అలనాటి రొమాంటిక్ ట్రయో.. మళ్లీ కలుస్తారా?

October 7, 2018 at 9:34 am

తెలంగాణ ఎన్నికల సమరాంగణంలో మహాకూటమి పుణ్యమాని ఓ అరుదైన కాంబినేషన్ కనిపించే అవకాశం ఉంది. నిన్నటితరం సినిమా ప్రపంచంలో సూపర్ స్టార్లుగా వెలిగిన వాళ్లు, చరిత్రలో ఎన్నడూ కలిసి ఒక వేదిక మీద కనిపించని వాళ్లు.. ఈ ఎన్నికల పుణ్యమాని .. ఒకే వేదికను పంచుకోగలిగే అరుదైన సందర్భం కూడా రావచ్చునని అనిపిస్తోంది. ఆ రొమాంటిక్ ట్రయో ఎవరంటే.. మెగాస్టార్ చిరంజీవి, యువరత్న బాలకృష్ణ, ’లేడీ అమితాబ్’ విజయశాంతి!

7033-balakrishna

నిజానికి ఒకతరం సినిమా ప్రపంచాన్ని ఈ ముగ్గురూ ఏలారని చెప్పాలి. చిరంజీవి, బాలకృష్ణ ల నడుమ ఆ రోజుల్లో వ్యక్తిగతంగా స్నేహసంబంధాలే ఉన్నప్పటికీ, ఫ్యాన్స్ మధ్యలో దాదాపుగా ఫ్యాక్షన్ రేంజి పగలు, ప్రతీకారాలు ఉండేవి. వీరిద్దరూ కలిసి వేదికను పంచుకున్న సందర్భాలే చాలా తక్కువ. మరొకవైపు విజయశాంతి. ఆ రోజుల్లో టాప్ రేంజిలో ఉన్న చిరు, బాలయ్యలకు దీటుగా.. లేడీ ఓరియెంటెడ్ చిత్రాలు కూడా ముమ్మరంగా చేస్తూ.. దూసుకువెళ్లిన స్టార్ ఆమె.

ఈ ముగ్గురి మధ్య కూడా అనేకానేక హిట్ చిత్రాలు ఉన్నాయి. చిరంజీవి- విజయశాంతి, బాలకృష్ణ- విజయశాంతి కాంబినేషన్ చిత్రాలకు కూడా ఎంతో క్రేజ్ ఉండేది. అయితే ఈ ఇద్దరు స్టార్లతోనూ అప్పట్లో విజయశాంతికి విభేదాలు వచ్చాయి. గ్యాంగ్ లీడర్ చిత్రం తనవల్లనే విజయవంతం అయిందని విజయశాంతి ఓ సందర్భంలో కామెంట్ చేయడంతో.. అప్పటినుంచి చిరంజీవి ఆమెను తన సినిమాల్లో హీరోయిన్ గా తీసుకోకుండా పక్కన పెట్టారు. అలాగే.. బాలయ్యతో ఆమె చేసిన ‘రౌడీ ఇన్ స్పెక్టర్’ చిత్రం అప్పట్లో సూపర్ హిట్. అది తమిళంలోకి ‘ఆటోరాణి’ పేరుతో డబ్ అయింది. అసలు ఈ చిత్రానికి హీరో తానేనంటూ విజయశాంతి చెప్పుకుంది. దాంతో ఆగ్రహించిన బాలయ్య కూడా ఆమెను పక్కన పెట్టారు. విజయశాంతి వారి ఆగ్రహాన్ని పట్టించుకోకుండా.. తన స్టయిల్లో వరుసగా లేడీ ఓరియెంటెడ్ చిత్రాలు చేస్తూపోయింది గానీ.. క్రమంగా ఫేడవుట్ అయిపోయింది.

వర్తమానంలోకి వస్తే.. మెగాస్టార్ చిరంజీవి కాంగ్రెస్ లో ఉన్నారు. క్రియాశీలంగా లేకపోయినా.. రిక్వెస్టు మీద ప్రచారానికి రావొచ్చు. బాలకృష్ణ తెలంగాణ తెలుగుదేశం ప్రచారాన్ని ప్రారంభించేశారు. విజయశాంతి కూడా అంతే. కాంగ్రెస్ కు ఆమె స్టార్ క్యాంపెయినర్. తెదేపా, కాంగ్రెస్ రెండూ కూటమిగా ఉన్న వేళ ఆ కూటమి తరఫున ఈ ముగ్గురు స్టార్లు కలిసి ప్రచార వేదికలెక్కే అవకాశం ఉన్నదని అంచనాలు సాగుతున్నాయి. అదే జరిగితే.. ఆ సభలకు నిన్నటితరం జనం వెల్లువెత్తుతారేమో.

అలనాటి రొమాంటిక్ ట్రయో.. మళ్లీ కలుస్తారా?
0 votes, 0.00 avg. rating (0% score)

commentsRelated Posts


Share
Share