టీడీపీలో మిగిలేది ఆ ఒక్క‌డేనా

January 20, 2018 at 4:15 pm
Telangana, TDP, Mothkupalli narasimhulu, Ravula chandra shekhar reddy

`తెలంగాణ‌లో టీడీపీని టీఆర్ఎస్‌లో విలీనం చేయాలి` అని ఆ పార్టీ సీనియ‌ర్ నాయ‌కుడు మోత్కుప‌ల్లి న‌ర్సింహులు చేసిన వ్యాఖ్య‌లు రెండు రాష్ట్రాల్లోనూ క‌ల‌క‌లం సృష్టిస్తున్నాయి. ఆయ‌న చేసిన వ్యాఖ్య‌ల వెనుక చాలా నిగూడార్థం ఉంద‌నే చ‌ర్చ మొద‌లైంది. టీఆర్ఎస్ అధికారంలోకి వ‌చ్చిన త‌ర్వాత టీడీపీపై దృష్టిసారించిన విషయం తెలిసిందే! ఆప‌రేష‌న్ ఆక‌ర్ష్ దెబ్బ‌కు టీడీపీలోని కీల‌క నాయ‌కులంద‌రూ కారెక్కేశారు. అయితే పార్టీకి పెద్ద‌దిక్కుగా మారిపోయిన‌ ఫైర్ బ్రాండ్ రేవంత్ కూడా కాంగ్రెస్ కండువా క‌ప్పేసుకున్నారు. దీంతో పార్టీ ప‌రిస్థితి నానాటికీ దిగ‌జారిపోయింది. ఇక ఈఏడాదో వ‌చ్చే ఏడాదో ఎన్నిక‌లు జ‌ర‌గ‌బోతున్న త‌రుణంలో.. పార్టీలోని సీనియ‌ర్లు ఎవ‌రి దారి వారు చూసుకుంటున్నా ర‌నే గుస‌గుస‌లు మొద‌ల‌య్యాయి. అయితే వీరంతా వెళ్లినా ఒక్క‌రు మాత్రం మిగులుతార‌ని చెబుతున్నారు. 

రెండు రాష్ట్రాలుగా విడిపోయిన త‌ర్వాత‌.. తెలంగాణ‌లో టీడీపీ ప‌రిస్థితి అధ్వానంగా మారిపోయింది. పార్టీ సీనియ‌ర్లు టీఆర్ఎస్ కండువా క‌ప్పేసుకోవ‌డం ఇదే స‌మ‌యంలో అధినేత చంద్ర‌బాబు.. ఏపీపైనే ఎక్కువగా దృష్టిసారించ‌డంతో నానాటికీ  ప‌రిస్థితి చేయి దాటిపోయింది. టీటీడీపీకి అండ‌గా నిలుస్తాడ‌నుకున్న రేవంత్ కూడా నేత‌ల‌పై అసంతృప్తితో కాంగ్రెస్‌లో చేరిపోయారు. ఇదే స‌మ‌యంలో పార్టీలో ఇంక మిగిలేదెవ‌రు అనే చ‌ర్చ ఎప్ప‌టినుంచో మొద‌లైంది. ప్ర‌స్తుతం టీటీడీపీలో స‌త్తుప‌ల్లి ఎమ్మెల్యే సండ్ర వెంక‌ట వీరయ్య‌, టీటీడీపీ అధ్య‌క్షుడు ఎల్‌.ర‌మ‌ణ‌, మోత్కుప‌ల్లి న‌ర్సిం హులు పేర్లు వినిపిస్తున్నాయి. ఇప్పుడు ఈ నేత‌లంతా ఎవ‌రి దారి వారు చూసుకుంటున్నార‌ని తెలుస్తోంది. 

ఎవరికివారు కర్చీఫ్ వేసుకుని రిజర్వ్ చేసుకున్నారని రాజకీయ వర్గాల్లో జోరుగా చ‌ర్చ జ‌రుగుతోంది. సీనియర్ టీటీడీపీ నేతలంతా వారికి అనుకూలంగా ఉండే పార్టీల్లో అడ్వాన్స్ బుకింగ్ లు చేసుకున్నార‌ట‌. అంద‌రికంటే ఎక్కువ‌గా మోత్కుపల్లి  నిరాశలో ఉన్నట్టు ఆయన అనుచరులు చెప్తున్నారు. 33 ఏళ్ల  రాజకీయ అనుభవంలో ఒక దళిత నాయకుడిగా వెలుగు వెలిగి నేడు ఎటూ పాలుపోని పరిస్థితిలో ఉన్నట్టు సమాచారం. ఊరించి ఆశలు రేపిన గవర్నర్ గిరీ ఇక రాదని మోత్కుపల్లికి అర్థమైందని అంటున్నారు. అమరావతిలో మంచి ఇల్లు కేటాయించాలని ఇక్కడే ఉండిపోతానని చెప్పినా టీడీపీ అధినేత – ఏపీ సీఎం చంద్రబాబు నుంచి స్పందన రాలేదట. 

దీంతో మోత్కుపల్లి ప్రత్యామ్నాయ రాజకీయ వేదిక కోసం ఎదురు చూస్తున్నారని వినవస్తున్నది. మరోవైపు టీటీడీపీకి వలసల ప్రమాదం పొంచి ఉందని గ్రహించిన చంద్రబాబు.. నష్టనివారణ చర్యలపై సీనియర్ నేత రావుల చంద్రశేఖర్ రెడ్డితో ఫోన్ లో మంతనాలు జరిపినట్టు తెలిసింది. పార్టీ నేతలు ఎవరి దారి వారి చూసుకోగా పార్టీలో మిగిలేది టీడీపీకి నమ్మినబంటు అనే పేరున్న మాజీ ఎంపీ రావుల చంద్రశేఖర్ రెడ్డి మాత్రమేనని అంటున్నారు. మ‌రి ఆ ఒక్క‌డు అయినా పార్టీలో ఉంటారో లేక ప‌క్క చూపులు చూస్తారో కాల‌మే నిర్ణయిస్తుంది! ఏది ఏమైనా టీటీడీపీకి మున్ముందు గ‌డ్డు ప‌రిస్థితులు త‌ప్ప‌వ‌నేది మాత్రం స్ప‌ష్టంగా తెలుస్తోంది!!

 

టీడీపీలో మిగిలేది ఆ ఒక్క‌డేనా
0 votes, 0.00 avg. rating (0% score)

comments



Related Posts


Share
Share