
వైసీపీ అధినేత వైఎస్.జగన్ ప్రజాసంకల్ప యాత్ర ప్రస్తుతం పశ్చిమగోదావరి జిల్లాలో కొనసాగుతోన్న సంగతి తెలిసిందే. జగన్ పాదయాత్ర 164వ రోజు జిల్లాలోని గోపాలపురం నియోజకవర్గంలోకి ఎంటర్ అవుతోంది. 164వ రోజు పాదయాత్రలో భాగంగా జగన్ గురువారం ఉదయం గోపాలపురం నియోజకవర్గం ద్వారకాతిరుమల మండలం నైట్‌క్యాంప్ నుంచి పాదయాత్ర ప్రారంభిస్తారు. అక్కడి నుంచి రాజపంగిడి గూడెం, సూర్యచంద్రరావుపేట మీదుగా గొల్లగూడెం చేరుకుంటారు. అనంతరం భోజన విరామం తీసుకుంటారు. పాదయాత్ర తిరిగి మధ్యాహ్నం 2.45కి ప్రారంభమౌతుంది. అక్కడ నుంచి తిరుమలపాలెం, పాములూరు గూడెం చేరుకుంటారు. రాత్రికి జననేత అక్కడే బస చేస్తారు. ఆ తర్వాత ఈ యాత్ర ఇదే నియోజకవర్గంలో దూబచర్ల, నల్లజర్ల నుంచి ఆ తర్వాత తాడేపల్లిగూడెం నియోజకవర్గంలోకి ఎంటర్ అవుతుంది.
టీడీపీకి కంచుకోట…
రాజమండ్రి లోక్‌సభ నియోజకవర్గ పరిధిలో ఉన్న గోపాలపురం నియోజకవర్గం ఆదినుంచి టీడీపీకి కంచుకోట. ఇక్కడ పార్టీ ఆవిర్భవించాక టీడీపీ కేవలం 2004లో మాత్రమే గెలిచింది. 2004లో ఇక్కడ నుంచి నాటి వైఎస్ గాలిలో మద్దాల సునీత మాత్రమే గెలిచారు. ఆ ఎన్నికల్లో కూడా అసెంబ్లీకి టీడీపీ ఓడినా ఎంపీకి వచ్చే సరికి మాత్రం నాడు భద్రాచలం నుంచి టీడీపీ తరపున ఎంపీకి పోటీ చేసిన కొమరం ఫణీశ్వరమ్మకు మెజార్టీ వచ్చింది. 2009, 2014లో ఇక్కడ నుంచి టీడీపీ అభ్యర్థులు ఘనవిజయం సాధించారు. ప్రస్తుతం ముప్పిడి వెంకటేశ్వరరావు ప్రాథినిత్యం వహిస్తున్నారు.
కమ్మ సామాజికవర్గానికి పెట్టని కోట…
టీడీపీకి కమ్మ కులానికి ఉన్న అవినాభావ సంబంధం గురించి చెప్పక్కర్లేదు. ఈ వర్గం ఓటర్లలో మెజార్టీ ఓట్లు టీడీపీకి సాలిడ్‌గా పడుతుంటాయి. ఈ నియోజకవర్గంలోనూ గత మూడున్నర దశాబ్దాలుగా అదే జరుగుతోంది. గోపాలపురం, నల్లజర్ల, దేవరపల్లి, ద్వారకాతిరుమల మండలాల్లో 38 వేల వరకు కమ్మ వర్గం ఓటర్లు ఉన్నారు. వీరు టీడీపీ గెలుపులో కీలకంగా ఉన్నారు. నియోజకవర్గంలో స్థానిక సంస్థల్లో టీడీపీ చాలా స్ట్రాంగ్‌గా ఉంది. జడ్పీచైర్మన్ ముళ్లపూడి బాపిరాజు ఇదే నియోజకవర్గంలోని నల్లజర్ల మండలానికి చెందిన వారు. ఆయన కూడా కోట్లాది రూపాయలతో ఇక్కడ అభివృద్ధి పనులు చేయడం టీడీపీకి బాగా కలిసొస్తోంది. ఇక బీసీ వర్గాలు కూడా పార్టీకి బలంగా కొమ్ము కాస్తున్నాయి. టీడీపీ ఎంత బలంగా ఉందో అలాగే నాలుగు మండలాల్లోనూ గ్రూపు రాజకీయాలు ఆ పార్టిని ఇబ్బంది పెడుతున్నాయి.
వైసీపీ విషయానికి వస్తే…
విపక్ష వైసీపీ విషయానికి వస్తే గత ఎన్నికల్లో దేవరపల్లి మండలానికి చెందిన తలారి వెంకట్రావు పోటీ చేసి ఓడిపోయారు. ప్రస్తుతం నియోజకవర్గ వైసీపీ ఇన్చార్జ్గా ఆయనే ఉన్నారు. పార్టీని ముందుండి నడిపిస్తున్నారు. కాస్తంత సానుభూతిని కూడా ఉంది. అయితే ఆర్థికంగా ఆయన వీక్‌గా ఉన్నట్టు తెలిసింది. తలారి పార్టీలో ఎలాంటి విబేధాలు లేకుండా ముందుండి నడిపించడంతో పాటు ఇక్కడ బలంగా ఉన్న కమ్మ కమ్యూనిటీనే ముందు పెట్టి బండి నడిపిస్తూ వచ్చే ఎన్నికల్లో ఆ వర్గం ఓట్లలో కొంత వరకు అయినా చీలిక తెచ్చే ప్రయత్నం చేస్తున్నాడు. మరి వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా అధికారంలోకి రావాలని చూస్తోన్న జగన్ ఆయనకే సీటు ఇస్తారా ? లేదా ? అన్నది చూడాలి. ఆర్థికంగా బలమైన వ్యక్తులు లేదా ప్రభుత్వ అధికారుల కోసం అన్వేషణ కూడా జరుగుతోంది.
జగన్ ఇక్కడ ఎంత చేసినా పార్టీ పరంగా చూస్తే టీడీపీ స్ట్రాంగ్‌గా ఉంది. వైసీపీ వీక్‌గానే కనిపిస్తోంది. దేవరపల్లి, గోపాలపురం మండలాల్లో వైసీపీ – టీడీపీ మధ్య హోరాహోరీ పోరు ఎప్పుడూ ఉంటోంది. అక్కడ వైసీపీకి కాస్తో కూస్తో ఎడ్జ్ ఉన్నా నల్లజర్ల, ద్వారకాతిరుమల టీడీపీ కంచుకోటలు. ఇక్కడ ఎప్పుడూ ఆ పార్టీకి భారీ మెజార్టీ వస్తోంది. ఏదైమైనా ఈ నియోజకవర్గంలో టీడీపీని ఢీకొట్టి జగన్ తన పార్టీ జెండా ఎగరేయాలంటే చాలా కష్టపడాల్సి ఉంది. మరి జగన్ వ్యూహాలు, పాదయాత్ర ఎంత వరకు కలిసోస్తాయో ? చూడాలి.