద‌రాబాద్‌ను చూపించాం. అయినా మా ప‌రిస్థితి ఇక్క‌డ దిగ‌జారింది. ఇప్పుడు కాంగ్రెస్‌తో జ‌ట్టుక‌ట్టినా.. అది ఎన్ని సీట్లు ఇస్తుందో తెలియ‌క స‌త‌మ‌త‌మ‌వుతున్నాం. మాకు క‌నీసం 40 స్థానాల్లో పోటీ చేయాల‌ని ఉంది. కానీ, కాంగ్రెస్ మా మాట వినే ప‌రిస్థితి క‌నిపించ‌డం లేదు. అని బాబు స‌న్నిహితులే మీడియాతో వాపోతున్నారు. ఈ నేప‌థ్యంలో పార్టీలోని కొందరు నాయకులు కాంగ్రెస్ వైఖరి పట్ల గుర్రుగా ఉన్నప్పటికీ.. వారు ఎన్ని సీట్లు ఇస్తే అన్ని తీసుకోండి అనే ధోరణిలో చంద్రబాబు నాయకుల్ని ఊరడిస్తున్నట్లు సమాచారం.

కాంగ్రెస్ పార్టీకి చంద్రబాబు నాయుడు ఎంత విలువను ఇస్తున్నాడో స్పష్టం చేస్తున్న మరో ఉదంతం ఇది. కాంగ్రెస్ విదిల్చినన్ని సీట్లను తీసుకుం దాం.. అంతకు మించి ఎవ్వరూ ఏం మాట్లాడొద్దు.. అని చంద్రబాబు నాయుడు తన పార్టీ శ్రేణులకు స్పష్టం చేసినట్టుగా తెలుస్తోంది. పొత్తు ఉన్న ప్పటికీ గట్టి సీట్లు అడగాలని.. ముప్పై సీట్ల వరకూ పోటీ చేద్దామని.. ఈ మేరకు ఆశావహులు సిద్ధంగా ఉన్నారని టీటీడీపీ నేతలు చంద్రబాబు నాయుడుకు విన్నవించుకున్నారు. కొన్ని నియోజకవర్గాల నేతలైతే హైదరాబాద్ కు చేరుకుని.. టికెట్ల విషయంలో ఫ్లెక్సీలు కూడా ఏర్పాట్లు చేసుకున్నారు. చంద్రబాబుకు ఇలా తమ విన్నపాన్ని వినిపించాలని చూశారు. అయితే వారి ఆశలపై చంద్రబాబు నీళ్లు చల్లారు. అంతేకాదు, కాంగ్రెస్ వాళ్లు 12 సీట్లను ఇస్తామని అంటున్నారని, ఆ మేరకు సర్దుకుపోవాలని చంద్రబాబు నాయుడు తన వాళ్లకు చెప్పాడని తెలుస్తోంది. ఇదీ.. తెలంగాణాలో టీడీపీ ప‌రిస్థితి మ‌రి దీనిని బ‌ట్టి బాబు కాంగ్రెస్ చేతిలో బందీ అయ్యాడా కాదో.. ప్ర‌జ‌లే తేల్చుకోవాలి.

ఇచ్చినవే తీసుకోండి.. ఎక్కువ మాట్లాడొద్దు!
0 votes, 0.00 avg. rating (0% score)

commentsRelated Posts


Share
Share