జ‌గ‌న్ యాత్ర‌లో కీల‌క ఘ‌ట్టం.. ఇక ఆ వర్గం టీడీపీకి గుడ్ బై!

July 6, 2018 at 11:46 am
YS jagan, Praja samkalpa Yatra, Rajumendry ticket, BC candidate, announced

ప్ర‌జా సంక‌ల్ప యాత్ర చేస్తున్న జ‌గ‌న్‌.. ప్ర‌స్తుతం తూర్పు గోదావ‌రిజిల్లాలో పాద‌యాత్ర నిర్వ‌హిస్తున్నారు. దాదాపు 206 రోజులుగా ఆయ‌న పాద‌యాత్ర సాగిస్తున్నారు. ప్ర‌తి జిల్లాలోనూ ప్ర‌జ‌లు జ‌గ‌న్‌కి మంగ‌ళ హార‌తులు ప‌డుతున్నారు. రాష్ట్రంలో అతిపెద్ద జిల్లా అయిన తూర్పులోనూ ప్ర‌జ‌లు జ‌గ‌న్‌కు జేజేలు ప‌లుకుతున్నారు. అంతేకాదు, ఇక్క‌డ టీడీపీకి కంచుకోట‌లుగా ఉన్న ప‌లు ప్రాంతాల్లో ఇప్పుడు వైసీపీ జెండాలు ఎగురుతున్నాయి. గ‌త ఏడాది న‌వంబ‌రు 6న ప్రారంభించిన ఈ యాత్ర‌ను ఇప్ప‌టి వ‌ర‌కు నిర్విఘ్నంగా నిర్వ‌హిస్తూ వస్తున్న జ‌గ‌న్‌.. ఆరోగ్య ప‌రంగా ఒకింత న‌ల‌త ఏర్ప‌డినా.. ఎండ‌లు 45 డిగ్రీలు దాటిపోయినా కూడా ఆయ‌న ఎక్క‌డా జంక‌లేదు. వెనుక‌డుగు వేయ‌లేదు. ముందుకు సాగుతూనే ఉన్నారు. అశేష జ‌న‌వాహినిని ఆయ‌న ప‌ల‌క‌రించుకుంటూ ముందుకు సాగుతున్నారు. ఎక్క‌డిక‌క్క‌డ ప్ర‌జ‌ల స‌మ‌స్య‌ల‌ను ప‌రిష్క‌రించేందుకు తాను అధికారంలోకి రాగానే చూస్తాన‌ని చెప్ప‌డం ద్వారా వారిలో భ‌రోసా నింపుతున్నారు.

తాజాగా.. జ‌గ‌న్ పాద‌యాత్ర 206 రోజులు తూర్పు గోదావ‌రి జిల్లాలో పూర్తి చేసుకుంది. ఈ క్రమంలోనే ఆయ‌న అధికార టీడీపీకి గ‌ట్టి షాకిచ్చారు. నిజానికి టీడీపీ ఊహించ‌ని విధంగా జ‌గ‌న్ చేసిన ప్ర‌క‌ట‌న‌కు రాజ‌కీయంగా ప్ర‌కంప‌న‌లు పుడుతున్నాయి. తూర్పు గోదావ‌రిలో బీసీల అండ‌తోనే 2014లో టీడీపీ గెలుపు గుర్రం ఎక్కింది. ఇక్క‌డి 19 నియోజ‌క‌వ‌ర్గా్ల్లో వైసీపీ ఐదు చోట్ల మాత్ర‌మే గెలుపొందింది. మిగిలిన వాటిలో ఒక చోట ఇండిపెండెంట్ గెలుపొంద‌గా.. మిగిలిన అన్నిస్థానాల‌నూ టీడీపీ కైవ‌సం చేసుకుంది. ఆ త‌ర్వాత చంద్ర‌బాబు విసిరిన ఆక‌ర్ష్ మంత్రంతో జ్యోతుల నెహ్రూ, వంతల రాజేశ్వ‌రి, వ‌రుపుల సుబ్బారావు త‌దిత‌రులు టీడీపీలో చేరిపోయారు. మొత్తంగా చూసుకుంటే.. బీసీల‌కు అధిక ప్రాధాన్యం ఉన్న ఈ జిల్లాలో టీడీపీ గెలుపు గుర్రం ఎక్క‌డానికి వారే కీల‌కంగా మారారు. ఈ విష‌యాన్ని ముందుగానే గ్ర‌హించిన జ‌గ‌న్‌.. టీడీపీకి గ‌ట్టి దెబ్బ‌కొట్టేందుకు నిర్ణ‌యించారు.

ఈ క్ర‌మంలోనే ఆయ‌న బీసీల‌కు పెద్ద‌పీట వేశారు. వ‌చ్చే ఎన్నిక‌ల్లో రాజ‌మండ్రి టికెట్‌ను బీసీల‌కే కేటాయిస్తాన‌ని జ‌గ‌న్ ప్ర‌క‌టించి రాజ‌కీయ భూకంపం సృష్టించారు. నిజానికి ఇప్ప‌టి వ‌ర‌కు బీసీలు టీడీపీకి అండ‌గా ఉంటూ వ‌చ్చారు. అయితే, ఇప్పుడు ప‌రిస్థితులు మారిపోయాయి. కాపుల‌కు 5% కోటా కేటాయిస్తూ.. అసెంబ్లీ తీర్మానం చేయ‌డంతో బీసీలు ఆ పార్టీని తీవ్ర వ్య‌తిరేక పార్టీగా భావిస్తున్నారు. ఈ నేప‌థ్యంలో జ‌గ‌న్ చేసిన ప్ర‌క‌టన టీడీపీకి శ‌రాఘాతంగానే ప‌రిగ‌ణించాల్సి ఉంటుంద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. దీనికితోడు గ‌త వైసీపీ ప్లీన‌రీ స‌మ‌యంలోనే బీసీల స్థితిగ‌తులు, స‌మాజంలో వారు ఎదుర్కొంటున్న స‌మ‌స్య‌ల‌ను తెలుసుకునేందుకు బీసీ కార్పొరేష‌న్ ఏర్పాటుకు కూడా తాము ప్రాధాన్యం ఇస్తామ‌ని, ఇప్ప‌టి నుంచి బీసీల‌పై అధ్య‌య‌నం చేయిస్తాన‌ని ప్ర‌క‌టించారు జ‌గ‌న్‌.

అప్ప‌ట్లోనే టీడీపీ త‌న కూసాలు క‌దిలిపోతాయ‌ని భావించింది. ఇక‌, రాబోయే రోజుల్లో మ‌రిన్ని హామీలు గుప్పించేందుకు సైతం జ‌గ‌న్ సిద్ధంగా ఉన్నాడ‌నే ప్ర‌చారం సాగుతోంది. తూర్పులో ఇప్ప‌టికే మంత్రులు య‌న‌మ‌ల రామ‌కృష్ణుడు, నిమ్మ‌కాయ‌ల చిన‌రాజ‌ప్ప‌ల మ‌ధ్య ఆదిప‌త్య పోరు సాగుతోంది. ఈ నేప‌థ్యంలో వారు ఎవ‌రూ పార్టీ శ్రేణుల‌ను పెద్ద‌గా ప‌ట్టించుకోవ‌డం లేదు. దీనిని గ‌మ‌నించిన జ‌గ‌న్‌.. పార్టీలోకి ఎవ‌రు వ‌చ్చినా చేర్చుకునేందుకు సిద్ధ‌మ‌ని ప్ర‌క‌టించారు. ఈ ప‌రిణామం కూడా రాబోయే రోజుల్లో వైసీపీలో కీల‌క అంశంగా మారుతుంద‌ని అంటున్నారు. మ‌రి ఏం జ‌రుగుతుందో చూడాలి.

జ‌గ‌న్ యాత్ర‌లో కీల‌క ఘ‌ట్టం.. ఇక ఆ వర్గం టీడీపీకి గుడ్ బై!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts


Share
Share