వైసీపీలో ఉప ఎన్నిక క‌ల‌వ‌రం..!

December 17, 2017 at 1:42 pm
YSRCP, Politics, ys jagan, elections, leaders

ఏపీ ప్ర‌ధాన విప‌క్షం వైసీపీలో ఉప ఎన్నిక‌ల ఫీవ‌ర్ భారీ ఎత్తున క‌నిపిస్తోంది. నేత‌లు ఎవ‌రికి వారే బెంబేలెత్తుతున్నారు. నిజానికి విప‌క్షంలో ఉన్న‌వారు ఎప్పుడు ఎన్నిక‌లు వ‌చ్చినా ఎలాంటి జంకు లేకుండా సై! అనాలి. దీనికి కార‌ణం ప్ర‌భుత్వం ఏర్పాటై మూడున్న‌రేళ్లు గ‌డిచిపోయాయి. దీంతో ప్ర‌జ‌ల్లో ప్ర‌భుత్వంపై తీవ్ర వ్య‌తిరేక‌త ఉంది. దీనిని త‌మ‌కు అనుకూలంగా మ‌లుచుకుని విప‌క్షం ఉరుకులెత్తాలి. కానీ, ఏపీలో మాత్రం ప‌రిస్థితి అందుకు భిన్నంగా క‌నిపిస్తోంది. ప్ర‌జ‌ల్లో స‌రైన టాక్ లేకుండా పోయింది. అధినేత జ‌గ‌న్ నోటి దుర‌ద మొత్తానికే తంటాలు తెచ్చి పెట్టింది. దీంతో ఇప్పుడు నేత‌లు సాధార‌ణ ఎన్నిక‌ల మాట అటుంచి.. ఉప  ఎన్నిక‌లు అంటేనే బెంబేలెత్తుతున్నారు.

ఇటీవ‌ల రాష్ట్రంలో నంద్యాల ఉప ఎన్నిక జ‌రిగింది. ఈ విష‌యంలో జ‌గ‌న్ వైఖ‌రి… గెలుపును అంచుల‌దాకా తెచ్చుకుని ఓట‌మిని మూట‌గ‌ట్టుకోవాల్సి వ‌చ్చింది. ఇక‌, కాకినాడ మునిసిపాలిటీలోనూ ఇదే ప‌రిస్థితి నెల‌కొంది. క‌నీసం వార్డుల్లోనూ వైసీపీ జెండా ఎగ‌ర‌లేక పోయింది. దీంతో వైసీపీ నేత‌ల్లో ఉప పోరు అంటేనే ఉలికి పాటు ఎక్కువ‌గా క‌నిపిస్తోంది. ఇక‌, ఇప్పుడు తాజాగా క‌ర్నూలు జిల్లా స్థానిక సంస్థ‌ల కోటాలో ఎమ్మెల్సీ స్థానానికి ఉప ఎన్నిక ప్ర‌క‌ట‌న విడుద‌లైంది. అయితే, ఈ ప‌రిణామం వైసీపీలో ఉత్సాహాన్ని నింపాల్సింది పోయి.. నిరుత్సాహాన్ని నింపేసింది. ఈ ఎన్నికల బరిలో నిలిచేందుకు జిల్లా నేతలు ముందుకురాడం లేదని తెలుస్తోంది. 

నిజానికి నంద్యాల ఓటమి నుంచి ఇంకా తేరుకోకమునుపే స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు రంగం సిద్ధం కావ‌డాన్ని పార్టీలో సీనియ‌ర్ నేత‌లు సైతం జీర్ణించుకోలేక‌పోతున్నారు. మేలో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో కర్నూలు జిల్లా నుంచి టీడీపీ తరపున గెలిచి మూడు నెలలకే వైసీపిలోకి వెళ్లిన శిల్పా చక్రపాణి రెడ్డి తన ఎమ్మెల్సీ పదవికి రాజీనామ చేశారు. ఆ స్థానానికి ఉప ఎన్నిక షెడ్యూల్‌ను ఎన్నికల సంఘం ప్రకటించింది. ఈ నెల 19న ఉప ఎన్నిక నోటిఫికేషన్ విడుదల కానుంది. 26 వరకు నామినేషన్లు స్వీకరణకు గడువు విధించారు. వచ్చే నెల 12న పోలింగ్‌, 16న కౌంటింగ్‌ జరగనుంది. ఇక‌, దీనిని ప్ర‌తిష్టాత్మ‌కంగా తీసుకునేందుకు అధికార టీడీపీ ఇప్ప‌టికే దృష్టి పెట్టింది.

అభ్య‌ర్థుల లిస్టును ఖ‌రారు చేసేందుకు మంత్రుల బృందం రెండు రోజుల  కిందట భేటీ అయింది. అయితే, వైసీపీలో మాత్రం నేతలు ఎమ్మెల్సీ బరిలో దిగేందుకు ముందుకు రావ‌డం లేద‌ని స‌మాచారం.  ఈ నేపధ్యంలో వచ్చే బుధవారం కర్నూలు జిల్లా నేతలతో జగన్ తాను పాదయాత్ర నిర్వహిస్తున్న ప్రాంతంలో సమావేశం ఏర్పాటు చేసినట్లు పార్టీ నేతలు చెబుతున్నారు. జిల్లాకు సంబందించిన నేతలంతా ఈ సమావేశానికి హాజరుకావాలనే సందేశం ఇప్పటికే పంపినట్లు సమాచారం. గతంలో ఇదే ఎమ్మెల్సీ స్థానానికి టీడీపీ, వైసీపి నుంచి హోరాహోరాగా పోటీపడిన శిల్పా చక్రపాణి రెడ్డి, గౌరు వెంకట్ రెడ్డి ఇద్దరూ ఇప్పుడు వైసీపిలో ఉండగా ఇప్పుడు వీరిద్దరూ పోటీకి సిద్దంగా లేనట్లు సమాచారం. అయితే, ఈ సారి మళ్లీ ఎన్నికకు వెళ్లడం అంటే అంత ఆర్థిక స్థోమత తనకు లేదని తన సన్నిహితుల వద్ద గౌరు వెంకట్‌రెడ్డి వాపోయినట్లు సమాచారం. మరో వైపు శిల్పా బ్రదర్స్ పోటీపై బిన్న అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. దీంతో ఎమ్మెల్సీ ఉప ఎన్నిక‌లో అభ్య‌ర్థి దొరికే అవ‌కాశం క‌నిపించ‌డం లేద‌ని అంటున్నారు వైసీపీ నేత‌లు. మ‌రి జ‌గ‌న్ ఎలా ముందుకు వెళ్తాడో చూడాలి. 

 

వైసీపీలో ఉప ఎన్నిక క‌ల‌వ‌రం..!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts


Share
Share