వైసీపీలోకి టీడీపీ లీడ‌ర్‌… వెళ్ళ వ‌ద్ద‌ని ఉమా ఫోన్‌

December 13, 2017 at 6:38 pm
Vijayawada, TDP, Leader, Yalamanchela Ravi, YSRCP, Devineni Uma maheswarao, Chandra babu, YSRCP

టీడీపీలో అసంతృప్తి వ‌ర్గం తిరుగుబాటు బావుటా ఎగ‌ర‌వేసేందుకు సిద్ధ‌మ‌వుతోందా?  ముఖ్యంగా త‌మ‌ను సీఎం చంద్ర‌బాబు ప‌ట్టించుకోవ‌డం లేద‌ని తీవ్ర ఆగ్రహంతో ఉన్న క‌మ్మ సామాజిక‌వ‌ర్గ నేత‌లు.. వైసీపీ నేత‌ల‌తో ట‌చ్‌లో ఉంటున్నారా?  రాజ‌ధాని ప్రాంతంలో, అందులోనూ క‌మ్మ వ‌ర్గం అధికంగా ఉన్న విజ‌య‌వాడలోని టీడీపీలో ఉన్న మాజీ క‌మ్మ‌ ఎమ్మెల్యే.. వైసీపీలో చేరేందుకు రెడీ అయిపోయారా? అంటే వీట‌న్నింటికీ అవున‌నే స‌మాధాన‌మే వినిపిస్తోంది!! టీడీపీ అధినేత చంద్ర‌బాబుకు సొంత పార్టీ  మాజీ ఎమ్మెల్యే షాకిచ్చేందుకు ఒక‌డుగు దూరంలో ఉన్నారు. అయితే విష‌యం తెలిసిన చంద్ర‌బాబు.. హుటాహుటిన మంత్రి దేవినేని ఉమామ‌హేశ్వ‌ర‌రావును రంగంలోకి దించారు. టీడీపీలో జ‌రుగుతున్న అనూహ్య ప‌రిణామాలు న‌గ‌ర కార్య‌క‌ర్త‌లను అయోమ‌యానికి గురిచేస్తున్నాయి!!

విజ‌య‌వాడ రాజ‌కీయాల్లో క‌ల‌కలం మొద‌లైంది. టీడీపీకి భారీ షాక్ త‌గిలే సూచ‌న‌లు కనిపిస్తున్నాయి. ఆ పార్టీ మాజీ ఎమ్మెల్యే యలమంచిలి రవి టీడీపీకి గుడ్‌బై చెప్పే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. రాజీనామా చేసి వైఎస్ జగన్ నాయకత్వంలోని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరడానికి సిద్ధపడినట్లు తెలుస్తోంది. ముఖ్యమంత్రితో ముఖాముఖి సమావేశం ఏర్పాటు చేయిస్తానని రవికి చెప్పాల్సిందిగా ఉమ ర‌వి బంధువు అయిన‌ సాయిబాబతో చెప్పినట్లు తెలుస్తోంది. చంద్రబాబు ఢిల్లీ నుంచి తిరిగి రాగానే ఆ సమావేశం ఉంటుందని కూడా ఆయన చెప్పినట్లు సమాచారం. క‌మ్మ సామాజిక‌వ‌ర్గంలోని చాలామందిలో ఇప్ప‌టికే అసంతృప్తి గూడు క‌ట్టుకుంది. 

ఈ త‌రుణంలో, అందులోనూ క‌మ్మ సామాజిక‌వ‌ర్గం బ‌లంగా ఉన్న విజ‌య‌వాడ నుంచి వైసీపీలోకి వ‌ల‌స‌లు మొద‌లైతే ఇది టీడీపీకి గ‌ట్టి ఎదురు దెబ్బే! ఈ విష‌యాన్ని గ‌మ‌నించిన తెలుగుదేశం పార్టీ, సీఎం చంద్రబాబు న‌ష్ట‌నివార‌ణ‌కు శ‌ర‌వేగంగా చ‌ర్య‌లు చేప‌ట్టారు.  అప్రమత్తమయ్యారు. రవికి సన్నిహిత బంధువైన సిటి కేబుల్ ఎండి సాయిబాబతో దేవినేని ఉమ ఫోన్‌లో మాట్లాడి, రవికి నచ్చజెప్పాలని చెప్పిన‌ట్టు సమాచారం. వచ్చే ఎన్నికల్లో కమ్మ ఓటర్లలో చీలిక రాకుండా చూడడానికి యలమంచిలి రవిని పార్టీ నుంచి వెళ్లకుండా జాగ్రత్తపడాలని చంద్రబాబు భావిస్తున్నారు. తొందరపడి నిర్ణయం తీసుకోవద్దని యలమంచిలి రవికి చెప్పాల్సిందిగా చంద్రబాబు మంత్రి దేవినేని ఉమామహేశ్వర రావుకు సూచించారు. దీంతో యలమంచిలి రవిని ఆపాలని ఆయన దేవినేని ఉమకు చెప్పార‌ని స‌మాచారం. 

త‌న అనుచరులతో యలమంచిలి రవి మంగళవారం సమావేశమయ్యారు. ఆయన సమావేశానికి ఎక్కువగా కాపు సామాజిక వర్గానికి చెందినవారు హాజరయ్యారు. వారంతా పవన్ కళ్యాణ్ జనసేన పార్టీకి సన్నిహితులని సమాచారం. విజయవాడ తూర్పు నియోజకవర్గంలో కాపులు ఎక్కువ మంది ఉన్న దృష్ట్యా జనసేనలో చేరాలని వారు ఆయనకు చెప్పినట్లు తెలుస్తోంది. రవి దానికి ఏ విధమైన సమాధానం ఇవ్వలేదట‌. మొత్తానికి విజ‌య‌వాడ టీడీపీలో క‌ల‌క‌లం మొద‌లైంది. 

 

వైసీపీలోకి టీడీపీ లీడ‌ర్‌… వెళ్ళ వ‌ద్ద‌ని ఉమా ఫోన్‌
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts


Share
Share