జ‌గ‌న్ తాజా హామీ…లాయ‌ర్ల‌కు ‘న్యాయం’ చేస్తా

May 7, 2018 at 6:11 pm
YS Jagan, lawyers, sty-fund, Praja samkalpa yatra,

వైసీపీ అధినేత జ‌గ‌న్ త‌న దూకుడు ను ఎంత‌మాత్రం త‌గ్గించ‌డం లేదు. ఎక్క‌డా రాజీప‌డ‌డం లేదు. 2019 ఎన్నిక‌ల్లో గెలుపే ల‌క్ష్యంగా జ‌గ‌న్ దూసుకుపోతున్నాడు. ఈ క్ర‌మంలో  ఆయ‌న అధికార టీడీపీని ఓవ‌ర్ టేక్ చేసేలా ప‌లు హామీలు గుప్పిస్తున్నారు. ఇప్ప‌టికే.. న‌వ‌ర‌త్నాలు పేరుతో ప్ర‌క‌టించిన హామీలు ప్ర‌జ‌ల్లోకి విస్తృతంగా వెళ్లాయి. అదేవిధంగా వివిధ సామాజిక వ‌ర్గాల‌కు ఆయ‌న వ‌రాలు ప్ర‌క‌టిస్తున్నారు. ఈ క్రమంలో బీసీ కార్పొరేష‌న్ ఏర్ప‌టుకు కూడా సిద్ధ‌మ‌య్యారు. 

 

వ‌చ్చే ఏడాది ఎన్నిక‌ల్లో అధ‌కారం చేప‌ట్టాక మ‌రిన్ని ప‌థ‌కాల‌ను తాను అమ‌లు చేస్తాన‌ని హామీలు ఇస్తున్నాడు. దీంతో జ‌గ‌న్‌కు ఫాలోయింగ్ భారీ స్థాయిలో పెరిగింద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. తాజాగా జ‌గ‌న్‌.. లాయ‌ర్లకు కూడా భారీ హామీ ఇచ్చారు. ఇప్ప‌టి వ‌ర‌కు ఏ రాజ‌కీయ పార్టీ కూడా లాయర్లు, డాక్ట‌ర్ల వ‌ర్గాల‌పై పెద్ద‌గా దృష్టి పెట్టింది లేదు. అయితే, జ‌గ‌న్ వినూత్నం గా లాయ‌ర్ల‌కు ప‌లు కీల‌కమైన హామీల వ‌రాలు ఇచ్చారు. విష‌యంలోకి వెళ్తే.. ప్ర‌స్తుతం కృష్ణా జిల్లాలో ప్ర‌జాసంక‌ల్ప యాత్ర చేస్తున్న జ‌గ‌న్‌.. తాజాగా లాయ‌ర్ల సంఘంతో భేటీ అయ్యారు.

 

ప్రజాసంకల్ప యాత్రలో భాగంగా ఆయన  కృష్ణాజిల్లా గుడ్లవల్లేరు మండలంలో 13 కిలోమీటర్ల మేర పాదయాత్ర నిర్వహించారు. కౌతవరం సబ్‌స్టేషన్‌ సమీపంలో న్యాయవాదుల సమస్యలపై రాష్ట్ర వైసీపీ న్యాయవాదుల సంఘం ఆధ్వర్యంలో ఆయనకు వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా జగన్‌ మాట్లాడుతూ.. న్యాయవాదుల సమస్యల న్నింటినీ పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటానని లాయర్లకు హామీ ఇచ్చారు. 

 

లా పూర్తి చేసి.. లాయర్ గా ఎన్ రోల్ చేసుకున్న ప్రతి న్యాయవాదికి ప్రతి నెలా రూ.5వేల చొప్పున స్టైఫండ్ ఇస్తామని పేర్కొన్నారు. అది కూడా ఏ ఆర్నెల్లో.. ఏడాది కాదు. వరుసగా మూడేళ్ల పాటు ఈ స్టైఫండ్ ఇస్తామన్నారు.  వ‌చ్చే ఎన్నిక‌ల్లో తమ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే తాను తాజాగా ఇచ్చిన హామీని అమలు చేస్తానని మాట ఇచ్చారు. అదేవిధంగా లాయర్లు ఆకస్మికంగా మరణిస్తే వారి కుటుంబానికి ప్రస్తుతం ఇస్తున్న రూ.4 లక్షల పరిహారం కాస్తా రూ.10 లక్షలకు పెంచాలని కోర‌గా..  తమ ప్రభుత్వం ఏర్ప‌డ్డాక దీనిపై చ‌ర్చించి సానుకూలంగా స్పందిస్తామన్నారు. 

 

న్యాయవాదుల సంక్షేమానికి తెలంగాణ ప్రభుత్వం రూ.100 కోట్లు కేటాయించిన విషయాన్ని తన దృష్టికి కొందరు తీసుకొచ్చారని.. తమ ప్రభుత్వం కూడా ఇదే తీరులో నిధులు కేటాయించనున్నట్లు పేర్కొన్నారు. అంతేకాదు.. హైకోర్టు నిర్మించిన తర్వాత అదే ప్రాంతంలో లాయర్లు కోరుతున్నట్లుగా తక్కువ ధరకే వారికి ఇళ్ల స్థలాలు అందుబాటులోకి తెచ్చి ఇస్తామన్నారు.  మొత్తంగా లాయ‌ర్ల‌పై జ‌గ‌న్ వ‌రాల జ‌ల్లు కురిపించ‌డంతో న్యాయ‌వాదులు మూకుమ్మ‌డిగా జై జ‌గ‌న్ అంటూ నినాదాల‌తో హోరెత్తించారు. 

 

జ‌గ‌న్ తాజా హామీ…లాయ‌ర్ల‌కు ‘న్యాయం’ చేస్తా
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts


Share
Share