ఈ క్లాస్ లీడ‌ర్ల‌తో సీఎం క‌ల సాకార‌మ‌య్యేనా జ‌గ‌న్‌..!

November 11, 2017 at 10:59 am
YSRCP, YS Jagan, Padayathra, mass leaders,class leaders

వైసీపీ అధినేత జ‌గ‌న్‌.. భారీ ప్ర‌ణాళిక‌నే త‌ల‌కెత్తుకున్నారు. ఏపీలో పార్టీని అధికారంలోకి తీసుకువ‌చ్చి.. త‌న తండ్రి రాజ‌న్న పాల‌న‌ను మ‌రోసారి ప్ర‌జ‌ల‌కు అందించాల‌ని ఆయ‌న భావిస్తున్నారు. అదేస‌మ‌యంలో ఆయ‌న సీఎం కావాల‌ని, క‌నీసం 30 ఏళ్ల‌పాటు వ‌రుస‌గా గెలిచి రికార్డు సృష్టించాల‌ని కూడా జ‌గ‌న్ క‌ల‌లుకంటున్నారు. `క‌లలు క‌నండి.. సాకారం చేసుకోండి!` అని మాజీ రాష్ట్ర‌ప‌తి, దివంగ‌త అబ్దుల్ క‌లాం చెప్పిన పంథాలోనే జ‌గ‌న్ సాగుతున్నారు. అయితే, ఈ క్ర‌మంలోనే ఆయ‌న అనుస‌రిస్తున్న పంథా వివాదాస్ప‌దం అవుతోంది. జ‌నాల్లోకి వెళ్లే క్ర‌మంలో జ‌గ‌న్‌.. మాస్ లీడ‌ర్ల‌ను న‌మ్ముకోకుండా క్లాస్ లీడ‌ర్ల‌ను న‌మ్ముకుంటున్నారు. ముఖ్యంగా అస్స‌లు రాజ‌కీయాల‌తో సంబంధం లేకుండా నిన్న మొన్న‌టి వ‌ర‌కు నాలుగు గోడ‌ల మ‌ధ్య ఉద్యోగాలు చేసుకుంటున్న‌వారిని చేర‌దీశారు.

విజ‌య‌సాయిరెడ్డి, స‌జ్జ‌ల రామ‌కృష్ణారెడ్డి వంటి వారిని చేర‌దీసి.. వారికి రాజ‌కీయ ప‌ద‌వులు క‌ట్ట‌బెట్టారు. అదేస‌మ‌యంలో నియోజ‌క‌వ‌ర్గం బాధ్య‌త‌లతో స‌రిపెట్ట‌కుండా రాష్ట్ర‌స్థాయిలో బాధ్య‌త‌లు అప్ప‌గించారు. ఈ ప‌రిణామం ఇప్పుడు ఎవ‌రికీ కొరుకుడు ప‌డ‌డం లేదు. ఈ ఇద్ద‌రు నేత‌ల మీదుగానే వైసీపీలో ప్ర‌ధాన రాజ‌కీయ నిర్ణ‌యాలు సాగుతున్నాయి. ప్ర‌జ‌ల్లో ఏం మాట్లాడాల‌న్నా విజ‌య‌సాయి రెడ్డిని, మీడియాలో ఏం మాట్లాడాల‌న్నా.. స‌జ్జ‌ల రామ‌కృష్ణారెడ్డిని సంప్ర‌దించాల్సిన అవ‌స‌రం ఏర్ప‌డుతోంది. ముఖ్యంగా ఫైర్ బ్రాండ్‌లు పేరు తెచ్చుకున్న ఎమ్మెల్యేలు చెవిరెడ్డి భాస్క‌ర‌రెడ్డి, రోజాలను ప్రోత్స‌హించాల్సిన స‌మ‌యంలో వీరిద్ద‌రూ వారి నోళ్లు నొక్కేశార‌నే కామెంట్లు వినిపిస్తున్నాయి.

నిజానికి ప్ర‌తిప‌క్ష ఫైర్ బ్రాండ్లుగా ఒక్కొక్క సంద‌ర్భంలో రోజా, చెవిరెడ్డిలు కొంచెం గీత దాటి ఉండొచ్చు. అయితే, దీనిని నిర్మాణాత్మ‌కంగా స‌రిచేసి వారిని ప్రోత్స‌హించకుండా.. మొత్తానికే ఎస‌రు పెట్టేశారు. అస్స‌లు మీడియాతో మాట్లాడొద్ద‌ని చెవిరెడ్డికి లోట‌స్ పాండ్ నుంచి ఉత్త‌ర్వులు అందాయి. రోజాకు కూడా ఇలానే ఆదేశాలు వెళ్లినా.. ఆమె వెంట‌నే జ‌గ‌న్ దృష్టికి తెచ్చారు. దీనిపై ఇప్పుడు స‌స్పెన్స్ కొన‌సాగుతోంద‌ని స‌మాచారం. ఇక‌, మ‌రో నేత గుడివాడ ఎమ్మెల్యే నాని కూడా ఫైర్ బ్రాండే.. ఈయ‌న‌పైనా కొన్ని ఆంక్ష‌లు న‌డుస్తున్నాయ‌ని స‌మాచారం. ఇలా జ‌గ‌న్ ఇలాంటి మాస్ నేత‌ల‌ను దూరం చేసుకుని, క్లాస్ నేత‌ల‌ను చేర‌దీయడంపై విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి.

ప్ర‌స్తుతం జ‌గ‌న్ ప్ర‌తిష్టాత్మ‌కంగా భావిస్తున్న పాద‌యాత్ర సాగుతోంది. దీనికి మాస్‌లో ఫాలోయింగ్ రావాల్సిన అవ‌స‌రం ఉంది. అన్ని జిల్లాల్లోనూ ప్ర‌త్యేకంగా పాద‌యాత్ర‌పై ప్ర‌చారం సాగాల్సి ఉంది. అదేవిధంగా జ‌నాల్ని మ‌రింత‌గా చేర‌దీసేందుకు పాద‌యాత్ర‌పై జ‌న‌రంజ‌క‌మైన పాటలు ప్ర‌చారం చేయాల్సి ఉంది. అన్ని జిల్లాల్లోనూ స‌న్నాహ‌క యాత్ర‌లు చేప‌ట్టాల్సిన అవ‌స‌రం ఉంది. వీటిపై జ‌గ‌న్ కానీ, ఆయ‌న ప‌క్క‌న సాగుతున్న క్లాస్ లీడ‌ర్లు కానీ దృష్టి పెట్ట‌లేదు. ఒక్క‌సారి మ‌నం బాబు నిర్వ‌హించిన వ‌స్తున్నా మీకోసం పాద‌యాత్ర‌ను తీసుకుంటే.. దీనికి ఎన‌లేని ప్రాధాన్యం ఇచ్చిన టీడీపీ ప్ర‌త్యేకంగా వందేమాత‌రం శ్రీనివాస్‌తో పాట‌లు రాయించుకుని, పాడించుకుని ఊరూరా ప్ర‌చారం చేశారు.

టీడీపీ నేత‌లు స‌న్నాహ‌క యాత్ర‌లు చేశారు. ఇలా మాస్‌ను ఆక‌ట్టుకునే ప్ర‌య‌త్నాలు చేయ‌కుండా.. ఎంత‌సేపూ క్లాస్‌కే ప‌రిమితం అయిపోతే.. పాద‌యాత్ర ముందుకు ఎలా సాగుతుందో జ‌గ‌నే చెప్పాలి. ముఖ్యంగా రాష్ట్రంలో ఎక్కువ మంది మాస్ జ‌నాలే ఉన్నారు. వీరికి పేప‌ర్లు చ‌దివే తీరిక‌, టీవీల్లో వార్త‌లు వినే ఓపిక అస్స‌లు ఉండదు. ఈ విష‌యాన్ని గ‌మ‌నించి వారికి చేరువ అయ్యేలా కార్య‌క్ర‌మాలు రూపొందించాలి. ఇటీవ‌ల విడుద‌లైన శేఖ‌ర్ క‌మ్ముల ఫిదా సినిమాను ఎందరు చూశారో చెప్ప‌డం తేలికే అయితే.. ఆ సినిమాలోని ఓ సాంగ్‌.. “వ‌చ్చిండే.. పిల్లా.. మెల్ల‌గ వ‌చ్చిండే.. “ అనే సాంగ్‌ను సినిమాను చూసిన వారి సంఖ్యకు నాలుగు రెట్ల మంది హ‌మ్ చేస్తున్న ప‌రిస్థితి క‌నిపిస్తోంది. ఇలా హమ్ చేస్తున్న‌వారంతా సినిమా చూసిన వారు కాదు! ఆపాట‌ను అలా మాస్‌కు ద‌గ్గ‌ర‌య్యేలా రాయించుకున్నాడు క‌మ్ముల‌. ఇదే ఐడియా జ‌గ‌న్ అండ్ వైసీపీ నేత‌లు పాటించాల్సి ఉంది. ముందు జానాల నోళ్ల‌లో జ‌గ‌న్ పాద‌యాత్ర ల‌క్ష్యాలు నానితే.. సీఎం క‌ల సాకారం కావ‌డం పెద్ద క‌ష్టం కాబోదు!! మ‌రి ఆదిశ‌గా అడుగులు వేస్తారో లేదో చూడాలి.

 

ఈ క్లాస్ లీడ‌ర్ల‌తో సీఎం క‌ల సాకార‌మ‌య్యేనా జ‌గ‌న్‌..!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts


Share
Share