జ‌గ‌న్ పార్టీలోకి సీనియ‌ర్లు క్యూ క‌డుతున్నారా… అస‌లేం జ‌రిగింది

February 24, 2018 at 4:22 pm
YSRCP, TDP, Congress, Leaders, Party, Seniors

రాష్ట్రంలో టీడీపీ, బీజేపీ మ‌ధ్య మిత్ర బంధానికి బీట‌లు వారుతున్నాయి, రేపో మాపో ఈ బంధం తెగిపోతుంద‌ని అంతా భావిస్తున్నారు. ఇదే స‌మ‌యంలో రాష్ట్రం ప‌ట్ల బీజేపీ, టీడీపీ వ్య‌వ‌హ‌రిస్తున్న తీరుతో ఇరు పార్టీల‌పై ప్ర‌జ‌ల్లో వ్య‌తిరేక‌త వ్య‌క్త‌మ‌వుతోంది. దీనిని త‌గ్గించే క్ర‌మంలో ఇరు పార్టీల నాయ‌కులు త‌ల‌మున‌క‌లై ఉన్నారు. ఇదే స‌మ‌యంలో టీడీపీ లోని కొంద‌రు నాయ‌కుల్లో గుబులు మొద‌లైందని తెలుస్తోంది. ప్ర‌తిప‌క్షం వైసీపీ నుంచి టీడీపీలోకి వెళ్లిన నేత‌లు ఆందోళ‌న చెందుతున్నార‌ట‌. ఒక‌ప‌క్క నియోజ‌క‌వ‌ర్గాల పున‌ర్విభ‌జ‌న మాటే రావ‌డం లేదు. మ‌రో ప‌క్క ఎన్నిక‌లకు స‌మ‌యం ద‌గ్గ‌ర‌పడుతుండ‌టంతో.. పార్టీలో కొత్త‌గా చేరిన వారితో పాటు టీడీపీలోకి వెళ్లాల‌నుకునే వారు కూడా ఇప్పుడు వైసీపీ వైపు చూస్తున్నార‌నే చ‌ర్చ పొలిటిక‌ల్ వ‌ర్గాల్లో మొద‌లైంది.

 

విభ‌జ‌న జ‌రిగి నాలుగేళ్లు గ‌డుస్తున్నా నియోజ‌క‌వ‌ర్గాల పెంపు అంశంపై ఒక కొలిక్కి రాక‌పోవ‌డంతో ఇరు వ‌ర్గాల సీఎంలు టెన్ష‌న్ ప‌డుతున్నారు. తెలంగాణ‌లో కొంత వ‌ర‌కూ ప‌రిస్థితి మెరుగ్గానే ఉన్నా.. ఏపీలో మాత్రం ప‌రిస్థితి చేయి దాటిపోతోంది. కాంగ్రెస్‌లో బ‌ల‌మైన నేత‌లు కొంద‌రు ఏదో ఒక పార్టీ వైపు చూస్తున్నారు. ఇప్ప‌టివ‌ర‌కూ వీరు టీడీపీలో చేరేందుకు సిద్ధ‌మ‌య్యార‌నే వార్త‌లు వినిపించాయి. మ‌రోప‌క్క వైసీపీ నుంచి 23 మంది ఎమ్మెల్యేలు టీడీపీలో చేరిపోయారు. నియోజ‌క‌వ‌ర్గాల సంఖ్య పెరుగుతుంద‌ని, వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఎటువంటి ఇబ్బంది ఉండ‌దని చెప్పి ఇప్ప‌టివ‌ర‌కూ సీఎం చంద్ర‌బాబు.. అంద‌రికీ స‌ర్దిచెబుతూ వ‌స్తున్నారు. అయితే కేంద్రంతో టీడీపీ సంబంధాలు తెగిపోయే ప‌రిస్థితి ఉన్న త‌రుణంలో.. ఇప్పుడు సీనియ‌ర్ నేత‌ల్లో అల‌జ‌డి మొదలైంది. 

 

నియోజకవర్గాల పునర్విభజన జరుగుతుందని చంద్రబాబు ప్రతిపక్ష వైసీపీ నుంచి 23 మంది ఎమ్మెల్యేలను పార్టీలో చేర్చుకున్నారు. ఆ నియోజకవర్గాల్లో కూడా టీడపీ, వైసీపీ నుంచి వెళ్లిన ఎమ్మెల్యేల మధ్య యుద్ధమే నడుస్తోంది. ఈ తరుణంలో నియోజకవర్గాలు పెరుగుతాయని భావించి కాంగ్రెస్ నేతలు కొండ్రు మురళి, మానుగుంట మహీధర్ రెడ్డి, డీఎల్ రవీంద్రారెడ్డి లాంటి వాళ్లు టీడీపీలోకి వెళ్లేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు. తాము ఆశించిన నియోజకవ ర్గాల్లో టీడీపీ నేతలు బలంగా ఉండటంతో.. పునర్విభజన జరిగితే అక్కడి టీడీపీ నేతలను పక్క నియోజకవర్గానికి పంపించి తమకు టిక్కెట్లు చంద్రబాబు ఇస్తారని ఆలోచించారు. ఇప్పుడు నియోజకవర్గాల పెంపుపై ఆశలు వదులుకున్నట్లేన‌ని తేలిపోవ‌డంతో  వీరిలో చాలామంది వైసీపీ వైపు చూస్తున్నట్లు సమాచారం. 

 

ఇక వైసీపీ అధినేత జగన్ దృష్టికి కూడా కొందరు టీడీపీ, కాంగ్రెస్ నేతల జాబితా చేరింది. వారు చేరేందుకు ఉత్సాహం చూపుతున్నట్లు తేలింది. ఈ జాబితాను ప్రశాంత్ కిషోర్ టీం కు జ‌గ‌న్‌ అప్పగించినట్లు సమాచారం. కొన్ని నియోజక వర్గాల్లో వైసీపీ నేతలు పార్టీ పరంగా సక్రమంగా పనిచేయడం లేదని ఇప్పటికే సర్వేల్లో వెల్లడైంది. మూడున్నరేళ్లు నియోజకవర్గంలో అందుబాటులో ఉండకుండా, జగన్ పాదయాత్ర ప్రారంభమైన తర్వాత నియోజకవర్గానికి చేరుకున్న వారు కూడా లేకపోలేదు. ఈ నేపథ్యంలో వీరిపై స‌ర్వే నిర్వ‌హిస్తున్నార‌ని తెలుస్తోంది. పార్టీలోకి వ‌చ్చే వారిపై స‌ర్వే నిర్వ‌హించి.. లాభ‌న‌ష్టాలు బేరీజు వేసుకుని.. అనంత‌రం వీరిని పార్టీలోకి ఆహ్వానిస్తార‌ని తెలుస్తోంది. నియోజకవర్గాల పెంపు నిలిచిపోవడం జ‌గ‌న్‌కు మేలు చేసింద‌ని విశ్లేష‌కులు అభిప్రాయ‌ప‌డుతున్నారు. 

 

జ‌గ‌న్ పార్టీలోకి సీనియ‌ర్లు క్యూ క‌డుతున్నారా… అస‌లేం జ‌రిగింది
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts


Share
Share