ఏపీ పాలిటిక్స్‌లో సంచ‌ల‌నం.. జ‌గ‌న్ టీం రెడీ..!

May 6, 2018 at 11:33 am
YSRCP, promotion, sajjala Ramakrishna reddy, new team, party, ys jagan

రాజ‌కీయాల్లో సంచ‌ల‌నాలు లేందే మ‌జా ఏముంటుంది ? ఇప్పుడు అలాంటి సంచ‌ల‌నాల‌కే వైసీపీ అధినేత జ‌గ‌న్ తెర‌దీశారు. త‌న‌పార్టీని వ‌చ్చే ఎన్నిక‌ల్లో అధికారంలోకి తీసుకువ‌చ్చేందుకు ఆయ‌న ఎంత‌గా శ్ర‌మిస్తున్నారో అంద‌రికీ తెలిసిందే. ప్ర‌ధానంగా ప్ర‌జాసంక‌ల్ప యాత్ర ద్వారా ప్ర‌జ‌లకు చేరు వ అయ్యేందుకు కృషి చేస్తున్నారు. పార్టీని ప్ర‌జల‌కు మ‌రింత చేరువ చేసేందుకు గ్రామ స్థాయికి కూడా పార్టీని ప‌టిష్టం చేసేందుకు జ‌గ‌న్‌.. ఎంతో కృషి చేస్తున్నాడు. ఈ క్ర‌మంలో మ‌రో సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకుని అమ‌లు చేశాడు. ఫ‌లితంగా రాష్ట్రంలో రాబోయే రోజుల్లో వైసీపీ మ‌రింత‌గా బ‌ల‌ప‌డుతుంద‌ని అంటున్నారు విశ్లేష‌కులు. 

 

విష‌యంలోకి వెళ్తే.. వ‌చ్చే ఏడాది ఎన్నిక‌ల‌కు సంబందించి ఎన్నిక‌ల బూత్ లెవిల్‌లో పార్టీని ప‌టిష్టం చేసేందుకు జ‌గ‌న్ ప‌క్కా వ్యూహం సిద్దం చేసుకున్నాడు. దాదాపు రాష్ట్రంలోని 44 వేల బూత్‌ల‌కు సంబంధించి క‌న్వీన‌ర్ల‌ను ఏర్పాటు చేయాల‌ని నిర్ణ‌యించుకున్నారు. అయితే, పార్టీని న‌డిపించేది, ఎన్నిక‌ల్లో పార్టీకి విజ‌యం చేకూర్చే స్థాయికి చేర్చేది బూత్ క‌న్వీన‌ర్లే కాబ‌ట్టి వారిని ఎలా బ‌డితే అలా కాకుండా సుశిక్షితుల‌ను చేయాల‌ని జ‌గ‌న్ నిర్ణ‌యించుకున్నారు. ఈ క్ర‌మంలోనే మొత్తం 44 వేల మంది బూత్ క‌న్వీన‌ర్ల‌కు అన్ని విధాలా పార్టీ ప‌రంగా శిక్ష‌ణ ఇచ్చారు. 

 

ఈ క్ర‌మంలోనే వారికి ఒంగోలు కేంద్రంగా పార్టీ త‌ర‌ఫున భారీ ఎత్తున శిక్ష‌ణ ఇచ్చారు. బూత్‌ కన్వీనర్లు పార్టీకి సుశిక్షితులైన సైన్యంలా యుద్ధానికి సిద్ధం కావాలని ఈ సంద‌ర్భంగా వారికి నూరిపోస్తున్నారు. ప్ర‌ధానంగా గ్రామ స్థాయిలో పార్టీని ప‌టిష్టం చేసేది. పార్టీకి అవ‌స‌ర‌మైన అన్ని చ‌ర్య‌లు తీసుకుని పార్టీని అధికారంలోకి తీసుకు వ‌చ్చే బాధ్య‌త కూడా వారిదేన‌ని చెబుతూ వారిని కార్యోన్ముఖుల‌ను చేస్తున్నారు. బూత్‌ పరిధిలో నిత్యం ప్రజలతో మమేకమై, పార్టీని, పార్టీ సిద్ధాంతాల‌ను ప్ర‌జ‌ల్లోకి తీసుకు వెళ్లాల‌ని క‌న్వీన‌ర్ల‌కు బోధిస్తున్నారు. 

 

ముఖ్యంగా పార్టీ ప్లీన‌రీలో తీసుకున్న నిర్ణ‌యాల మేర‌కు న‌వ‌ర‌త్నాల‌ను ప్ర‌జ‌ల్లోకి తీసుకు వెళ్లాల‌ని సూచిస్తున్నారు. ఈ క్ర‌మంలో పార్టీ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి, మాజీ రెసిడెంట్ ఎడిట‌ర్ స‌జ్జ‌ల రామ‌కృష్ణారెడ్డి క‌న్వీన‌ర్ల శిక్ష‌ణ‌లో పాలుపంచుకుంటున్నారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న పార్టీ విధివిధానాలు, సిద్ధాంతాల‌ను వారికి బోధిస్తున్నారు. పార్టీ అధిష్టానం నుంచి నేరుగా బూత్‌ కమిటీ కన్వీనర్ల ఫోన్స్‌కి సందేశాలు వస్తాయి వాటిని గ్రామ స్థాయిలో ప్రజల్లోకి తీసుకెళ్లాల‌ని ఆయ‌న చెబుతున్నారు. రానున్న ఎన్నికల్లో 25 ఎంపీ స్థానాలు గెలుచుకుంటే కేంద్రంపై ఒత్తిడి చేసి రాష్ట్ర ప్రయోజనాలు కాపాడుకోవచ్చ‌ని ఈ బాధ్య‌త క‌న్వీన‌ర్ల‌పైనే ఉంద‌ని అంటున్నారు. 

 

బీజేపీతో వైసీపీ పొత్తు ఉంటుంద‌ని అంటూ జ‌రుగుతున్న ప్ర‌చారాన్ని తిప్పికొట్టాల‌ని కూడా స‌జ్జ‌ల పిలుపునిచ్చారు. ఇదే విష‌యాల‌ను గ్రామ స్థాయిలో తిప్పికొట్టాల‌ని పిలుపునిచ్చారు. బీజేపీతో సంబంధాలు ఉంటే 13 సార్లు కేంద్రంపై అవిస్వాసం పెడతామా?. అవిస్వాసం పెట్టడమంటే బీజేపీకి వ్యతిరేకంగా పోరాడటమే. క్షేత్రస్థాయిలో మీరు జగన్‌ ప్రతినిధిలా నిజాయితీగా పనిచేస్తే 160 అసెంబ్లీ స్థానాల్లో గెలుస్తాం. పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా గ్రామ స్థాయిలో బూత్‌ కన్వీనర్లదే కీలక పాత్ర’ అని స‌జ్జ‌ల‌ పేర్కొన్నారు. త్వ‌ర‌లోనే వీరంతా గ్రామాల‌కు చేరి బూత్ క‌న్వీన‌ర్లుగా బాధ్య‌త‌లు చేప‌ట్ట‌నున్నారు. దీంతో పార్టీకి అవ‌స‌ర‌మైన మేర‌కు బ‌లం చేకూరుతుంద‌ని జ‌గ‌న్ భావిస్తున్నారు. మ‌రి ఈ దెబ్బ‌తో టీడీపీ ఓటు బ్యాంకు వైసీపీ ఖాతాలోకే చేరుతుంద‌ని అంటున్నారు విశ్లేష‌కులు. మ‌రి ఏం జ‌రుగుతుందో చూడాలి. 

 

ఏపీ పాలిటిక్స్‌లో సంచ‌ల‌నం.. జ‌గ‌న్ టీం రెడీ..!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts


Share
Share