కొడంగ‌ల్‌లో నంద్యాల సీన్‌.. ఏం జ‌రుగుతుందో తెలుసా..!

November 19, 2017 at 7:16 pm
Telangana, revanth reddy, kodangal, nandyala

అవును! తెలంగాణ‌లోని కొడంగ‌ల్ నియోజ‌క‌వ‌ర్గంలో ఏపీలోని క‌ర్నూలు జిల్లాలో ఉన్న నంద్యాల సీన్ రిపీట్ అవుతోంద‌ట‌! అదేంటి అనుకుంటున్నారా? ఈ ఏడాది ఆగ‌స్టులో నంద్యాల‌కు ఉప ఎన్నిక జ‌రిగిన విష‌యం తెలిసిందే. ఈ సంద‌ర్భంగా అధికార టీడీపీ ఆ నియోజ‌క‌వ‌ర్గాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేసిన విష‌యం గుర్తిందిగా?! దాదాపు ఆరుగురు మంత్రులు, అధికారులు రాత్రికి రాత్రి నిర్ణ‌యాలు, ఇంచార్జు మంత్రుల‌కు ప్ర‌త్యేక అధికారాలు.. ఇలా.. ఎన్నిక‌ల్లో గెలుపే ల‌క్ష్యంగా అధికార టీడీపీ సాగించిన హ‌వాకు ఎంత‌మాత్ర‌మూ త‌గ్గ‌కుండా.. తెలంగాణలోని కొడంగ‌ల్ నియోజ‌క‌వ‌ర్గంలో అధికార టీఆర్ ఎస్ చ‌ర్య‌లు ప్రారంభించేసింది.

ఈ నియోజ‌క‌వ‌ర్గం నుంచి 2014లో రేవంత్ రెడ్డి గెలుపొందారు. అయితే, అనూహ్య ప‌రిణామాల నేప‌థ్యంలో ఆయ‌న టీడీపీకి రాజీనామా చేసి.. కాంగ్రెస్‌లోకి జంప్ చేశారు. ఈ స‌మ‌యంలోనే ఆయ‌న త‌న నియోజ‌క‌వ‌ర్గం కొడంగ‌ల్‌కు కూడా రాజీనామా చేశారు. దీంతో ఈ నియోజ‌క‌వ‌ర్గంలో ఉప ఎన్నిక జ‌రిగే అవ‌కాశం ఉంది. దీంతో ఇక్క‌డ గెలుపు అధికార పార్టీ టీఆర్ ఎస్‌కు ప్ర‌తిష్టాత్మ‌కంగా మారింది. అదేస‌మ‌యంలో రేవంత్ వంటి బ‌ల‌మైన అభ్య‌ర్థిని ఢీ కొనేందుకు త‌న వంతు వ్యూహంగా పావులు క‌దుపుతోంది. ఈ క్ర‌మంలోనే సీఎం కేసీఆర్ త‌న మేన‌ల్లుడు, మంత్రి హ‌రీష్ రావును రంగంలోకి దింపారు. ఈ క్ర‌మంలోనే కొడంగ‌ల్‌ నియోజకవర్గంలో టీడీపీ, కాంగ్రెస్‌ పార్టీలకు చెందిన కీలక నాయకులను అధికారపార్టీ పెద్దలు గులాబీ గూట్లోకి లాగేశారు.

మంత్రి హరీశ్‌ సూచన మేరకు అభివృద్ధి మంత్రాంగాన్ని తెరపైకి తీసుకొస్తున్నారు. కొడంగల్‌ నియోజకవర్గంలోని 5 మండలాలపై ప్రత్యేక ఫోకస్‌ పెట్టారు. అందుకు అనుగుణంగా మహబూబ్‌నగర్‌ జిల్లాలోని కోస్గి, మద్దూరు మండలాల్లోని పెండింగ్‌ పనులు, చేపట్టాల్సిన కొత్త పనులపై కార్యాచరణ చేపట్టారు. ఈ మేరకు జిల్లాకు చెందిన ప్రతీశాఖకు చెందిన ఉన్నతాధికారులను హైదరాబాద్‌లోని సచివాలయానికి పిలిపించుకొని మంతనాలు చేస్తున్నారు. వైద్య ఆరోగ్యశాఖ మంత్రి సి.లక్ష్మారెడ్డి, పంచాయతీరాజ్‌శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు, పట్నం మహేందర్‌రెడ్డిలు నిత్యం అధికారులతో సమీక్షలు నిర్వహిస్తున్నారు.

రాత్రికి రాత్రి పారశుద్ధ్యం, దోమ‌లు వంటి కీల‌క అంశాల‌పై నా దృష్టి పెట్టారు. మొత్తానికి రేవంత్ ల‌క్ష్యంగాటీ ఆర్ ఎస్ దూసుకుపోతుండ‌డం గ‌మ‌నార్హం. అయితే, ఇక్క‌డే ఓ సందేహం తెర‌మీద‌కి వ‌స్తోంది. అస‌లు ఈ ఉప ఎన్నిక జ‌రిగేనా? అనేది కొంద‌రి డౌట్‌. కొడంగ‌ల్‌కు రాజీనామా చేసిన రేవంత్ రెడ్డి స‌ద‌రు రాజీనామా ప‌త్రాన్ని అసెంబ్లీ స్పీక‌ర్‌కు ఇవ్వాల్సి ఉండ‌గా, నేరుగా టీడీపీ అధినేత‌కు ఇవ్వ‌డంపై అనుమానాలు వ్య‌క్తం అవుతున్నాయి. ఆ రాజీనామా ప‌త్రం స్పీక‌ర్‌కు అంది, అది ఈసీకి చేరిన త‌ర్వాత ఆరు మాసాల‌కు కానీ ఎన్నిక‌లకు అవ‌కాశం లేదు. దీంతో మ‌రి ఏం జ‌రుగుతుంద‌నే విష‌యంలో సందిగ్ధం నెల‌కొంది.

 

కొడంగ‌ల్‌లో నంద్యాల సీన్‌.. ఏం జ‌రుగుతుందో తెలుసా..!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts


Share
Share