క‌ర్నూలులో జ‌గ‌న్ వ్యూహం మామూలుగా లేదుగా…

November 20, 2017 at 10:13 am
YS Jagan, YSRCP, Kurnool, Pada yathra

వైసీపీ అధినేత వైఎస్‌.జ‌గ‌న్ ప్ర‌జా సంక‌ల్ప‌యాత్ర కంటిన్యూ అవుతోంది. సోమ‌వారంతో పాద‌యాత్ర 13వ రోజుకు చేరుకోనుంది. క‌డ‌ప జిల్లా యాత్రం కంప్లీట్ చేసుకుని క‌ర్నూలు జిల్లాలోకి ప్ర‌వేశించిన జ‌గ‌న్ ఆళ్ల‌గ‌డ్డ‌, బ‌న‌గాన‌పల్లి నియోజ‌క‌వ‌ర్గాల్లో త‌న యాత్ర పూర్తి చేసుకున్నాడు. ఈ రోజు నుంచి జ‌గ‌న్ యాత్ర డోన్ నియోజ‌క‌వ‌ర్గంలోకి ఎంట్రీ ఇస్తుంది. ముందుగా క‌డ‌ప జిల్లా నుంచి ప్రారంభ‌మైన జ‌గ‌న్ యాత్ర ఆ త‌ర్వాత క‌ర్నూలు జిల్లాలోకి ప్ర‌వేశించింది.

ఈ రెండు జిల్లాల్లో చూసుకుంటే జ‌గ‌న్ సొంత జిల్లా క‌డ‌ప క‌న్నా క‌ర్నూలు జిల్లాలో వ‌చ్చిన రెస్పాన్స్ బాగుంది. జ‌గ‌న్ ఇప్ప‌టి వ‌ర‌కు ప‌ర్య‌టించిన ఆళ్ల‌గ‌డ్డ‌, బ‌న‌గాన‌ప‌ల్లి నియోజ‌క‌వ‌ర్గాల్లో ప‌లువురు కీల‌క నాయకులు టీడీపీ నుంచి వైసీపీలో చేర‌డంతో కూడా ఆ పార్టీలో ఫుల్ జోష్ వ‌చ్చింది. ఈ రెండు నియోజ‌క‌వ‌ర్గాల్లోను మంచి ప‌ట్టున్న నాయ‌కులు జ‌గ‌న్ స‌మ‌క్షంలో వైసీపీలో చేరారు. ఆళ్లగడ్డ నియోజకవర్గంలో భూమా నాగిరెడ్డికి అనుచరుడు మాజీ మార్కెట్ యార్డు కమిటీ ఛైర్మన్ బాలిరెడ్డిని పార్టీలో చేరారు. ఇది ఆళ్ల‌గ‌డ్డ‌లో వైసీపీకి మంచి ఊపు వ‌చ్చే అంశం అయితే ఇక్క‌డ మంత్రిగా ఉండి ఇప్ప‌ట‌కీ ప‌ట్టు సాధించ‌లేక‌పోతోన్న అఖిల‌ప్రియ‌కు పెద్ద షాకే.

ఇక ఆళ్ల‌గ‌డ్డ‌తో ప్రారంభ‌మైన చేరిక‌లు బ‌న‌గాన‌ప‌ల్లె నియోజ‌క‌వ‌ర్గంలోను కంటిన్యూ అయ్యాయి. బనగానపల్లెలోనూ గట్టి లీడర్ ను పార్టీలోకి చేర్చుకున్నారు. టీడీపీ జిల్లా వైద్య విభాగం అధ్యక్షుడు డాక్టర్ రామిరెడ్డి పార్టీలో చేరారు. ఆయ‌న‌కు నియోజ‌క‌వ‌ర్గంలో మంచి పేరు ఉంది. గత ఎన్నిక‌ల్లో ఆయ‌న స్థానిక టీడీపీ ఎమ్మెల్యే బిసి.జ‌నార్థ‌న్‌రెడ్డి గెలుపుకోసం ఎంతో కృషి చేశారు. గ‌త ఎన్నిక‌ల్లో ఆయ‌న కృషి వ‌ల్లే కోవెల‌కుంట్ల ప‌ట్ట‌ణంలో టీడీపీకి భారీ మెజార్టీ వ‌చ్చింది. ఇప్పుడు ఆయ‌న పార్టీలో ప్ర‌యారిటీ లేక‌పోవ‌డంతో ఆయ‌న‌పై వైసీపీ నాయ‌కులు వ‌ల వేసి పార్టీలో చేర్చుకున్నారు.

ఇక 13 రోజుల యాత్ర‌లో జ‌గ‌న్ సొంత జిల్లా కంటే కూడా క‌ర్నూలు జిల్లాలో జ‌నాలు ఎక్కువుగా రావ‌డం, రెండు కీల‌క నియోజ‌క‌వ‌ర్గాల్లో మంచి ప‌ట్టున్న నాయ‌కులు పార్టీలో చేర‌డంతో క‌ర్నూలు జిల్లాలో జ‌గ‌న్ యాత్ర స‌క్సెస్‌ఫుల్‌గా ముందుకు వెళుతోంది. ఆళ్ల‌గ‌డ్డ‌, బ‌న‌గాన‌ప‌ల్లె నియోజ‌క‌వ‌ర్గాల్లో నాయ‌కుల‌ను చేర్చుకుని బోణి కొట్టిన జ‌గ‌న్ మ‌రి డోన్ నియోజ‌క‌వ‌ర్గంలో ఎలాంటి వ్యూహం అమ‌లు చేస్తాడో ? చూడాలి.

 

క‌ర్నూలులో జ‌గ‌న్ వ్యూహం మామూలుగా లేదుగా…
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts


Share
Share