శిష్యుడి సీటుకి ఎస‌రు పెడుతున్న వెంక‌య్య‌

December 17, 2017 at 10:22 am
venkhai naidu, daughter, deepa venkhat, nellore, MP, ticket, politics

బీజేపీ ఎంపీగా ఉన్న వెంక‌య్యనాయుడిని ఉప‌రాష్ట్ర‌ప‌తిగా ప్ర‌క‌టించిన నాటి నుంచి ఆయ‌న వార‌సులెవ‌రు అనే చర్చ తెర‌పైకి వ‌చ్చింది. అనంత‌రం ఆయ‌న దేశ అత్యున్న‌త ప‌ద‌విని అధిష్టించిన త‌ర్వాత‌.. ఈ చ‌ర్చ సైలెంట్ అయిపోయింది. ప్ర‌స్తుతం నేత‌లంద‌రూ త‌మ వార‌సుల‌ను వ‌చ్చే ఎన్నిక‌ల్లో రంగంలోకి దించాల‌ని ఇప్ప‌టికే ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు. తెర‌వెనుక రంగం సిద్ధం చేస్తున్నారు. ఈ నేప‌థ్యంలో ఇప్పుడు ఉప రాష్ట్ర‌ప‌తి వెంక‌య్య కూడా.. త‌మ వార‌సురాలిగా కూతురు దీపా వెంక‌ట్‌ని రంగంలోకి దించ‌బోతున్నార‌న్న వార్త‌లు అమ‌రావ‌తిలో చ‌ర్చ‌కు వ‌చ్చాయి. అక్క‌డ కొంద‌రు రాజ‌కీయ నాయ‌కుల మ‌ధ్య ఈ చ‌ర్చ జ‌రుగుతుండ‌గా కొంద‌రు మీడియా వాళ్ల చెవిలో ఈ మ్యాట‌ర్ ప‌డింది. దీపా వెంక‌ట్ పొలిటిక‌ల్ ఎంట్రీ ఇవ్వ‌డ‌మే కాదు ఆయ‌న రాజ‌కీయ అరంగేట్రానికి బీజం ప‌డిన విశాఖ నుంచే ఆమెను పోటీ చేయించేందుకు వ్యూహాలు కూడా వెంక‌య్య ప‌న్నుతున్నార‌ట‌. ఈ ప‌రిణామం.. ఆయ‌న శిష్యుడికి మాత్రం చెమ‌ట‌లు ప‌ట్టిస్తోంద‌ట‌. 

విశాఖ‌కు, వెంక‌య్య‌నాయుడికి గ‌ల అవినాభావ సంబంధం గురించి ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన అవ‌స‌రం లేదు. ఈ విష‌యాన్ని ఆయ‌న ప‌దేప‌దే చెబుతూ ఉంటారు. ఇప్పుడు విశాఖ పార్లమెంట్‌ నియోజకవర్గం నుంచి ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు కుమార్తె దీపావెంకట్‌ పోటీ చేస్తారని రాజకీయ వర్గాల్లో జోరుగా ప్రచారం జరుగుతోంది. అయితే ఇక్క‌డో మెలిక కూడా ఉంద‌ట‌. అదేంటంటే.. రాబోయే ఎన్నికల్లో టీడీపీ, బీజెపీ కూటమి మళ్లీ కలసి పోటీ చేస్తేనే ఆమె పోటీ చేస్తారని ఆ వర్గాలు అంటున్నాయి. దీపా వెంకట్‌ ప్రస్తుతం స్వర్ణభారతి ట్రస్ట్‌ వ్యవహారాలు చూస్తున్నారు. ఆమె కుమార్తె రాజకీయాల్లోకి వస్తారని ఇంతకు ముందు ప్రచారం జరిగినా..అప్పట్లో ఆమె ఆ ప్రచారాన్ని ఖండించారు. 

రాజకీయాలకంటే స్వర్ణభారతి ట్రస్ట్‌ వ్యవహారాలే మిన్న అని చెప్పుకున్నారు. కానీ ఇటీవల కాలంలో ఆమె రాజకీయ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారని తెలుస్తోంది. క్రియాశీలక రాజకీయాలకు దూరంగా వెంక‌య్య ఉంటున్నారు. ఈ పరిస్థితుల్లో ఆయన కుమార్తె రాజకీయాల్లోకి రావాలని భావించడం బీజేపీ రాష్ట్ర రాజకీయాలను ప్రభావితం చేస్తాయనడంలో సందేహం లేదు. ప్ర‌త్య‌క్ష రాజ‌కీయాల‌కు వెంక‌య్య‌కు బంధం తెగిపోవ‌డంతో త‌న వార‌సులు త‌న రాజ‌కీయ వార‌స‌త్వాన్ని కంటిన్యూ చేయాల‌న్న బ‌ల‌మైన కోరిక వెంక‌య్య‌లో ఉంది. ఈ నేప‌థ్యంలోనే ఆయ‌న త‌న వార‌సురాలిని ఎన్నిక‌ల బ‌రిలోకి దించాల‌ని చూస్తున్న‌ట్టు తెలుస్తోంది. రాష్ట్ర రాజ‌కీయాల కంటే త‌న కుమార్తె జాతీయ రాజ‌కీయాల్లోనే బాగా ఫోక‌స్ అవ్వాల‌న్న‌దే వెంక‌య్య ఆలోచ‌న‌గా తెలుస్తోంది. 

ప్రస్తుతం విశాఖ‌ ఎంపీగా ఉన్న‌ హరిబాబు.. వెంకయ్యకు శిష్యుడే. ఇటీవల కాలంలో ఆయనకు మంత్రి పదవి కూడా ఇస్తారని ప్రచారం జరిగినా. .కొన్ని వర్గాలు అడ్డుకోవడంతో అది ఆగిపోయింది. అయితే ఇప్పుడు అక్కడ నుంచి ‘దీపావెంకట్‌’ పోటీ చేస్తే..హరిబాబు పరిస్థితి ఏమిటన్నది ఆసక్తికరంగా మారుతోంది. రాష్ట్రంపై బీజేపీ చూపిస్తున్న సవతి ప్రేమతో విసిగిపోయి ఉన్న సగటు ఓటర్లు బీజేపీ అంటేనే విరక్తి చూపిస్తున్నారు. ఈ పరిస్థితుల్లో వెంకయ్య కుమార్తె.. పోటీ చేస్తారడనంపై పలు సందేహాలు వ్యక్తమ‌వుతున్నాయి. ముఖ్యంగా విశాఖ‌కు రైల్వే జోన్ ఇవ్వ‌క‌పోవ‌డంతో ఆ ప్రాంత ప్ర‌జ‌లు తీవ్రంగా ఆగ్ర‌హంతో ఉన్నారు. ఒకవేళ ఆమె పోటీ చేయడమే నిజమైతే..  టీడీపీ, బీజేపీ పొత్తు ఉంటేనే సాధ్యమని, లేకపోతే ఆమె పోటీ చేయర‌ని ఆ వర్గాలు గట్టిగా చెబుతున్నాయి. టీడీపీతో పొత్తు ఉంటే చంద్రబాబు తన కుమార్తెను ఏదోలా గెలిపిస్తార‌న్న న‌మ్మ‌కం వెంక‌య్య‌కు ఉంటుది. ఒక‌వేళ ప‌రిస్థితులు మారి బీజేపీ + వైసీపీ పొత్తు పెట్టుకుంటే.. ఆమె పోటీ చేయ‌డం కష్ట‌మన్న‌ది తెలిసిందే. ఎందుకంటే చంద్ర‌బాబుతో వెంక‌య్య‌కు ఉండే అనుబంధం ఎంత చెప్పుకున్నా త‌క్కువే. ఆ అనుబంధం కంటిన్యూ అయితేనే వెంక‌య్య త‌న కుమార్తెను పోటీ చేయిస్తారు. ఇక్క‌డ నుంచి గ‌త ఎన్నిక‌ల్లో జగన్‌ తన తల్లిని పోటీకి నిలబెట్టి గెలిపించుకోలేకపోయిన విష‌యం తెలిసిందే. దీంతో వైసీపీతో బీజేపీ ప్ర‌యాణంలో వెంక‌య్య వార‌సురాలిని పోటీ పెట్టి రిస్క్ చేయ‌ర‌న్న‌ది ఓపెన్ సీక్రెట్‌.

 

శిష్యుడి సీటుకి ఎస‌రు పెడుతున్న వెంక‌య్య‌
0 votes, 0.00 avg. rating (0% score)

comments



Related Posts