రాష్ట్ర చ‌రిత్రపై వైఎస్ చెర‌గ‌ని సంత‌కం..!

July 8, 2018 at 12:10 pm
YS Rajashekhar reddy, Birthday Special, Andhra Pradesh

ఉమ్మ‌డి ఏపీ రాజ‌కీయాల‌ను ప‌రిశీలిస్తే.. వైఎస్ రాజ‌శేఖ‌ర‌రెడ్డికి ముందు, త‌ర్వాత అని చెప్పుకోవాల్సి ఉంటుంది. అతిపెద్ద జాతీయ పార్టీ అయిన కాంగ్రెస్ దాదాపు ప‌దేళ్ల‌పాటు అధికారానికి దూరంగా ఉండిపోయిన ప‌రిస్థితి నుంచి వ‌రుస‌గా గెలుపొందే రికార్డును సృష్టించిన ఏకైక నాయ‌కుడు వైఎస్‌. ఎందరో మేధావులు ఉన్న ప్ప‌టికీ.. ప్ర‌జ‌ల్లోకి పార్టీని తీసుకు వెళ్ల‌గ‌లిగిన మొన‌గాడే లేని ప‌రిస్థితి నుంచి తాను ఒక్క‌డై.. తానొక శ‌క్తియై.. అన్న‌చందంగా వైఎస్ విజృంభించారు. పార్టీని అధికారంలోకి తీసుకురావ‌డ‌మే ధ్యేయంగా..రాష్ట్రంలో తొలిసారి ఆయ‌న పాద‌యాత్ర‌కు అంకురార్ప‌ణ చేశారు. బీద‌సా ద‌ల‌ను క‌లిశారు. వారి స‌మ‌స్య‌లు తెలుసుకున్నారు. వారిలో అభ‌యం నింపారు. కాంగ్రెస్‌ను అధికారంలోకి తెచ్చే వ‌ర‌కు ఆయ‌న త‌న‌దైన శైలిలో ముందుకు సాగారు.

రైతుల‌కు 7గంట‌ల ఉచిత విద్యుత్ అనేది అప్ప‌ట్లో క‌ల‌గా ఉన్న అంశ‌మైతే.. దానిని సాకారం చేసేలా వైఎస్‌.. తీసుకున్న నిర్ణ‌యం చ‌రిత్ర పుట‌ల్లో నిలిచిపోయింది. మిగిలిన రాష్ట్రాల‌కు ఇది ఆద‌ర్శంగా నిలిచింది. నిజానికి.. కాంగ్రెస్ వంటి అతి పెద్ద జాతీయ పార్టీలో.. సీఎంల‌కు అంత స్వ‌తంత్రం ఉండ‌దు. ఖ‌జానా ఇక్క‌డ తాళం అక్క‌డ‌! అనే విధంగా కాంగ్రెస్ రాజ‌కీయాలు సాగుతుంటాయి. ఏదైనా రాష్ట్రంలో మంత్రి ప‌ద‌వులు ఇవ్వాల‌న్నా, మంత్రిని తొల‌గించాల‌న్నా.. అధిష్టానం ఆమోద‌ముద్ర ఖ‌చ్చితంగా ఉండి తీరాల్సిందే. కానీ, వైఎస్ విష‌యానికి వ‌చ్చే స‌రికి అంతా డిఫ‌రెంట్‌. ఆయ‌న‌కు కాంగ్రెస్‌లో పూర్తి స్వేచ్ఛా జీవిగా పేరు గ‌డించారు. నేరుగా ఆయ‌న తీసుకునే ఏ నిర్ణ‌యాన్ని కూడా పార్టీ ఏనాడూ ప్ర‌శ్నించింది లేదు.

1978లో పులివెందుల నుంచి తొలిసారిగా ఎమ్మెల్యేగా ఎన్నిక‌య్యారు. త‌రువాత‌ 1983, 1985 ఎన్నిక‌ల్లోనూ వ‌రుస‌గా గెలుపొందారు. ఆ త‌రువాత‌, 1989 ఎన్నిక‌ల్లో క‌డ‌ప లోక్ స‌భ స్థానానికి పోటీ చేసి ఎంపీ అయ్యారు. దీనికి కొన‌సాగింపు న్న‌ట్టుగా మ‌రో మూడుసార్లు ఎంపీ అయ్యారు. అయితే, వ‌రుస‌గా మూడు ద‌శాబ్దాల‌పాటు ఆయ‌న ఎమ్మెల్యేగా, ఎంపీగా ఎక్క‌డ పోటీ చేసినా ఓట‌మి లేని విజ‌యాల‌ను కైవసం చేసుకుంటూ వ‌చ్చారు. అయితే, పార్టీలో నేత‌ల మ‌ధ్య ఉండే స‌హ‌జ ఈర్ష్యా ద్వేషాలు వైఎస్‌ను కూడా ఇబ్బంది పెట్టాయి. ఆయ‌న‌కు ఎలాంటి కీల‌క ప‌ద‌వులు ద‌క్క‌కుండా హైక‌మాండ్ వ‌ద్ద చ‌క్రం తిప్పిన నాయ‌కులు ఉన్నారు. దీంతో ఆయ‌న ఆశించిన మేర‌కు పెద్ద ప‌ద‌వులు ద‌క్క‌లేదు. ఈ నేప‌థ్యంలో జ‌రిగిన ఓ ఘ‌ట‌న‌రాష్ట్రంలో కాంగ్రెస్‌ను వైఎస్ చుట్టూ తిప్పుకొనే ప‌రిస్తితి వ‌చ్చింది.

టీడీపీ హ‌వాతో కాంగ్రెస్ కుదేల‌వుతున్న ప‌రిస్థితి ఏర్ప‌డింది. ఈ నేప‌థ్యంలోనే 2003 వేస‌విలో వైఎస్ సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకున్నారు. రాష్ట్రంలో పాద‌యాత్ర‌కు ఆయ‌న సంక‌ల్పించారు. దీంతో పార్టీలో వైఎస్‌ చుట్టూ ఉన్న‌ ప‌రిస్థితులు ఒక్కొక్క‌టిగా మారుతూ వచ్చాయి. ప్ర‌జ‌ల్లో కాంగ్రెస్‌పై ప్ర‌గాఢ విశ్వాసం పెరిగింది. కాదు కాదు.. వైఎస్ చ‌ల‌వ‌తోనే పెరిగింది. ఇది నేడు అంద‌రూ ఒప్పుకొనే మాట‌. అలాంటి ప‌రిస్థితి నుంచి కాంగ్రెస్‌ను అధికారంలోకి తీసుకు వ‌చ్చే వ‌రకు వైఎస్ విశ్ర‌మించ‌లేదు. ఈ నేపథ్యంలోనే ఆయ‌న మాట‌కు పార్టీలో తిరుగులేకుండా పోయింది. కేవ‌లం 2004లోనే కాకుండా 2009లో కూడా వైఎస్ త‌న ప్ర‌భంజ‌నాన్ని కొన‌సాగించారు. వ‌రుస‌గా గెలుపొందారు.

అయితే, సాధార‌ణంగా ఎక్క‌డైనా ప్ర‌భుత్వాలు వ‌రుస‌గా అధికారంలోకి వ‌స్తూనే ఉంటాయి. కానీ, వైఎస్ కంటూ ప్ర‌త్యేక ముద్ర ఏర్ప‌డ‌డం, రాష్ట్రంలో ఆయ‌న‌కు ఓ చ‌రిత్ర లిఖించ‌బ‌డ‌డం వంటివి అంత ఈజీగా సాకారం కాలేదు. అప్ప‌టికే తొమ్మిదేళ్ల‌పాటు చంద్ర‌బాబు అదికారంలో ఉన్నారు. ఆయ‌న ముద్ర‌ను చెరిపివేయాలి. అంతేకాదు, కాంగ్రెస్ కంటూ .. ప్ర‌త్యేక ఒర‌వ‌డి రాష్ట్ర ప్ర‌జ‌ల నాలుక‌పై నిత్యం సంచ‌రించేలా కొన్ని ప‌థ‌కాల‌ను తీసుకురావాలి. ఇదే త‌ప‌న వైఎస్‌ను ముందుకు న‌డిపించింది. అనుకున్న‌దే త‌డ‌వుగా ఆయ‌న ముందుకు క‌దిలారు. అప‌ర సంజీవ‌నిలా 108కు ప్రాణం పోశారు. రైతుల‌కు 7 గంట‌ల ఉచిత విద్యుత్‌ను అందుబాటులోకి తెచ్చారు. అంత్యంత ప్ర‌తిష్టాత్మ‌కమైన ఫీజు రీయింబ‌ర్స్ మెంట్‌ను అమ‌ల్లోకి తెచ్చారు. ఫ‌లితంగా నాటి నుంచి నేటి వ‌ర‌కు వైఎస్ పేరు తెలుగు ప్ర‌జ‌ల గుండెల‌పై పార్టీల‌కు అతీతంగా నిలిచిపోయింది. సో.. ద‌టీజ్ వైఎస్సార్‌!! చ‌రిత్రలో క‌లిసిపోయేవారు చాలా మంది ఉంటారు. కానీ, చ‌రిత్ర‌లో ఓ అధ్యాయంగా నిలిచిపోయే వైఎస్ లాంటి వారు యుగానికి ఒక్క‌రో ఇద్ద‌రో మాత్ర‌మే జ‌న్మిస్తారు.

రాష్ట్ర చ‌రిత్రపై వైఎస్ చెర‌గ‌ని సంత‌కం..!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts


Share
Share