వ్రతం చెడింది.. ఫలం దక్కేనా? లేదా?

September 12, 2018 at 9:28 am

తెలుగుదేశం పార్టీ కాంగ్రెస్ పార్టీతో పొత్తుకోసం తపనపడిపోతున్నదనే విషయం రెండు తెలుగురాష్ట్రాల్లోని ప్రతి ఒక్కరికీ విపులంగా అర్థమైపోయింది. దాదాపు ముప్ఫయి అయిదేళ్ల పైబడి.. తెలుగుదేశం పార్టీ కాపాడుకుంటూ వస్తున్న ‘కేరక్టర్’ కాస్తా చంద్రబాబునాయుడు తీసుకున్న ఒక గతిలేని నిర్ణయం వల్ల మంటగలిసిపోయింది. తెలుగుదేశం అంటేనే కాంగ్రెస్ వ్యతిరేక పార్టీ అనే ప్రతిష్టను ఉప్పు పాతర వేసేసి.. ఇవాళ కాంగ్రెస్ పార్టీ మోచేతి నీళ్లు తాగడానికి తెలుగుదేశం వెంపర్లాడుతోంది.

HY04NAIDU

అయితే, ఈ నిర్ణయం తీసుకోవడం ద్వారా తెలుగుదేశం పార్టీ వ్రతం చెడింది.. అలాగని ఫలం దక్కుతుందా? లేదా? అనేది మాత్రం ఇంకా పలువురిలో సందేహంగానే ఉంది. ఈ వ్రతం చెడగొట్టుకోవడం వలన తెలుగుదేశం పార్టీ తాము కోరుకుంటున్న సంఖ్యలో సీట్లను పొందగలుగుతుందా లేదా? అనేది ఇప్పుడు పలువురిలో రేగుతున్న మీమాంస. తెలుగుదేశం పార్టీ 36 సీట్లకంటె తక్కువ సీట్లు కేటాయించేట్లయితే ఎట్టి పరిస్థితుల్లోనూ ఒప్పుకోకూడదనే ఉద్దేశంతో ఉంది. మరో వైపు కాంగ్రెస్ పార్టీ.. తమకు కనీసం 90 స్థానాలు కావాలని కోరుకుంటోంది. ఈ లెక్కన మొత్తం సీట్లు ఈ ఇద్దరికే కూడా చాలకపోవచ్చు. పైగా అదనంగా తెజస, సీపీఐ కూడా వీరి కూటమిలో కలుస్తున్నాయి. వారు ఎన్నెన్ని స్థానాలకు పట్టుపడతారో తెలియదు.

TDP-Congress

ఎలా చూసినా సరే తెలుగుదేశానికి ఆశించినన్ని స్థానాలు దక్కడం మాత్రం అసాధ్యం అని అర్థమవుతోంది. గత 2014 ఎన్నికల్లో 15 సీట్లు సాధించిన పార్టీ.. ఇప్పుడు 36 సీట్లకు పోటీచేస్తే చాలని అనుకోవడమే చాలా దిగజారి వచ్చినట్లు లెక్క. కానీ, పరువు పోకుండా ఉండాలంటే.. కాంగ్రెస్ ఆసరా తీసుకోకుండ గత్యంతరం లేదని వారికి తెలుసు.

అందుకు కాంగ్రెస్ వ్యతిరేక పార్టీ అనే వ్రతం ఎటూ భంగపడింది. మరి ఆ దామాషాలో సీట్ల పరంగానైనా తెదేపా లాభపడుతుందా? లేదా? అనే చర్చ పలువురిలో నడుస్తోంది. ఫలం దక్కడం కూడా కష్టమే అని… పొత్తులు ఫైనల్ దశకు చేరుకునేలోగా పలుమార్లు రాజీపడాల్సిన అవసరం ఏర్పడుతుందని పార్టీ నాయకులే వ్యాఖ్యానిస్తున్నారు.

వ్రతం చెడింది.. ఫలం దక్కేనా? లేదా?
0 votes, 0.00 avg. rating (0% score)

commentsRelated Posts


Share
Share